Share News

వినతులను పరిష్కరించండి

ABN , Publish Date - May 06 , 2025 | 12:10 AM

మీకోసంలో వచ్చిన వినతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు.

వినతులను పరిష్కరించండి
గ్రీవెన్స్‌లో వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే5(ఆంధ్రజ్యోతి): మీకోసంలో వచ్చిన వినతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన మీకోసం కార్యక్రమంలోజిల్లా నలుమూలల నుంచి వచ్చినవారి నుంచి 154అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా మా ట్లాడుతూ అర్జీలను పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలన్నారు. కిందిస్థాయి అధికారులపై ఆధారపడ కుండా ఉన్నతాధికారులే క్షేత్రస్థాయికి వెళ్లాలని కోరారు.ప్రతిఅర్జీకి సత్వర న్యాయం చేకూర్చడమే లక్ష్యమని తెలిపారు. కాగా డిగ్రీఆపైన చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు విభిన్నప్రతిభావంతులశాఖ ఆధ్వర్యంలో ఐదు ల్యాప్‌ టాప్‌లు, టచ్‌ఫోన్‌ కలెక్టర్‌ పంపిణీ చేశారు.కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, సహాయకలెక్టర్‌ పృథ్వీరాజ్‌కుమార్‌, ఉపకలెక్టర్‌ పద్మావతి, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా పాల్గొన్నారు.

పింఛన్‌ మంజూరుచేసి ఆదుకోండి

తమకు పింఛన్‌మంజూరుచేసి ఆదుకోవాలని రణస్థలం మండలంలోని జీరుపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగ అక్కాతమ్ముళ్లు సూరాడ సంతోషి, శ్రీరామ్‌ కోరారు. వారిద్దరూ పుట్టుకతో దివ్యాంగులు కావడంతో మంచానికి పరిమితమయ్యారు. దీంతో కుటుంబసభ్యులు సపర్యలు చేయాల్సివస్తోంది. దీనితోడు పేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేయా లని సోమవారం శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశం మంది రంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు విన్నవించారు.

హెచ్‌ఎం, డీఈవోలను సస్సెండ్‌ చేయాలి

తమ కుమారుడు కంటిచూపు కోల్పోవడానికి కారకు లైన ఉపాధ్యాయుడు నగిరిఅరుణ్‌కుమార్‌, తప్పుడు సమా చారం ఇచ్చిన హెచ్‌ఎం టి.శోభారాణి, డీఈవోను సస్పెండ్‌ చేయాలని బాధితుడు చెన్నాకుమార్‌ కుటుంబసభ్యులు కోరారు. పైడిభీమవరం జడ్పీహెచ్‌ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న చెన్నాకుమార్‌ గతఏడాది అక్టోబరు పదోతేదీన కంటి చూపు కోల్పోయిన విషయం విదితమే. ఈనేపథ్యంలో న్యాయం చేయాలని గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు కుటుంబ సభ్యు లు వినతిపత్రం అందజేశారు. ఘటనకు కారకులైన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, చికిత్సనిమిత్తం అర్థిక సహాయం చేయాలని డీఆర్వో నివేదిక ఇచ్చినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. చెన్నాకుమార్‌ చదువు, ఆరోగ్యం, భవిష్యత్తుకు ప్రభుత్వమే సహకరించాలని కోరారు.

వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలపై గోడపత్రిక ఆవిష్కరణ

స్థానిక జడ్పీ కార్యాలయంలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, సేవలపై అవగాహన కల్పించేందుకు గోడ పత్రికను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈసేవల ద్వారా ప్రజలు 9552300009 నెంబర్‌కు వాట్సాప్‌లో హాయ్‌ అని మెసేజ్‌పంపి లైసెన్స్‌లు, పన్నులు, రసీదులు, పరీక్ష ఫలితాలు, టికెట్‌ బుకిం గ్‌ వంటి 200పైగా ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చని తెలిపారు.

కోతకు గురవుతున్న ప్రాంతాల్లో గోడ నిర్మించాలి

అరసవల్లి, మే 5(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని కుందువానిపేట, పెద్ద గనగళ్లవానిపేట వద్ద సముద్రపు అలల తాకిడికి కోతకు గురవుతున్న ప్రాంతాల్లో గోడ నిర్మించాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ కోరారు.ఈమేరకు స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో చర్చించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - May 06 , 2025 | 12:10 AM