జీఎస్టీ సంస్కరణలతో ఊరట
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:09 AM
GST price reduction ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చేశాయి. నిత్యావసర సరుకులు, వాహనాలు, ఇన్సూరెన్స్ పాలసీల... ఇలా వీటన్నింటిపై జీఎస్టీ తగ్గింది. ఈ క్రమంలో చాలా వస్తువుల ధరలు తగ్గాయనే చర్చ సాగింది.
ధరల తగ్గింపుపై అంతటా చర్చ
జిల్లాలో తొలిరోజు మిశ్రమ స్పందన
శ్రీకాకుళం/నరసన్నపేట, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చేశాయి. నిత్యావసర సరుకులు, వాహనాలు, ఇన్సూరెన్స్ పాలసీల... ఇలా వీటన్నింటిపై జీఎస్టీ తగ్గింది. ఈ క్రమంలో చాలా వస్తువుల ధరలు తగ్గాయనే చర్చ సాగింది. ధరలు తగ్గితే తమకు ఊరట లభించనుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. కాగా తొలిరోజు జిల్లావాసుల్లో మిశ్రమ స్పందన కనిపించింది. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, టెక్కలి, నరసన్నపేట, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, పాతపట్నం వంటి పట్టణాల్లోని షాపింగ్ మాల్స్‌లో కొనుగోలుదారులు పెద్దగా లేరు. కానీ నిత్యావసరాల సరుకులు, మందుల దుకాణాల వద్ద మాత్రం కాస్త రద్దీ కనిపించింది. జీఎస్టీ సవరణతో నిత్యావసర సరుకుల సంబంధించి సుమారు 13శాతం వరకు ఆదా అవుతుంది. కిరాణా సామగ్రి, వ్యవసాయ పరికరాలు, వస్త్రాలు, మందులు, ఆటోమొబైల్స్ వంటివాటిలో 375 రకాల వస్తువులు ధరలు తగ్గాయి. జీఎస్టీ తగ్గింపుతోపాటు ఆదాయపు పన్నును రూ.12 లక్షల వరకు మినహాయించడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట లభించనుంది.
మంచిరోజు కోసం ఎదురుచూపు
జిల్లాలో దసరా, దీపావళి సమయాల్లో చాలా మందికి కొత్తవస్తువులు కొనుగోలు చేయడం సెంటిమెంట్. జీఎస్టీ సవరణతో కారులు, బైక్‌లు, ఏసీలు, టీవీల ధర బాగా తగ్గిందనే ప్రచారం సాగింది. రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్ల ధర కూడా తగ్గిందని సమాచారం అంతటా తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలుగులో జీఓ 582ను విడుదల చేసింది. ఏ వస్తువుపై ఎంత శాతం జీఎస్టీ తగ్గిందీ అన్నదీ.. అందులో స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువులతో పాటు.. కారులు, ఏసీలు, టీవీలు వంటివాటిపై ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయనే దానిపై ప్రజలు ఆరా తీస్తున్నారు. జీఎస్టీ ధరను తగ్గించి వ్యాపారులు విక్రయిస్తున్నారో లేదోనని పరిశీలిస్తున్నారు. గందరగోళం లేకుండా త్వరలో మంచిరోజున తమకు అవసరమైన వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. దీంతో తొలిరోజు జిల్లాలో పెద్దగా విక్రయాలు జరగలేదు. అలాగే జిల్లా జీఎస్టీ అధికారులు కూడా ప్రజలకు అవగాహన కలిగించేలా తెలుగులో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను అందరికీ పంపుతున్నారు.
మరిన్ని ఆఫర్లు
జీఎస్టీ తగ్గింపుతో పలు వాహన షోరూమ్‌లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు ధరల వివరాలను ప్రదర్శిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దసరాకు అత్యధికంగా దిచక్రవాహనాలు కోనుగోలు చేస్తారు. జిల్లాలో శ్రీకాకుళం, నరసన్నపేట, కాశీబుగ్గ, టెక్కలి, ఆమదాలవలస తదితర పట్టణాల్లో దిచక్రవాహనాల కొనుగోలు ముమ్మరంగా సాగుతాయి. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. దీంతో పలు షోరూమ్‌లు జీఎస్టీ తగ్గింపు ధరలో ప్లెక్సీలను ఏర్పాటు చేసి.. బహుమతులు కూడా ప్రకటిస్తున్నాయి. దీంతో ఈసారి దసరాకు మరింత విక్రయాలు పెరగనున్నాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జీఎస్టీ రద్దుతో సంబరాలు
బీమాపాలసీపై జీఎస్టీ రద్దుతో బీమా రంగానికి జీవం వచ్చిందని ఎల్‌ఐసీ డీవోలు, ఏజెంట్లు, సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం నరసన్నపేట ఎల్‌ఐసీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఎల్‌ఐసీ ప్రీమియంపై జీఎస్టీ రద్దు చేయడం ద్వారా ప్రజలపై భారం తగ్గుతుందని, బీమా రంగం బలోపేతానికి దోహదపడుతుందన్నారు. కార్యాక్రమంలో బ్రాంచ్ మేనేజర్ నేతాజీ, డీవో వెంకటేశ్వరరావు, సంఘ నాయకులు గడ్డేసు, ఎల్‌వీ రమణ, పి.చంద్రశేఖర్, రమణయ్యరాజు, మెండ చిన్నవాడు పాల్గొన్నారు.