Share News

Granite: నీలిరంగు గ్రానైట్‌కు ఊరట

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:32 PM

Granite Industry ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినేట్‌ మంగళవారం తీసుకున్న నిర్ణయాలు జిల్లాలో నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమకు ఊరటనిచ్చాయి. గత ప్రభుత్వం గ్రానైట్‌ పరిశ్రమకు అనేక ఆంక్షలు విధించడంతో పూర్తిగా నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమ కుదేలైంది.

Granite: నీలిరంగు గ్రానైట్‌కు ఊరట
నీలిరంగు గ్రానైట్‌ క్వారీ

  • - కన్స్‌డరేషన్‌ ఫీజులు రద్దు

  • - క్వారీల లీజు కేటాయింపులో వేలం విధానానికి స్వస్తి

  • టెక్కలి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినేట్‌ మంగళవారం తీసుకున్న నిర్ణయాలు జిల్లాలో నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమకు ఊరటనిచ్చాయి. గత ప్రభుత్వం గ్రానైట్‌ పరిశ్రమకు అనేక ఆంక్షలు విధించడంతో పూర్తిగా నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమ కుదేలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా క్యాబినేట్‌ నిర్ణయాలపై గ్రానైట్‌ యాజమాన్యాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. గ్రానైట్‌ లీజులకు సంబంధించి దరఖాస్తు నుంచి రద్దు వరకు, రెన్యువల్‌ నుంచి బదిలీ వరకు అంతా పారదర్శకంగా ఉండేందుకు డిజిటల్‌ గవర్నెన్సీ చేపట్టాలని కేబినెట్‌లో నిర్ణయించారు. 2021లో కోవిడ్‌-19 ఖర్చులు నిమిత్తం సీనరీస్‌ చార్జీలతోపాటు పెంచిన వందశాతం కన్స్‌డరేషన్‌ పన్నులు పూర్తిగా ఎత్తివేశారు. కొత్త లీజులకు, గరిష్ఠ కాలపరిమితి 20 ఏళ్ల నుంచి 30ఏళ్లకు, రెన్యువల్స్‌కు 15 నుంచి 20ఏళ్లకు పెంచారు. గ్రానైట్‌ క్వారీల లీజుల డెడ్‌రెంట్లు సైతం సవరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో త్రైమాసిక విధానం ఉండగా వాటిని వార్షికంగా లీజులు చెల్లించే విధంగా నిబంధనలు రూపొందించింది. రెన్యువల్స్‌ ప్రీమియం పదిరెట్ల వార్షిక డెడ్‌రెంట్‌ నుంచి ఐదురెట్ల వార్షిక డెడ్‌రెంట్‌కు తగ్గించారు. అలాగే ఇది రెండు దశల్లో చెల్లించవచ్చును. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని క్యాబినేట్‌లో నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన వేలాం విధానాన్ని తొలగించి గతంలో ఉన్నట్లు మొదటగా దరఖాస్తు చేసుకున్న వారికి అన్నీ సక్రమంగా ఉంటే లీజులు కేటాయింపులకు అనుమతులు ఇవ్వనున్నారు. గ్రానైట్‌ క్వారీలకు సంబంధించి పలు పెండింగ్‌ కేసులు పరిష్కారానికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. జరీమానాలు కూడా పదిరెట్ల సీనరీస్‌ ఫీజు నుంచి రెండు రెట్లుకు, ఐదురెట్ల సీనరీస్‌ ఫీజ్‌ ఒక రెట్టుకు తగ్గించారు. ఫలితంగా ప్రభుత్వానికి రెవెన్యూ సులభంగా వసూలుకానుంది. గ్రానైట్‌ యాజమాన్యాలకు ఊరట లభించనుంది.

Updated Date - Apr 15 , 2025 | 11:32 PM