No Registered post : రిజిస్టర్ పోస్టుకు సెలవు!
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:15 AM
merged with speed post ప్రజలతో పోస్టల్ శాఖది విడదీయరాని బంధం. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రాని రోజుల్లో సమాచార వ్యవస్థకు ఉన్న ఏకైక దిక్కు పోస్టల్. ఈ శాఖ కాలంతోపాటు మారుతూ.. ప్రైవేటు సంస్థలకు దీటుగా సమాచార సేవను కొనసాగిస్తోంది.
స్పీడ్ పోస్టులో విలీనం
సెప్టెంబరు 1 నుంచి అమలు
తపాలాశాఖ కీలక నిర్ణయం
ఇచ్ఛాపురం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ప్రజలతో పోస్టల్ శాఖది విడదీయరాని బంధం. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రాని రోజుల్లో సమాచార వ్యవస్థకు ఉన్న ఏకైక దిక్కు పోస్టల్. ఈ శాఖ కాలంతోపాటు మారుతూ.. ప్రైవేటు సంస్థలకు దీటుగా సమాచార సేవను కొనసాగిస్తోంది. పౌరసేవలు, ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సైతం అందిస్తోంది. కాగా బ్రిటీష్ కాలం నాటిదైన రిజిస్టర్ పోస్టును స్పీడ్ పోస్టు విభాగంలో విలీనం చేయాలని భారత తపాలాశాఖ నిర్ణయించింది. సెప్టెంబరు 1 నుంచి దీనిని అమలు చేయనుంది. అంటే ఇకపై పోస్టల్‌శాఖలో రిజిస్టర్ పోస్టు కనుమరుగు కానుంది.
బ్రిటీష్ కాలం నాటిది..
పోస్టల్ శాఖలో రిజిస్టర్ పోస్టుది సుదీర్ఘ చరిత్ర. 1854లో రిజిస్టర్ పోస్టు సేవలను అప్పటి బ్రిటీష్ చక్రవర్తి లార్డ్ డల్హౌసి ప్రవేశపెట్టారు. అప్పటి ఇండియన్ పోస్టాఫీస్ చట్టంతో రిజిస్టర్ పోస్టు సేవలు మొదలయ్యాయి. అంతకు ముందు 1766లో వారెన్ హేస్టింగ్ ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో ‘కంపెనీ మెయిల్’ ప్రారంభమైంది. దాదాపు 171 సంవత్సరాల పాటు రిజిస్టర్ పోస్టు సేవలందించింది. ముఖ్యమైన పత్రాలను, వస్తువులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. ముఖ్యంగా లీగల్ నోటీసులు, అపాయింట్‌మెంట్ లెటర్లు, బ్యాంకింగ్ సంబంధిత పత్రాలను వంటివాటిని పంపడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. పంపించిన వస్తువు, పత్రం అవతలి వారికి చేరినట్టు రశీదు(డెలివరీ ప్రూఫ్) పొందడం దీని ప్రత్యేకత. ఇది చట్టపరంగా కూడా ఎంతో విలువైనది.
ఆధునికీకరించేందుకే..
పోస్టల్ సేవలను మరింత ఆధునికీకరించేందుకు తపాలాశాఖ రిజిస్టర్ పోస్టు విలీనంపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశీయ పోస్టల్ సేవలను క్రమబద్ధీకరించడం, పనితీరు మెరుగుపరచుకోవడం, ట్రాకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటివి విలీన ప్రక్రియకు కారణాలుగా తెలుస్తోంది. స్పీడ్ పోస్టు అనేది వేగవంతమైన డెలివరీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పుడు రిజిస్టర్ పోస్టుల సేవలు స్పీడ్‌పోస్టులో విలీనమైతే.. డెలివరీలు మరింత వేగవంతం అవుతాయి. ముఖ్యంగా స్పీడ్ పోస్టు ద్వారా మీ పార్సిల్ ఎక్కడికి వెళ్లిందో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే సౌకర్యం సైతం ఉంటుంది. ఈ ఆప్షన్ రిజిస్టర్ పోస్టులో లేదు. అలాగే ఒకే సేవ ఉండడం వల్ల పోస్టల్ సేవలు మరింత సులువవుతాయి. సిబ్బందిపై పనిభారం కూడా తగ్గుతుంది. అయితే ప్రభుత్వ శాఖలే ఎక్కువగా రిజిస్టర్ పోస్టు సేవలను వినియోగించుకునేవి. అన్నిరకాల ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ రిజిస్టర్ పోస్టు ద్వారా చేసేవి. అందుకే ముందుగా పోస్టల్ శాఖ ప్రభుత్వ శాఖలకు ఈ విషయంపై సమాచారం అందించింది. సెప్టెంబరు 1న విలీన ప్రక్రియ ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. కాగా రిజిస్టర్ పోస్టును నిలిపివేస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. స్పీడ్‌పోస్టులో విలీనం చేస్తే రుసుం పెరుగుతుందని, అదనపు భారం తప్పదని భావిస్తున్నారు. రిజిస్టర్ పోస్టు చార్జీ రూ.26 ఉంటే.. స్పీడ్ పోస్టు చార్జీ రూ.41 వరకూ ఉంటుందని పేర్కొంటున్నారు. స్పీడ్ పోస్టు చార్జీలు తగ్గించాలని కోరుతున్నారు.
వాస్తవమే
స్పీడ్ పోస్టులో రిజిస్టర్ పోస్టు విలీనం వాస్తవమే. సెప్టెంబరు 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్టు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. వినియోగదారులకు మరింత వేగంగా సేవలందిస్తాం.
- షణ్ముఖరావు, ఇన్‌చార్జి పోస్టుమాస్టర్, ఇచ్ఛాపురం
............
ఎన్నో సౌలభ్యతలుండేవి
రిజిస్టర్ పోస్టు వచ్చిందంటే ఆనంద సమాచారమే. ఎక్కువగా ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్‌మెంట్లు వచ్చేవి. లీగల్ నోటీసులు సైతం రిజిస్టర్ పోస్టుల్లోనే పంపేవారు. ఎన్నో సౌలభ్యతలు సొంతమైన రిజిస్టర్ పోస్టు కనుమరుగవుతుండడం బాధాకరం.
- దాసరి రాజు, ఇచ్ఛాపురం