Share News

రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:19 AM

జిల్లాలో కొందరు మిల్లర్లు రేషన్‌ బియ్యంను రీసైక్లింగ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

 రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌

గ్రామాల్లో కిలో రూ.18కు కొనుగోలు

వాటినే పాలిస్‌ చేసి కొత్తగా ప్యాకింగ్‌

సీఎంఆర్‌ కింద తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తున్న వైనం

పట్టించుకోని అధికారులు

చక్రం తిప్పుతున్న మిల్లర్లు

నరసన్నపేట, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొందరు మిల్లర్లు రేషన్‌ బియ్యంను రీసైక్లింగ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ బియ్యాన్ని కొత్త సంచుల్లో ప్యాకింగ్‌ చేసి సీఎంఆర్‌ కింద ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. మరికొందరు మిల్లర్లు రేషన్‌ బియ్యంను నూకలుగా చేసి బయట మార్కెట్‌లో అమ్మకాలు చేపడుతున్నారు. శ్రీకాకుళం, నరసన్నపేట, పోలాకి, గార, జలుమూరు, టెక్కలి, కోటబొమ్మాళి, పలాస తదితర మండలాల్లోని అనేక మిల్లుల్లో ఈ దందా సాగుతోంది. మిల్లర్లు నిబంధనలు తుంగలో తొక్కి రేషన్‌ బియ్యానే రీపాలిస్‌ చేసి ప్రభుత్వానికి అంటగడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వీరికి సివిల్‌సప్లయ్‌శాఖ అధికారులతో పాటు గిడ్డంగులు వద్దగల క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు ఒత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఏజెంట్ల ద్వారా సేకరణ..

రేషన్‌ బియ్యం సేకరణ కోసం కొందరు మిల్లర్లు ఏజెంట్లను నియమించుకున్నారు. ఈ ఏజెంట్లు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల నుంచి రేషన్‌ బియ్యంను కిలో రూ.18కు కొనుగోలు చేస్తారు. వీటిని రాత్రి సమయాల్లో ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా మిల్లులకు తరలిస్తారు. వాటిని మిల్లర్లు కిలోకు రూ.22కు కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన రేషన్‌ బియ్యం రంగు మారకుండా ధగధగ మెరిసేలా కనిపించేందుకు మర పట్టిస్తున్నారు. మరికొందరు మిల్లర్లు రేషన్‌ బియ్యంను నూకలుగా చేసి ఇడ్లీ నూక, కోళ్ల మేతగా తయారు చేస్తున్నారు. నరసన్నపేట పరిసర మిల్లులు మూడు నెలలు మాత్రమే ధాన్యం మిల్లింగ్‌ చేపట్టి మిగతా ఏడాది పొడవునా రేషన్‌ బియ్యంతోనే కాలం గడుపుతున్నారు. మరికొందరు మిల్లర్లు పార్సిల్‌ సర్వీసుల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి రేషన్‌ బియ్యంను దిగుమతి చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు.

ఇలా దోపిడీ..

ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంను మరపట్టించేందుకు మిల్లర్లకు అప్పగిస్తుంది. ఈ ధాన్యంను మరపట్టి క్వింటాకు 65కేజీల బియ్యంను ప్రభుత్వానికి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. క్వింటా ధాన్యం మరపట్టించేందుకు, హమాలీ, విద్యుత్‌, ఇతర ఖర్చుల కింద ప్రభుత్వం క్వింటాకు రూ.50నుంచి 70వరకు మిల్లర్లకు చెల్లిస్తుంది. వీటితో పాటు సంచుల డబ్బులు కూడా చెల్లిస్తుంది. అయితే ఇక్కడే అసలు తంతు జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ధాన్యంను మిల్లరు మరపట్టకుండా వీటిని తమ గిడ్డంగుల్లో నిల్వ చేసుకుంటున్నారు. తమ ఏజెంట్ల ద్వారా బయట కొనుగోలు చేసిన రేషన్‌ బియ్యంను రీపాలిస్‌ చేసి కొత్త సంచుల్లో ప్యాకింగ్‌ చేసి సీఎంఆర్‌ కింద తిరిగి ప్రభుత్వానికి అంటగడుతున్నారు. క్వింటా బియ్యంకు రూ.2వేలు అంటే ఒక టన్నుకు రూ.2లక్షల వరకు ఒక్కొక్క మిల్లరు దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం అప్పగించిన నాణ్యమైన ధాన్యంను మిల్లర్లు తమ ఏజెంట్ల ద్వారా మండలపేట, సామర్లకోట తదితర ప్రాంతాలకు తరలించి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పరీక్షలకు దొరకకుండా..

ఇటీవల ప్రభుత్వం రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మొబైల్‌ ర్యాపిడ్‌ కిట్లను అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా బియ్యం తరలిస్తూ పట్టుబడితే అధికారులు ర్యాపిడ్‌ కిట్‌లో ఉన్న రసాయనాలను ఆ బియ్యంపై చల్లుతారు. అవి ఎరుపు రంగులోకి మారితే రేషన్‌ బియ్య మని, లేదంటే బహిరంగ మార్కెట్‌లోని బియ్యమని నిర్ధారిస్తారు. అయితే ఈ పరీక్షలకు దొరక్కుండా మిల్లర్లు రేషన్‌ బియ్యంను మరపెట్టి.. ధగధగ మెరిసే విధంగా పాలిస్‌ చేపట్టి అధికారుల కళ్లుకప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లుల నుంచి సివిల్‌ సప్లయ్‌ శాఖకు పంపించిన బియ్యం నాణ్యతను క్వాలిటీ కంట్రోల్‌ అఽధికారులు పరిశీలించాలి. కానీ, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులతో పాటు సివిల్‌ సప్లయ్‌ అధికారులను మిల్లర్లు ప్రలోభాలకు గురిచేయడంతో వారు చూసీచూడనట్లు వ్యవహరించి రీసైక్లింగ్‌ బియ్యంను స్వీకరిస్తున్నారు. దీంతో కొద్దిరోజులకే సివిల్‌ సప్లయ్‌ గిడ్డంగుల్లో ఈ బియ్యంకు సుంకు పురుగులు పుడుతున్నాయి. పదేపదే పాలిస్‌ చేయడంతో బియ్యం పటుత్వం కోల్పోతుంది. ఈ బియ్యం వండితే ముద్దగా, జావగా తయారవుతుంది. మిల్లర్ల దందా బయట పడాలంటే ప్రభుత్వం వారికి ఇచ్చే ధాన్యం ఎన్ని? వాటిని మరపట్టేంచేందుకు విద్యుత్‌ ఎన్ని యూనిట్లు ఖర్చు అయింది తదితర వివరాలను రాబట్టాలి. అప్పుడు అసలు రంగు బయటపడే అవకాశం ఉంది.

నాణ్యమైన బియ్యం అప్పగించాల్సిందే

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశాం. మిల్లర్ల వద్ద పట్టుబడితే తగు చర్యలు తీసుకుంటాం. మిల్లర్లు నాణ్యమైన బియ్యంను ప్రభుత్వానికి అప్పగించాల్సిందే. క్వాలిటీ పరీక్షలు నిర్వహించి మిల్లర్ల నుంచి బియ్యం తీసుకుంటాం.

-వేణుగోపాల్‌, సివిల్‌సప్లయ్‌ డీఎం, శ్రీకాకుళం

Updated Date - Dec 23 , 2025 | 12:19 AM