Share News

555 ఫోన్ల రికవరీ

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:03 AM

Phones Recovery జిల్లా పోలీసు శాఖ సుమారు రూ.86 లక్షల విలువలైన 555 ఫోన్లను రికవరీ చేసింది. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సోమవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి చేతుల మీదుగా వాటిని అందజేశారు.

555 ఫోన్ల రికవరీ
బాధితురాలికి ఫోన్‌ అందజేస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి, చిత్రంలో రికవరీ చేసిన ఫోన్లు

ఎస్పీ చేతులమీదుగా బాధితులకు అందజేత

శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు శాఖ సుమారు రూ.86 లక్షల విలువలైన 555 ఫోన్లను రికవరీ చేసింది. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సోమవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి చేతుల మీదుగా వాటిని అందజేశారు. ఫోన్లు పొగొట్టుకున్న బాధితుల నుంచి ఈ ఏడాది సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా 2,442 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిలో ఇప్పటివరకూ సుమారు 1,390 ఫోన్లను గుర్తించారు. గతంలో బాధితులకు 505 ఫోన్లను అందజేయగా.. సోమవారం మరో 555 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. మిగిలిన 330 ఫోన్లను కూడా రికవరీ చేసి త్వరలో బాధితులకు అందజేస్తామని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. పోయిన మొబైల్‌ ఫోన్‌లో ఎవరైనా కొత్త వ్యక్తి సిమ్‌ కార్డు వినియోగిస్తే.. వెంటనే ఆ ఫోన్‌ను ఈ పోర్టల్‌ ద్వారా ట్రేస్‌ చేసి గుర్తించి బాధితులకు అందజేస్తామన్నారు. ఫోన్లు అందుకున్న బాధితులు ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీలు కె.వి.రమణ, పి.శ్రీనివాసరావు, ఎస్‌బీ సీఐ ఇమ్మాన్యుయేల్‌ రాజు, సైబర్‌, ఐటీ సెల్‌ సీఐ టి.శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 12:03 AM