సీదిరిపై తిరుగుబాటు
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:33 AM
పలాస నియోజకవర్గంలో తనకు ఎదురులేదు. ఏ ఎన్నికలు వచ్చినా తనకే సీటు, తనదే గెలుపు అంటూ విర్రవీగుతున్న మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జి సీదిరి అప్పలరాజుపై ఆ పార్టీ సీనియర్ నాయకులు తిరుగుబావుటా ఎగురవేశారు.
- ఏకమవుతున్న వైసీపీ సీనియర్లు
- మాజీ మంత్రికి చెక్ పెట్టేందుకు వ్యూహం
- ఆయనకు సీటు ఇవ్వకుండా చేయడమే అజెండా
- మాజీ స్పీకర్ తమ్మినేనిని కలిసిన వైనం
- త్వరలో పార్టీ మాజీ ఎమ్మెల్యేలను కలిసేందుకు సన్నద్ధం
పలాస, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గంలో తనకు ఎదురులేదు. ఏ ఎన్నికలు వచ్చినా తనకే సీటు, తనదే గెలుపు అంటూ విర్రవీగుతున్న మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జి సీదిరి అప్పలరాజుపై ఆ పార్టీ సీనియర్ నాయకులు తిరుగుబావుటా ఎగురవేశారు. వారంతా ఏకమై ఆయనకు చెక్ పెట్టేందుకు వ్యూహం పన్నుతున్నారు. 2019 ఎన్నికల్లో అప్పలరాజు విజయం కోసం ఆయన అనుచరులు అహర్నిశలు శ్రమించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో వారు ఎంతో సంబరపడిపోయారు. తమకు తగిన ఫలితం, గుర్తింపు వస్తుందని భావించారు. కానీ, కథ అడ్డం తిరిగింది. తమకు తగిన స్థానం లభించడం లేదని, కొత్తవారికే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ అప్పలరాజుపై సీనియర్లు గుర్రుగా ఉండేవారు. ఆయన కూడా తగు రీతిలో స్పందించకపోవడంతో వారి మధ్య విబేధాలు పొడచూపాయి. 2024 ఎన్నికల తరువాత పరిస్థితి తారుమారైంది. రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడం, ఎన్నడూ లేని విధంగా పలాస నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు 41 వేల పైచిలుకు మెజార్టీ రావడంతో వైసీపీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అయినా ఇప్పటికీ అప్పలరాజు సీనియర్లను పట్టించుకోకపోవడం, కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించకపోవడంతో వారంతా ఏకమవుతున్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్, సీనియర్ నాయకుడు మరడ భాస్కరరావుతో పాటు పట్టణానికి చెందిన ఒక ప్రముఖ వైద్యుడు తదితరులు కలిసి ఈ నెల 27న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. వారు తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన వద్ద ఏకరువు పెట్టినట్లు సమాచారం.

అప్పలరాజుకు మళ్లీ టిక్కెట్ ఇస్తే గెలిచే పరిస్థితి లేదని, ఇప్పటి నుంచి నాయకత్వం మార్పిడి చేసి నాలుగేళ్లలో పార్టీని బలోపేతం చేస్తేనే తప్పా పరిస్థితి కుదుటపడదని చెప్పినట్లు తెలుస్తోంది. సీతారాం కూడా జగన్మోహన్‌రెడ్డిని సీఎం చేయడానికి అంతా కలిసి పనిచేయాలని అని చెప్పినట్లు సమాచారం. మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో పాటు జిల్లాలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలందరినీ కలిసి పలాస నియోజకవర్గంలో అభ్యర్థి మార్పే ప్రధాన అజెండాగా సీనియర్లు ప్యూహం రచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా 2019 నుంచి 2024 వరకూ అప్పలరాజుతో విబేధించిన వారి వివరాలు మొత్తం సేకరించి, అందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలు, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటిలో మొత్తం 25 మంది వరకూ గుర్తించి వారికి వర్తమానం పంపించారు. తొందరలోనే వారితో ముందుగా సమావేశమై వారి అభిప్రాయాల మేరకు కార్యాచరణ నిర్ణయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నాలుగేళ్లలో మొత్తం నియోజకవర్గమంతా కలియతిరిగి తమకు జరిగిన అన్యాయం, టిక్కెట్ ఎందుకు మార్చకూడదు అనే అజెండాతో వైసీపీ ముఖ్య కార్యకర్తల వద్దకు వెళ్లడానికి వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు నియోజకవర్గ పాదయాత్రకు శ్రీకారం చుట్టి తేదీని కూడా ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వద్దకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మున్సిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబును ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. ‘మేము మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసింది వాస్తవమే. మా మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి కష్టపడాలని సీతారాం సూచించారు.’ అని తెలిపారు.