ధాన్యం కొనుగోలుకు రెడీ
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:07 AM
530 grain purchasing centers ఖరీప్ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 530 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రవాణాలో అవకతవకలు చోటుచేసుకోకుండా 5,135 వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయనున్నారు.
జిల్లాలో 530 కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు
4లక్షల మెట్రిక్ టన్నులు సేకరించే అవకాశం
నరసన్నపేట/పాతపట్నం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఖరీప్ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 530 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రవాణాలో అవకతవకలు చోటుచేసుకోకుండా 5,135 వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుత ఖరీప్ సీజన్‌లో వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 3.75 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురిసి.. వాతావరణం అనుకూలించడంతో వరిపైరు ఏపుగా పెరిగింది. సుమారు 4.5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వీటిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ సేకరించనుంది. సారవకోట, పాతపట్నం, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట మండలాల్లో జగిత్యాల రకాలు మరో వారం రోజుల్లో కోతకు వచ్చే అవకాశం ఉంది. రైతులు తమ వెసులుబాటును బట్టి నూర్పిడి చేసి, ధాన్యం విక్రయిస్తారు. ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపు, రైతులకు డబ్బుల చెల్లింపు విషయంలో ఎక్కడా అన్నదాతలకు ఇబ్బంది పడకుండా జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ధాన్యాన్ని కళ్లాల నుంచి నేరుగా కొనుగోలు చేసి మిల్లలకు తరలించేలా వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు.
మద్దతు ధరకే కొనుగోలు
ఈ ఏడాది ధాన్యం మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.2,389, సాధారణ రకం రూ.2,369కు కొనుగోలు చేయాలని నిర్ధేశించింది. ధాన్యం కొనుగోలు ముందే ఈ -క్రాప్, ఈ-కైవైసీ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా కస్టోడియన్ అధికారులను, మండలస్థాయిలో ధాన్యం కొనుగోలు కమిటీలను నియమించనున్నారు. ధాన్యం నాణ్యత, తేమ శాతంపై కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ధాన్యం కొనుగొలు కేంద్రాల వద్ద కంప్యూటర్లు, గోనె సంచులు, తూనిక యంత్రాలు, తేమశాతం కొలిచే పరికరాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం మార్గదర్శికాలను జారీ చేసింది.
దళారుల హవా
ధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభం కాకముందే దళారుల మొదలైంది. వరిపంట కోత దశలో వాతావరణంలో మార్పులు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు వరికోతలు చేపట్టి.. నూర్పుడి చేస్తున్నారు. ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.. ధాన్యాన్ని భద్రపరిచేందుకు వీలులేక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొంతమంది దళారులు పొలాల వద్దే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ‘గతేడాది పొలాల వద్ద 80కేజీల ధాన్యం బస్తాను రూ.1500కు కొనుగోలు చేశారు. ఈ ఏడాది కేవలం రూ.1320 నుంచి రూ.1350 వరకూ కొంటున్నారు. పేరుకే 80 కేజీలు కానీ.. తేమశాతం పేరిట అదనంగా మరో మూడు కేజీలు తూకం వేసి తీసుకుంటున్నారు. దీంతో మరింత నష్టపోతున్నాం. ప్రభుత్వమే త్వరగా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాల’ని పాతపట్నం మండలం కొరసవాడకు చెందిన నల్లి శ్రీను, బోను లోకేశ్, సీది గ్రామానికి చెందిన రాజాన గురయ్య తదితర రైతులు కోరుతున్నారు.
ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జేసీ ఫర్మాన్‌అహ్మద్ ఖాన్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘ధాన్యం సేకరణపై గ్రామ, మండల స్థాయిలో సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. వర్షాల నుంచి రక్షణకు రైతులకు టార్పాలిన్లు అందజేయాలి. ఏ సమస్య ఉన్నా.. నా దృష్టికి తీసుకురావాల’ని ఆదేశించారు. ఈ-క్రాప్ నమోదుపై ఆరా తీయగా.. 5 లక్షల మందికి ప్రక్రియ పూర్తయిందని ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ.. ‘గత సమస్యలు పునరావృతం కాకుండా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి. ఒక ప్రణాళిక తయారుచేసి రైతులకు ముందుగానే తెలియజేయండి. 530 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుంది. ధాన్యం తేమ శాతం తెలుసుకునేందుకు అక్కడే మిషన్లు ఏర్పాటు చేస్తాం. రైస్‌మిల్లు, రైతు సేవా కేంద్రాల వద్ద ఒకే కంపెనీ మిషన్లు ఉండాలి. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. జీపీఎస్ గల 5135 వాహనాలను ధాన్యం రవాణాకు కేటాయిస్తామ’ని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్, ఆర్డీవో కె.సాయిప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్లు జి.జయదేవి, బి.పద్మావతి, తహసీల్దార్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు.