Share News

Transfors: ఉపాధ్యాయుల బదిలీలకు సన్నద్ధం

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:38 PM

Online Transfer System జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. నిబంధనల మేరకు వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సీనియారిటీ జాబితా రూపొందించి.. దానిపై పలు దఫాలుగా అభ్యంతరాలు స్వీకరించింది.

Transfors: ఉపాధ్యాయుల బదిలీలకు సన్నద్ధం
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో తిరుమల చైతన్య

  • నెలాఖరులో హెచ్‌ఎంలకు స్థానచలనం

  • మేలో స్కూల్‌ అసిస్టెంట్లు. ఎస్జీటీలకు పదోన్నతులు

  • స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులకు ఆరోగ్య పరీక్షలు

  • నరసన్నపేట, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. నిబంధనల మేరకు వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సీనియారిటీ జాబితా రూపొందించి.. దానిపై పలు దఫాలుగా అభ్యంతరాలు స్వీకరించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరంగా తయారు చేసిన సీనియారిటీ జాబితాపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జడ్పీ పరిధిలో స్కూల్‌ అసిస్టెంట్లు, హెచ్‌ఎంల పదోన్నతుల కోసం రూపొందించిన జాబితాలపై ఈ నెల 19 వరకూ అధికారులు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ నెలాఖరున ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఎంలకు బదిలీలు ఉంటాయి. ఆ తరువాత హెచ్‌ఎం పోస్టుల ఖాళీల మేరకు స్కూల్‌ అసిస్టెంట్‌లకు కౌన్సెలింగ్‌ నిర్వహించి హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పిస్తారు. అనంతరం సీనియార్టీ ప్రాతిపదికన స్కూల్‌ అసిస్టెంట్‌లకు పదోన్నతి కల్పించి, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్ల బదిలీలు చేపడతారు. తర్వాత ఎస్జీటీల బదిలీ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈసారి భారీగా బదిలీలు అయ్యే అవకాశం ఉంది. 2017లో భారీగా బదిలీలు జరిగాయి. అప్పట్లో బదిలీలు అయిన ఉపాధ్యాయులు ఒకే చోట ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్నారు. అందువల్ల విధిగా వీరికి ఆయా స్థానాలు నుంచి స్థాన చలనం కలుగుతుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 1200 మంది ఉపాధ్యాయులకు బదిలీలు జరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారు.

  • ప్రాధాన్య వర్గాలకు వైద్య పరీక్షలు

  • ఉపాధ్యాయుల బదిలీల చట్టం మార్గదర్శకాలు ప్రకారం బదిలీల్లో ప్రాధాన్యత కలిగిన వారు ఈనెల 24 నుంచి 26 వరకు ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు పరిశీలించడానికి జిల్లా సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని ఇటీవల విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది. స్పెషల్‌ కేటగిరీలో బదిలీ కానున్న ఉపాధ్యాయుల్లో 80శాతం లేదా అంతకంటే ఎక్కువ దృష్టిలోపం/ శారీరకంగా సవాలు చేయబడిన వారు(ఆర్డోఫెడిక్‌), వినికిడి లోపం, గుండెలో రంధ్రం పూడ్చడం, అవయవ మార్పిడి, పెద్దనాడి శస్త్రచికిత్స, ఎముకల్లో క్షయ, కిడ్నీ మార్పిడి తదితర వ్యాధుల ధ్రువీకరణ ప్రతాలను అనుసరించి ప్రాధాన్యం కల్పిస్తారు. పుట్టకతో గుండె సంబంధిత వ్యాధులు కలిగిన పిల్లలకు శస్త్రచికిత్స చేసిన తేదీ నుంచి మూడేళ్లలోపు పాధాన్య వర్గంగా పరిగణించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.రామరాజు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య కారణాలపై బదిలీ కోరుకునే ఉద్యోగులు సంబంధిత వైద్య మండలి ధ్రువీకరించిన తాజా వైద్య నివేదికలు పొందాలని స్పష్టం చేశారు.

  • నెలాఖరు నాటికి డీఎస్సీ నోటిఫికేషన్‌ : డీఈవో తిరుమల చైతన్య

    టెక్కలి: ఈ నెలాఖరు నాటికి డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య తెలిపారు. మంగళవారం స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘ఈనెల 21 నుంచి కొత్త విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బడిఈడు పిల్లలను గుర్తిస్తున్నాం. జిల్లాలో గతేడాది 2,44869 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ ఏడాది 2.50 లక్షల మందికిపైగా విద్యార్థులు చేరేలా కృషి చేస్తున్నాం. జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఉపాధ్యాయులు భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 21 నుంచి ఆన్‌లైన్‌ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. 60 మంది విద్యార్థులు దాటి, మూడు కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి ఉన్నత పాఠశాల లేకపోతే ఆయా ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా గుర్తిస్తాం. తరగతుల విలీనం విషయంలో ఆయా గ్రామాల ఎస్‌ఎంసీ కమిటీ, విద్యార్థుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకుంటాం. రానున్న విద్యా సంవత్సరం నుంచి సింగిల్‌ యాప్‌ విధానంతో పాఠశాలలు నిర్వహిస్తాం. పాఠశాలలు తెరిచే నాటికి పుస్తకాలు కొరత లేకుండా ఇప్పటికే సుమారు ఐదులక్షల పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయ’ని డీఈవో తెలిపారు. సమావేశంలో ఎంఈవోలు డి.తులసిరెడ్డి, డి.చిన్నారావు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 11:38 PM