Early Ration Distribution: వృద్ధులకు, దివ్యాంగులకు... ఐదురోజుల ముందే రేషన్
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:32 PM
Public Distribution System (PDS) పేదలకు రేషన్ సరుకుల పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచి ఐదు రోజులు ముందుగానే వృద్ధులకు, దివ్యాంగులకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. డీలర్లు ద్వారా నేరుగా ఇంటికే సరుకులు అందజేయనుంది.
రేపటి నుంచి డీలర్ల ద్వారా ఇంటికే పంపిణీ
జిల్లాలో 94 వేల కుటుంబాలకు లబ్ధి
నరసన్నపేట/ఇచ్ఛాపురం, జూన్ 24(ఆంధ్రజ్యోతి): పేదలకు రేషన్ సరుకుల పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచి ఐదు రోజులు ముందుగానే వృద్ధులకు, దివ్యాంగులకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. డీలర్లు ద్వారా నేరుగా ఇంటికే సరుకులు అందజేయనుంది. జిల్లాలో మొత్తం 1,603 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 6,60,739 మంది కార్డుదారులు సరుకులు తీసుకుంటున్నారు. వీరిలో జిల్లాలో 94,609మంది వృద్ధులు(65ఏళ్లు పైబడిన వారు), దివ్యాంగులు ఉన్నారు. వీరందరికీ జూలైలో ఇవ్వాల్సిన రేషన్‌ను.. గురువారం నుంచే డీలర్లు ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనం వచ్చిన సమయంలో కార్డుదారులు ఇళ్ల వద్ద లేకపోవడంతో చాలామందికి రేషన్ సరుకులు అందేవి కాదు. కొంతమంది ఎండీయూ వాహనాల కోసం పనులు మానుకుని ఎదురుచూసేవారు. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతూ.. ఎండీయూ వాహనం వద్దకు వెళ్లి సరుకులు తీసుకునేవారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు రేషన్ డిపోల్లో డీలర్ల ద్వారా సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దివ్యాంగులకు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు గత నెల ఒకరోజు ముందే నేరుగా ఇంటికి సరుకులు పంపిణీ చేసింది. ఇకపై ఐదు రోజుల ముందే సరుకులు అందజేయనుంది. అంటే జూలై నెల రేషన్‌కు సంబంధించి.. ఈ నెల 26 నుంచి వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఇంటికే సరుకులు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఈ విషయంపై సివిల్‌సప్లయ్ తహసీల్దార్ సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా ఇప్పటికే రేషన్ సరుకులు పంపిణీకీ సంబంధించి డీలర్లుకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
కందిపప్పు ఎప్పుడో?
ప్రభుత్వం రేషన్ పంపిణీలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఈ నెలకు పాతపద్ధతిలోనే రేషన్ డిపోల నుంచి సరుకులు అందించింది. అయితే కేవలం బియ్యం, పంచదార పంపిణీకే పరిమితమైంది. ఇతర నిత్యావసరాలు అందించడం లేదు. దీంతో లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు. బియ్యంతోపాటు అన్నిరకాల నిత్యవసరాలు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో లబ్ధిదారులు ఎంతగానో సంతోషించారు. అయితే జూన్ నెలకు సంబంధించి కేవలం బియ్యం, అరకిలో పంచదార అందించి చేతులు దులుపుకొన్నారు. కనీసం కందిపప్పు ఊసేలేదని కార్డుదారులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం కందిపప్పు ధర బయట మార్కెట్‌లో కిలో రూ.160పైమాటే. రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం కిలో కందిపప్పు రూ.67కే అందించేది. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డుదారులకు బియ్యం, పంచదాక, కందిపప్పు అందజేసింది. వీటితోపాటు ముస్లింలకు రంజాన్ తోఫా, క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు, హిందువులకు సంక్రాంతి కానుకలు అందించేవారు. వైసీపీ హయాంలో కానుకలేవీ అందలేదు. కేవలం బియ్యం, పంచదార మాత్రమే అందజేసేవారు. కూటమి ప్రభుత్వం స్పందించి జూలై నుంచి అయినా కందిపప్పు, ఇతర నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని కార్డుదారులు కోరుతున్నారు. ఈ విషయమై డీఎస్‌వో సూర్యప్రకాశ్ వద్ద ప్రస్తావించగా.. ‘జిల్లాలో రేషన్ డిపోల ద్వారా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. కందిపపప్పునకు సంబంధించి ప్రత్యేక విధానం రూపొందిస్తున్నాం. ప్రభుత్వం సైతం కందిపప్పు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంద’ని తెలిపారు.