పాఠశాలలకు రేటింగ్
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:32 PM
Clean and green schools ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మౌలిక వసతులతోపాటు పర్యావరణ పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం రేటింగ్ విధానం ప్రవేశపెట్టింది. కేంద్ర మానవ వనరులశాఖ స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ్ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) విధానాన్ని ఈ ఏడాది ప్రారంభించింది.
‘స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ్’కు శ్రీకారం
పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
హరిత, స్వచ్ఛతలో విద్యార్థుల భాగస్వామ్యమే లక్ష్యం
నరసన్నపేట, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మౌలిక వసతులతోపాటు పర్యావరణ పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం రేటింగ్ విధానం ప్రవేశపెట్టింది. కేంద్ర మానవ వనరులశాఖ స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ్ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) విధానాన్ని ఈ ఏడాది ప్రారంభించింది. స్వచ్ఛత, హరిత విద్యాలయాల అంశాల ఆధారంగా ఫైవ్‌స్టార్స్ రేటింగ్ కేటాయించనుంది. ఇందుకోసం పాఠశాలల దరఖాస్తు నమోదు ప్రక్రియ చేపడుతోంది. నిబంధనల మేరకు జాతీయస్థాయికి ఎంపికైన పాఠశాలలకు నగదు ప్రోత్సాహకాన్ని అందజేయనుంది.
జిల్లాలో 2,955 ప్రభుత్వ, 498 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో పరిసరాలు, స్వచ్ఛత అంశాలు ఆధారంగా ఎస్‌హెచ్‌వీఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు బుధవారంతో గడువు ముగియనుండగా.. ఇప్పటికే 2,133 పాఠశాలల వివరాలను ప్రధానోపాధ్యాయులు ఎస్‌హెచ్‌వీఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. నీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, చేతులు శుభ్రం చేసుకోవడం, పెరటి తోటలు పెంపకం, విద్యార్థుల ప్రవర్తనలో మార్పు, తదితర అంశాలకు సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్ చేశారు. సమగ్ర శిక్ష అధికారులు జిల్లాస్థాయిలో ఈ నెల 16 నుంచి నవంబరు 7వరకు వీటిని పరిశీలించి రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. నవంబరు 8 నుంచి రాష్ట్రస్థాయి బృందం సభ్యులు పరిశీలిస్తారు. డిసెంబరు 14న జాతీయస్థాయి బృంద సభ్యులు పరిశీలించి.. వచ్చే ఫిబ్రవరి 15 తరువాత జాతీయ స్థాయికి ఎంపికైన పాఠశాలలను ప్రకటిస్తారు. ఇప్పటికే 90 శాతానికిపైగా నమోదు ప్రక్రియ పూర్తయిందని డీఈవో రవిబాబు తెలిపారు. ఈ నెల 16 నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలించి రేటింగ్ ఇస్తామన్నారు. ‘పాఠశాలల్లో స్వచ్ఛత, హరిత విధానం అమలుకు సంబంధించి ఆయా అంశాలు 35శాతం కంటే తక్కువగా ఉంటే వన్‌స్టార్ ఇస్తాం. 35శాతం నుంచి 50శాతం వరకు ఉంటే టూ స్టార్, 51శాతం నుంచి 74శాతం మేరకు ఉంటే త్రిబుల్ స్టార్ ఇస్తాం. 75శాతం నుంచి 89శాతం వరకు ఫోర్ స్టార్, 90శాతం నుంచి శతశాతం ఉంటే ఫైర్‌స్టార్ రేటింగ్ ఇస్తామ’ని డీఈవో తెలిపారు.