జనవరి 19 నుంచి రథ‘సప్తమి’ ఉత్సవాలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:48 PM
Ratha Saptami festival ‘అరసవల్లిలో శ్రీసూర్య నారాయణస్వామి రథసప్తమి ఉత్సవాలు ఈసారి ఏడు రోజులపాటు నిర్వహించాలి. వచ్చే జనవరి 19 నుంచి 25 వరకు వైభవంగా వేడుకల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాల’ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అధికారులను ఆదేశించారు.
అరసవల్లిలో ఏడు రోజులపాటు నిర్వహణ
భక్తులకు సత్వర దర్శనమే లక్ష్యం
నగరాన్ని సుందరంగా అలంకరించాలి
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
అరసవల్లి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘అరసవల్లిలో శ్రీసూర్య నారాయణస్వామి రథసప్తమి ఉత్సవాలు ఈసారి ఏడు రోజులపాటు నిర్వహించాలి. వచ్చే జనవరి 19 నుంచి 25 వరకు వైభవంగా వేడుకల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాల’ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాటుపై శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘రథసప్తమి ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. భక్తులకు సౌకర్యవంతమైన, సత్వర దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యం కావాలి. దేవస్థానాన్ని, నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి. పండుగ వాతావరణం అనుభూతి పొందాలి. ప్రతి రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. క్యూలైన్ల పై ఒత్తిడి తగ్గించేందుకు ఆన్‌లైన్ టికెట్లు క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తీసుకురావాలి. భక్తుల రద్దీని ఏడు రోజులకు విస్తరించేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. భద్రత, సౌకర్యాల విషయంలో రాజీలేదు’ అని తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ‘ఆలయ ప్రాంగణమంతా సీసీ కెమేరాల నిఘా ఉండాలి. ఉచిత లడ్డూతోపాటు కోవా వంటి నాణ్యమైన వైవిద్య ప్రసాదాల పంపిణీపై కూడా దృష్టి సారించాల’ని తెలిపారు. ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరయ్యే అవకాశం ఉన్నందున.. అందుకు తగిన విధంగా ప్రొటోకాల్, భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రంలో ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వాన పత్రాలు పంపాలని అధికారులు తీర్మానించారు. ఎమ్మేల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ఏడు రోజుల ఉత్సవాలు నిర్వహణతో జిల్లాకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని తెలిపారు. ఉత్సవాల ప్రారంభం రోజున సూర్య నమస్కారాలు, శోభాయాత్రతో పాటుగా ఏడు రోజులపాటు రాష్ట్రస్థాయి ఆటలు పోటీలను కూడా నిర్వహించాలని ప్రతిపాదించారు. కార్పొరేషన్ అధికారులు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. శ్రీకాకుళం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటడమే లక్ష్యంగా ఈ సప్తహ సూర్య మహోత్సవం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డీఆర్వో లక్షణమూర్తి, ఆర్డీవోలు సాయిప్రత్యూష, కృష్ణమూర్తి, గణేష్, డీఎస్పీ వివేకానంద, అరసవల్లి ఈవో ప్రసాదరావు, ఉన్నతాఽధికారులు పాల్గొన్నారు.