గంజాయి మత్తులో బీభత్సం
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:28 PM
Drug influence violence నరసన్నపేటలో గంజాయి బ్యాచ్‌ల వీరంగంతో వ్యాపారులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి స్థానిక వెంకటేశ్వర ఽథియేటర్ సమీపంలో మంజునాథ పాన్‌షాపు వద్ద ముగ్గురు యువకుల గంజాయి మత్తులో షాపు యజమాని, అతని తండ్రిపై దాడి చేయడం కలకలంపై రేపింది.
నరసన్నపేటలో వ్యాపారి, తండ్రిపై దాడి
నరసన్నపేట, జూలై 15(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో గంజాయి బ్యాచ్‌ల వీరంగంతో వ్యాపారులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి స్థానిక వెంకటేశ్వర ఽథియేటర్ సమీపంలో మంజునాథ పాన్‌షాపు వద్ద ముగ్గురు యువకుల గంజాయి మత్తులో షాపు యజమాని, అతని తండ్రిపై దాడి చేయడం కలకలంపై రేపింది. ఇందుకు సంబంధించి పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసన్నపేటలోని జగన్నాథపురానికి చెందిన అజయ్, ప్రదీప్, వీరస్వామి గంజాయి మత్తులో సోమవారం రాత్రి మంజునాథ పాన్‌షాప్ వద్దకు వెళ్లారు. డబ్బులు ఇవ్వకుండా వాటర్‌బాటిల్, సిగరెట్టు అడిగారు. డబ్బులిస్తేనే.. వాటర్‌బాటిల్, సిగరెట్ ఇస్తానని షాపు యజమాని కోరాడ రాకేష్ చెప్పగా.. ఆయనపై పిడిగుద్దులతో దాడి చేశారు. అడ్డువచ్చిన రాకేష్ తండ్రిపై కూడా దాడికి పాల్పడ్డారు. షాప్‌లో ఫ్రిజ్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, గంజాయి మత్తులో వెనక్కి తగ్గకుండా అలజడి సృష్టించారు. బాధితుడు రాకేష్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌చార్జి ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు.
విచ్చలవిడిగా విక్రయాలు
నరసన్నపేటతోపాటు పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఒడిశా నుంచి గంజాయిని దిగుమతి చేస్తూ.. విచ్చలవిడిగా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చీకటి అయితే చాలు.. గంజాయి మత్తులో యువత అరాచకాలు ఎక్కువవుతున్నాయని వ్యాపారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి బ్యాచ్ నుంచి తమకు రక్షణ కల్పించాలని వ్యాపారులు నరసన్నపేట సీఐకి వినతిపత్రం అందజేశారు. అలాగే గంజాయి మత్తులో వ్యాపారులపై దాడి అమానుషమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. దాడికి పాల్పడిన యువకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.