Rain : సిక్కోలు.. జలమయం
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:21 AM
Heavy rain బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. కనీవినీ ఎరుగని విధంగా శ్రీకాకుళం నగరంలో భారీ వర్షం కురిసింది.
జిల్లాఅంతటా కుండపోత వాన
రహదారులపై నీటి ప్రవాహం
చెరువులా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్
నీట మునిగిన వరి పొలాలు
శ్రీకాకుళం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. కనీవినీ ఎరుగని విధంగా శ్రీకాకుళం నగరంలో భారీ వర్షం కురిసింది. ఏకంగా 52.4 మిల్లీమీటర్లు వర్షం కురవడంతో నగరం జలమయమైపోయింది. ఎక్కడ చూసినా వర్షపునీటితో రోడ్లు ముంపునకు గురయ్యాయి. వరదనీటి ప్రవాహంతో డేఅండ్‌నైట్ జంక్షన్, బలగలో కొన్ని వార్డులు.. రామలక్ష్మణ్ జంక్షన్.. రోడ్లు ఎక్కడున్నాయో.. కాలువలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక హుద్‌హుద్ తుఫాన్ సమయంలో మాదిరి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ వర్షపునీరు, మురుగునీటితో నిండిపోయింది. చుట్టూ సముద్రంలా నీరు కనిపించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాంప్లెక్స్ వెలుపల ఉన్న కాలువలు ఉప్పొంగిపోయాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. శ్రీకాకుళం మండలం పెద్దపాడు వద్ద పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. పాత్రునివలస వద్ద హైవేపై నీరు నిల్వచేరి.. వాహనాల రాకపోకలు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. నరసన్నపేట, గార, ఎచ్చెర్ల, ఆమదాలవలస, జలుమూరు, లావేరు మండలాల్లో భారీవర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లోని వరిపంట ముంపునకు గురైంది. పొలాల్లో నీరుచేరి.. చెరువులను తలపించాయి.
ముంపు సమస్యపై మంత్రి అసహనం..
భారీ వర్షం కారణంగా శ్రీకాకుళంలో ముంపు సమస్యపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం కార్పొరేషన్ సహాయక కమిషనర్‌ను ప్రజాసదన్‌కు పిలిచి.. జాతీయ రహదారిపై పెద్దఎత్తున వర్షపు నీరు నిలిచిపోవడానికి కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తక్షణమే కాలువల్లో పూడికను తొలగించాలన్నారు. ప్రధాన డ్రైనేజీ వ్యవస్థపై శ్రద్ధ చూపించి అత్యవసర చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కూడా హైవే అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. నీటి నిల్వకు గల కారణాలను తక్షణమే గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.
జిల్లాలో మంగళవారం కురిసిన వర్షపాతం (మిల్లీమీటర్లలో) :
-----------------------------------------------
శ్రీకాకుళం 52.4
ఎచ్చెర్ల 28.8
ఆమదాలవలస 23.0
జలుమూరు 22.8
సంతబొమ్మాళి 19.6
లావేరు 18.6
నరసన్నపేట 18.2
టెక్కలి 17.6
కోటబొమ్మాళి 17.6
రణస్థలం 15.2
పోలాకి 13.4
ఇచ్ఛాపురం 12.0
గార 11.8
సరుబుజ్జిలి 10.2