Rain fall: వర్షం.. అంచనా తప్పుతోంది..
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:31 AM
wrong Weather forecasts సిక్కోలు.. రాష్ట్రంలోనే సువిశాలమైన తీరప్రాంతం అధికంగా ఉన్న జిల్లాగా గుర్తింపు పొందింది. అయితే బంగాళాఖాతానికి ఆనుకుని జిల్లా ఉండటంతో తుఫాన్‌లు, వాయుగుండాల ప్రభావం తరచూ అధికంగా ఉంటోంది. ముప్పు పసిగట్టి.. ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో సూచనలు చేస్తున్న వాతావరణ శాఖ లెక్క.. అంచనా తప్పుతోంది.
గతంలో ‘తితలీ’ని గుర్తించడంలోనూ విఫలం
అటూ ఇటుగా వాతావరణ సూచనలు
ముప్పు పసిగట్టడంలో స్పష్టతలేని వైనం..
తాజా వాయుగుండం పరిస్థితి అదే
శ్రీకాకుళం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): సిక్కోలు.. రాష్ట్రంలోనే సువిశాలమైన తీరప్రాంతం అధికంగా ఉన్న జిల్లాగా గుర్తింపు పొందింది. అయితే బంగాళాఖాతానికి ఆనుకుని జిల్లా ఉండటంతో తుఫాన్‌లు, వాయుగుండాల ప్రభావం తరచూ అధికంగా ఉంటోంది. ముప్పు పసిగట్టి.. ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో సూచనలు చేస్తున్న వాతావరణ శాఖ లెక్క.. అంచనా తప్పుతోంది. ఇటీవల బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్‌అలర్ట్ ప్రకటించింది. అసాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని.. సరిహద్దుల్లో తీరం దాటనుండటంతో రెండు మూడు ప్రాంతాల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని.. వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీరప్రాంతాల్లో మకాం వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు కూడా ఇచ్చేశారు. కానీ, ఆదివారం భారీ వర్షం కురవగా, సోమ, మంగళవారాల్లో మాత్రం వాయుగుండం ప్రభావం జిల్లాపై పెద్దగా చూపలేదు. ప్రమాదం సంభవించకపోవడమే అన్ని విధాలా మేలు. కానీ వాతావరణ శాఖ సూచనలు అంచనా తప్పుతుండడం చర్చనీయాంశమవుతోంది.
‘తితలీ’ సమయంలోనూ విఫలం..
జిల్లాలో ఉద్దానం ప్రాంత ప్రజలు 2018లో సంభవించిన తితలీ తుఫాన్ విలయాన్ని మరువలేరు. అప్పట్లో తితలీ తుఫాన్ ముప్పును అధికార యంత్రాంగం సరిగ్గా గుర్తించలేకపోయింది. వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారధి ప్రాంతం వద్ద తుఫాన్ తీరం దాటింది. ఆ రోజు ఓవైపు భారీ వర్షం.. మరోవైపు ఈదురుగాలుల బీభత్సానికి ఉద్దానంలో కొబ్బరిచెట్లు, జీడిమామిడి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. ఒకవేళ తుఫాన్ ప్రభావం ముందుగా గుర్తించినా.. ప్రాణనష్టం మినహా.. ఇతర నష్టాలను ప్రకృతి వైపరీత్యం నుంచి కాపాడుకోవడం అంతటి సులభంకాదు. కానీ అంచనా వేయలేకపోవడం.. జిల్లాలో ఇంతటి విపత్తు సంభవిస్తుందని గుర్తించకపోవడం.. అప్పుడు చర్చనీయాంశమైంది. అప్పట్లో సీఎం చంద్రబాబునాయుడు జిల్లాలోనే మకాం వేశారు. మంత్రులను, ఐఏఎస్ అధికారులను జిల్లాకు రప్పించి యుద్ధప్రాతిపదికన పునరావాస పనులు పూర్తిచేయించారు.
తుఫాన్‌లంటేనే వణుకు
తీరానికి ఆనుకుని ఉండటం.. సముద్రం నుంచి వీచే గాలులు.. తుఫాన్‌ల సమయంలో అల్పపీడనం.. వాయుగుండం.. ఇతర ముప్పులతో తరచూ జిల్లావాసులు వణుకుతున్నారు. 2014లో హుద్‌హుద్ తుఫాన్ విశాఖపట్నంలోనే కాదు శ్రీకాకుళం జిల్లా పై కూడా ప్రభావానికి గురైంది. కొన్ని రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు నానా అవస్థలకు గురయ్యారు. నిత్యావసరాలకు సైతం ఇబ్బందులకు పడ్డారు. విపత్తులను ఎదుర్కొనే సత్తా ఉన్నా.. ముందుగానే అంచనావేసే కచ్చితమైన సమాచారం ఇచ్చే వ్యవస్థ.. ఇటు వాతావరణ శాఖ బలపడలేదని పలు సంఘటనలు నిరూపిస్తున్నాయి. వాతావరణ కేంద్రం నుంచి వెలువడే ప్రకటనలు.. పారదర్శకంగాను.. ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించేలా.. మత్స్యకారులకు విపత్తులనుంచి రక్షణ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.