Heatwave: తగ్గిన వాన.. పెరిగిన ఎండ..
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:59 PM
Temperature Rise.. Climate Change పేదల ఊటీగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలో వర్షాకాలంలోనూ వేసవి తాపం వీడట్లేదు. ఆశించినస్థాయిలో వర్షాలు కురవకపోవడం.. చాలాచోట్ల చిరుజల్లులకే పరిమితం కావడంతో పగలు వేసవి మాదిరి ఎండ తీవ్రత కనిపిస్తోంది.
ఆశించిన స్థాయిలో కురవని వర్షాలు
జూలైలోనూ లోటు వర్షపాతమే...
ఉక్కపోతతో ప్రజల అవస్థలు
శ్రీకాకుళం, జూలై 29(ఆంధ్రజ్యోతి): పేదల ఊటీగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలో వర్షాకాలంలోనూ వేసవి తాపం వీడట్లేదు. ఆశించినస్థాయిలో వర్షాలు కురవకపోవడం.. చాలాచోట్ల చిరుజల్లులకే పరిమితం కావడంతో పగలు వేసవి మాదిరి ఎండ తీవ్రత కనిపిస్తోంది. అప్పుడప్పుడు మేఘాలు కమ్ముకున్నా.. ఆపై బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా జిల్లాపై వర్ష ప్రభావం పెద్దగా చూపలేదు. దీంతో ఇప్పటికీ లోటు వర్షపాతం వెంటాడుతోంది. ఆపై ఉక్కపోతతో జిల్లాప్రజలు అవస్థలు పడుతున్నారు.
13.31 శాతం లోటు వర్షపాతం.
వాతావరణ గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 29వరకు 291.53 మిల్లీమీటర్లు వర్షపాతం కురవాలి. కానీ పెద్దగా వర్షాలు కురవలేదు. 252.73 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. రెండు నెలల్లో 13.31 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం కారణంగా ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. మరోవైపు వర్షాకాలంలోనే ఇలా ఉంటే ఖరీఫ్ సాగు పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ఆరంభంలోనే వరినాట్లు ఎండిపోతున్నాయని వాపోతున్నారు.
వేసవి మాదిరిగా ఉష్ణోగ్రతలు..
జిల్లాలో నెల రోజుల నుంచి సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోమవారం గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మంగళవారం మాత్రం మబ్బులు కమ్ముకున్నాయి. అయినప్పటికీ 33 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత కారణంగా శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పాతపట్నం, ఆమదాలవలస, నరసన్నపేట, పలాస, టెక్కలి వంటి పట్టణాల్లోనూ.. అన్ని మండల కేంద్రాల్లో మధ్యాహ్నం రోడ్లు నిర్మానుష్యమవుతున్నాయి. జూలైలోనూ ఎండల తీవ్రత నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
------------------------------------------------------------------------
సోమవారం జూన్1 నుంచి జూలై
మండలం ఉష్ణోగ్రతలు 29 వరకు వర్షపాతం
------------------------------------------------------------------------
ఆమదాలవలస 34.56 -9.35
బూర్జ 36.29 -17.4
ఎచ్చెర్ల 35.1 1.95
జి.సిగడాం 34 0.32
గార 36.1 -2.48
హిరమండలం 36.1 -31.6
ఇచ్ఛాపురం 33.7 -33.71
జలుమూరు 33.9 -7.83
కంచిలి 35.5 -14.5
కవిటి 33.6 -31.18
కోటబొమ్మాళి 34.36 -13.3
కొత్తూరు 35.1 -29.54
లావేరు 36.44 15.95
ఎల్.ఎన్.పేట 36 -14.93
మందస 35.9 -5.14
మెళియాపుట్టి 35.71 -25.18
నందిగాం 34.5 -9.46
నరసన్నపేట 36.1 -19.02
పలాస 37 -13.17
పాతపట్నం 35.2 -18.96
పోలాకి 32.5 -16.88
పొందూరు 36.41 -12.69
రణస్థలం 33.6 18.63
సంతబొమ్మాళి 34.6 -9.22
సారవకోట 38.9 -28.76
సరుబుజ్జిలి 35 -15.58
సోంపేట 33.9 -7.4
శ్రీకాకుళం 34.3 13.39
టెక్కలి 34.5 -22.53
వజ్రపుకొత్తూరు 36.0 -5.79