స్వచ్ఛత.. నిరంతర ప్రక్రియ
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:10 AM
We will make Sikkolu pollution-free ‘మన ఇంటిని, పరిసరాలను, సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛత అనేది నిరంతర ప్రక్రియ’ అని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కి ంజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
సిక్కోలును కాలుష్యరహితంగా తీర్చిదిద్దుతాం
సైకిల్ వినియోగం పెరగాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
అరసవల్లి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ‘మన ఇంటిని, పరిసరాలను, సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛత అనేది నిరంతర ప్రక్రియ’ అని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కి ంజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సిక్కోలును కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. శనివారం అరసవల్లిలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి ‘స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛభారత్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిత్యుడి ఆలయ పరిసరాలు, ఇంద్రపుష్కరిణి వెనుక, ఖాజీపేట రోడ్డులో పరిసరాలను శుభ్రం చేశారు. రోడ్డును ఆనుకుని ఒక మొక్కను నాటారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా సాగుతున్నాం. జిల్లాలో స్వచ్ఛమైన వాతావరణం కోసం 25లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఆ లక్ష్యాన్ని చేరుకున్నందుకు ఆనందంగా ఉంది. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలి. సైకిల్ వినియోగం పెరగాలి. నగరంలో వీలైనంత వరకు రోడ్డుపక్కన సైకిలు ట్రాక్‌లు ఏర్పాటు చేస్తాం. ఆదివారాన్ని సైకిల్‌డే గా మార్చుకోవాలి. స్వచ్ఛతాహీ సేవలో జిల్లాను దేశంలోనే టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అందరం కృషి చేద్దాం. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతీ ఒక్కరూ తమ తల్లి పేరిట ఒక మొక్కను నాటి సంరక్షించాలి. మన ఇళ్లల్లో జరిగే శుభకార్యాలను సైతం పర్యావరణహితంగా నిర్వహించాలి. విశాఖకు గూగుల్ రావడం చారిత్రాత్మకం. ఈ విషయంలో కూడా కొందరు విమర్శలు చేస్తుండడం బాధాకరం. ఇండస్ట్రీయల్ హబ్‌గా మారడం ద్వారా పవర్ ఇండస్ట్రీ, ఆహార పరిశ్రమలు, టూరిజం ఎంతో అభివృద్ధి చెందుతాయి. తద్వారా 1.88 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. పలాసలో విమానాశ్రయ ఏర్పాటు కోసం అందరికీ న్యాయం చేసేలా ముందుకు వెళతామ’ని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ పీవీవీడీ ప్రసాదరావు, అరసవల్లి ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరి వరప్రసాద్ పాల్గొన్నారు.