irrigation water: పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వండి
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:07 AM
full water supply agricultural needs జిల్లాలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరినాట్లకు ఇబ్బందులు లేకుండా వంశధార ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు.
ఎత్తిపోతల పథకాల నుంచి తాత్కాలికంగా నిలుపుదల చేయాలి
మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
కోటబొమ్మాళి/ నందిగాం, జూలై 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరినాట్లకు ఇబ్బందులు లేకుండా వంశధార ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ‘వంశధార ఎడమ కాలువ పరిధిలో ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిసరఫరాను తాత్కాలికంగా నిలుపుదల చేయాలి. పలాస, టెక్కలి, నందిగాం మండలాల పరిధిలో శివారు ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం గొట్టాబ్యారేజీ నుంచి ఎడమ కాలువ ద్వారా అందిస్తున్న 1600 క్యూసెక్కులకు అదనంగా మరో 200 క్యూసెక్కులు పెంచాలి. కాలువకు గండ్లు పడకుండా పర్యవేక్షించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమించాలి. రైతులకు అవసరమైన ఎరువులు సిద్ధంగా ఉంచాల’ని మంత్రి అచ్చెన్న ఆదేశించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
‘వ్యవసాయాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 80 శాతం రాయితీపై డ్రోన్లు అందిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకోవాల’ని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. నిమ్మాడలో వ్యవసాయానికి ఉపయోగించే డ్రోన్‌ను ఆయన ప్రారంభించారు. నందిగాం మండలం నరేంద్రపురం రైతులకు రాయితీపై డ్రోన్‌లను పంపిణీ చేశారు. సాగులో డ్రోన్ల వినియోగం ద్వారా రైతులకు కూలి ఖర్చులతోపాటు సమయం ఆదా అవుతుందని తెలిపారు. దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో వంశధార ప్రాజెక్టు చైర్మన్ అరవల రవీంద్ర, ఇరిగేషన్ అధికారులు స్వర్ణకుమార్, బి.శేఖర్, మన్మధరావు, వ్యవసాయ శాఖ అధికారులు త్రినాఽథస్వామి, జగన్మోహనరావు, శ్రీకాంత్, టెక్కలి ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు కింజరాపు హరివరప్రసాద్, పినకాన అజయ్‌కుమార్, నంబాళ శ్రీనివాస్, బాలకృష్ణ పాల్గొన్నారు.