Share News

హామీలు నెరవేర్చాలి

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:10 AM

ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే.. వాటిని అమలు చేయించే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుందని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.

హామీలు నెరవేర్చాలి
మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

  • మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స

  • అభ్యంతర వ్యాఖ్యలు చేసిన పార్టీ నాయకులు

శ్రీకాకుళం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే.. వాటిని అమలు చేయించే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుందని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశామని.. కార్యకర్తలు, నాయకులు వీటిని ఫొటోలు తీసుకుని సోషల్‌ మీడియాలో విశేషంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రజలందరికీ బాబు ష్యూరిటీ.. సూపర్‌ సిక్స్‌ అంటూ సంతకాలు పెట్టి.. వాటిపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఫొటోలు ముద్రించి పంపిణీ చేశారని, వాటిని ఇప్పుడు మేము బయటకు తీసి ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మోసగాళ్లని విమర్శించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇస్తామన్న హామీలు... ఇంతవరకు నెరవేర్చకపోవడంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు కర్నూలులో మాట్లాడుతూ అక్కడ.. విమానాలు తిప్పు తామని చెబుతున్నారని.. పక్కనే ఉన్న విశాఖకే దిక్కులేదని విమర్శించారు. అలాగే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల భాషను కూడా విమర్శించారు. అయితే ఇదే సమావేశంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని ఉద్దేశిస్తూ.. టెక్కలి వైసీపీ ఇన్‌చార్జి పేడాడ తిలక్‌ ‘ఒరేయ్‌ అచ్చెన్నాయుడు.. దమ్ముంటే రారా.’ అంటూ అభ్యంతరకమైన పదజాలంతో విమర్శించారు. ఈ వ్యాఖ్యలను అక్కడున్న ఏ వైసీపీ నాయకుడు ఖం డించకపోవడం విశేషం. ఇదిలావుంటే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొనక పోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కంభా రవి బాబు, కురసాల కన్నబాబు, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్‌, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:10 AM