Share News

ప్రగతి పరుగులు.. విషాదగాయాలు

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:13 AM

Development with airport and railway lines జిల్లా అభివృద్ధి ప్రస్థానంలో 2025 కీలక మైలురాయిగా నిలిచింది. నవంబరు 15న విశాఖలో జరిగిన సమ్మిట్‌ సదస్సులో జిల్లా దశను మార్చే కీలక ఒప్పందం కుదిరింది. శ్రీకాకుళంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఎంఓయూ కుదుర్చుకోవడం శుభపరిణామం.

ప్రగతి పరుగులు.. విషాదగాయాలు
కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో విరిగిన రెయిలింగ్‌ (ఫైల్‌)

  • విమానాశ్రయం, రైల్వేలైన్లతో అభివృద్ధి

  • సంక్షేమ పథకాలతో ఇంటింటా ఆనందం

  • కలచివేసిన పలాసలో తొక్కిసలాట ఘటన

  • వరుస రోడ్డు ప్రమాదాలతో ఆందోళన

  • మావోయిస్టు అగ్రనేతల ఎన్‌కౌంటర్‌

  • శ్రీకాకుళం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి):

  • 2025.. మరో రెండు రోజుల్లో కాలగమనంలో కలసిపోనుంది. ఈ ఏడాది సిక్కోలు వాసులకు ఎన్నో తీపి జ్ఞాపకాలు... చేదు సంఘటనలు... ఎదురయ్యాయి. కూటమి ప్రభుత్వ పాలనలో జిల్లా ముఖచిత్రం మారేలా కీలక నిర్ణయాలు, భారీ ప్రాజెక్టుల హామీలు లభించాయి. ‘సూపర్‌ సిక్స్‌’ పథకాల్లో భాగంగా లబ్ధిదారులకు సంక్షేమ వరాలు కురిశాయి. మరోవైపు ఏకాదశి పర్వదినం వేళ.. పలాస-కాశీబుగ్గలో తొక్కిసలాట, వరుస రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు జిల్లా ప్రజలను కన్నీటి పర్యంతం చేశాయి. కొత్త ఏడాదిలో అడుగు పెట్టేముందు.. గత సంవత్సర కాలంలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న మార్పులు.. ఘటనలను మరోసారి గుర్తుచేసుకుందాం.

  • జిల్లా అభివృద్ధి ప్రస్థానంలో 2025 కీలక మైలురాయిగా నిలిచింది. నవంబరు 15న విశాఖలో జరిగిన సమ్మిట్‌ సదస్సులో జిల్లా దశను మార్చే కీలక ఒప్పందం కుదిరింది. శ్రీకాకుళంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఎంఓయూ కుదుర్చుకోవడం శుభపరిణామం. అలాగే సెప్టెంబరు 27న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవతో అమృత్‌భారత్‌ రైలు జిల్లా మీదుగా ప్రారంభమైంది. ఒడిశాలోని బరంపురం నుంచి సూరత్‌కు వెళ్లే ఈ రైలును కేంద్రమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

  • జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పొందూరు ఖద్దరుకు ఈ ఏడాది ‘జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌’ (జీఐ) ట్యాగ్‌ లభించింది.

  • ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ సమస్యల గుట్టు విప్పేందుకు నవంబర్‌ 21న ప్రభుత్వం ‘‘క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ ఆఫ్‌ అన్నోన్‌ ఇథియాలజీ’’ పేరుతో ప్రత్యేక రీసెర్చ్‌ ప్రాజెక్టును మంజూరు చేసింది.

  • సంక్షేమ వరాలు...

  • కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలు అమలులో భాగంగా జిల్లా ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది. ఏప్రిల్‌ 26న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ‘మత్స్యకార సేవలో’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మత్స్యకారుల వేట నిషేధ భృతిని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచారు. మత్స్యకార కుటుంబాలతో సీఎం చంద్రబాబు మాట్లాడి.. ఆర్థికసాయాన్ని అందజేశారు.

  • ఆగస్టు 15న ‘స్త్రీ శక్తి’ పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ టిక్కెట్‌ సేవలు పొందుతున్నారు.

  • అక్టోబరు 4న జిల్లాలో ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం కింద 13,887 మందికి రూ. 20.83 కోట్ల జమయ్యాయి.

  • నవంబరు 19న ‘అన్నదాత సుఖీభవం’ కింద 2,79,100 మంది రైతులకు ఆర్థిక సహాయం అందింది.

  • మెగా డీఎస్సీ ద్వారా జిల్లాకు చెందిన 528 మంది ఉపాధ్యాయులు కొలువులు సాధించి అక్టోబరు 13న విధుల్లో చేరారు. అక్టోబరు 1న పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన పూర్తయింది. అలాగే జిల్లా నుంచి 530 మంది పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాలను సాధించి.. ఈ నెల 16న నియామక పత్రాలను నేరుగా ముఖ్యమంత్రి నుంచి అందుకున్నారు.

  • అలాగే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ టెక్కలి మండలం రావివలస ప్రజలు, అధికారులతో వర్చువల్‌గా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి నిధులు మంజూరు చేయగా.. అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

  • విషాదాల సుడిగుండం..

  • నవంబరు 1న ఏకాదశిని పురస్కరించుకుని పలాస- కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మంత్రులు నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు.

  • ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబరు 25 వరకు జిల్లాలో ఏకంగా 652 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 251 మంది మరణించగా.. 755 మంది గాయపడ్డారు.

  • మార్చి 16న సారవకోట మండలం కురిడింగి వద్ద పెళ్లి బృందం కారు లారీని ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు.

  • నవంబరు 23న మధ్యప్రదేశ్‌కు చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న కారు కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద లారీని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు.

  • మే 16న మెళియాపుట్టిలోని క్వారీ పేలుడులో ముగ్గురు, అక్టోబరు 7న అదే మండలం గంగరాజపురం గ్రానైట్‌ క్వారీలో పిడుగుపాటుకు ముగ్గురు వలస కార్మికులు బలయ్యారు.

  • సెప్టెంబరు 2న పలాస మండలం కేశుపురంలో చేతబడి అనుమానంతో ఒక వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు.

  • రాష్ట్రంలో 218 దొంగతనాలు చేసిన మోస్ట్‌ వాంటెడ్‌ దొంగ దున్న కృష్ణను నవంబరు 22న శ్రీకాకుళం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

  • మే 4న చార్‌దామ్‌ యాత్ర పేరుతో హెలికాఫ్టర్‌ ఆశ చూపి ట్రావెల్‌ ఏజెన్సీ సిబ్బంది యాత్రికుల నుంచి రూ. 15వేలు వసూలు చేసి మోసం చేశారు.

  • ప్రకృతి కన్నెర్ర...

  • అక్టోబరు నెల జిల్లాలో రైతులకు కలిసి రాలేదు. అక్టోబరు 3న కురిసిన భారీ వర్షాలకు వంశధార, నాగావళి పొంగి ప్రవహించాయి. ముగ్గురు మృతి చెందారు. 8,690 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అక్టోబరు 27న వచ్చిన ‘మొంథా’ తుఫాన్‌ వల్ల 2,230 హెక్టార్లలో పంట దెబ్బతిని రూ.1.24 కోట్లు నష్టం జరిగింది.

  • మావోయిస్టు అగ్రనేతలు అంతం

  • జిల్లాలో పుట్టిన నక్సలిజం ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన మావోయిస్టు అగ్రనేతలు నంబాళ్ల కేశవరావు, టెక్‌ శంకర్‌, చలపతిరావు ఈ ఏడాదే వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మరణించారు. చలపతిరావు అంత్యక్రియలు ఈ జిల్లాలోనే జరిగాయి. మొత్తంగా చూస్తే.. 2025లో జిల్లా అభివృద్ధి పథంలో అడుగులు వేసినప్పటికీ అనుకోని ప్రమాదాలు ఆనందాన్ని ఆవిరి చేశాయి. 2026లో ప్రమాద రహిత సిక్కోలును ఆశిద్దాం.

Updated Date - Dec 30 , 2025 | 12:13 AM