పోక్సో కేసుల విచారణలో పురోగతి సాధించాలి
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:16 AM
POCSO cases investigation పోలీసుస్టేషన్లలో నమోదవుతున్న ఆస్తి(ప్రాపర్టీ), పోక్సో కేసుల విచారణలో వేగవంతమైన పురోగతి సాధించాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పోలీసు అధికారులకు ఆదేశించారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేలా దర్యాప్తు చేయడం, సాక్ష్యాధారాలు సమగ్రంగా సేకరించి నిందితులపై కఠినచర్యలు తీసుకోవడం ముఖ్యమని స్పష్టం చేశారు.
బాలికల భద్రతే తొలి ప్రాధాన్యం
ప్రజలకు మెరుగైన పోలీసు సేవలను అందిస్తాం
విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి
శ్రీకాకుళం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసుస్టేషన్లలో నమోదవుతున్న ఆస్తి(ప్రాపర్టీ), పోక్సో కేసుల విచారణలో వేగవంతమైన పురోగతి సాధించాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పోలీసు అధికారులకు ఆదేశించారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేలా దర్యాప్తు చేయడం, సాక్ష్యాధారాలు సమగ్రంగా సేకరించి నిందితులపై కఠినచర్యలు తీసుకోవడం ముఖ్యమని స్పష్టం చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం శ్రీకాకుళం సబ్‌డివిజన్ కార్యాలయం, టూటౌన్, ట్రాఫిక్, లావేరు పోలీసుస్టేషన్లను ఎస్పీ మహేశ్వరరెడ్డితో కలిసి డీఐజీ పరిశీలించారు. పోలీసు స్టేషన్లలో పలు రికార్డులను..పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించి.. నిర్ధిష్ట గడువులోగా పూర్తిచేయాలని సిబ్బందికి ఆదేశించారు. నిందితులపై చార్జిషీట్లను దాఖలు చేయాలని తెలిపారు. సబ్‌డివిజన్ వారీగా శాంతిభద్రతల విషయాన్ని డీఎస్పీ వివేకానందను అడిగి తెలుసుకున్నారు.
పోక్సో కేసుల్లో బంధువులే నేరస్థులుగా...
డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ.. ‘ఏడాదిలో ప్రాపర్టీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దర్యాప్తులో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణ.. అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పాఠశాలలో విద్యార్థుల కోసం బంధువులు ఎవరైనా వస్తే వారి తల్లిదండ్రులను సంప్రదించి వారి వివరాలపై యాజమాన్యం ఆరా తీయాలి. చిన్నారులపై విద్యాసంస్థలలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది అఘాయిత్యాలకు పాల్పడడం శోచనీయం. పోక్సో కేసుల్లో బంధువులే నేరస్థులుగా ఎక్కువగా ఉంటున్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులతో పాటు సంబంఽధిత విభాగాల సమన్వయంతో పాఠశాలలు, కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, చైల్డ్ మ్యారేజ్ వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి.. వారితో మమేకమవ్వాల’ని చెప్పారు.
అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు
‘ఇటీవల ఫేక్ ఐడీ, ప్రొఫైల్, క్రియేట్ చేసి సామాజిక మాధ్యమం ద్వారా తప్పుడు ప్రచారాలు, వదంతులు చేస్తున్నారు. అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపించి.. అమాయక ప్రజలను సైబర్ నేరగాళ్లు పలు విధాలుగా మోసం చేస్తున్నారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాల’ని డీఐజీ తెలిపారు.
గంజాయిపై ఉక్కుపాదం..
‘గంజాయి అక్రమ రవాణాతోపాటు గంజాయి తీసుకునే వారిపైనా కూడా కఠినచర్యలు తీసుకుంటాం. గంజాయి కట్టడికి డ్రోన్ సర్వెలెన్స్‌తో పాటు నిఘా వ్యవస్థ పటిష్టం చేశాం. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలను అందించడం, ప్రతి ఫిర్యాదును న్యాయంగా పరిష్కరించడం.. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం పోలీసు శాఖ లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పనిచేయాలి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. డ్రంకెన్‌డ్రైవ్, మైనర్‌డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్.. అతి వేగంగా నడిపే వాహనాల గుర్తించి కేసులు నమోదు చేయాల’ని డీఐజీ స్పష్టం చేశారు.