సిక్కోలులో ప్రగతి పరుగులు
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:41 AM
శ్రీకాకుళం... పేదరికానికి చిరునామాగా... వలసల జిల్లాగా ముద్రపడింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అత్యంత కీలకమైన ప్రభుత్వ పదవులను ఇక్కడి ఆ పార్టీ నాయకులకు కేటాయించారు.
- వేల కోట్లతో అభివృద్ధి పనులు
- పోర్టుకు అనుసంధానంగా ఎయిర్‌పోర్టు
- ‘ఆమదాలవలస-శ్రీకాకుళం’ రోడ్డుకు మోక్షం
- గ్రామాల్లో తారు, సీసీ రోడ్లు
- ఐదు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు
- పింఛన్ల పెంపు.. దివ్యాంగులకు జీవితంపై పెరిగిన భరోసా
- ఇదీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన ప్రత్యేకత
శ్రీకాకుళం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం... పేదరికానికి చిరునామాగా... వలసల జిల్లాగా ముద్రపడింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అత్యంత కీలకమైన ప్రభుత్వ పదవులను ఇక్కడి ఆ పార్టీ నాయకులకు కేటాయించారు. ఇందులో ఒకరు అసెంబ్లీ స్పీకర్, మరొకరు ఉప ముఖ్యమంత్రి, ఇంకొకరు పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి. ఆ తర్వాత రెవెన్యూ మంత్రిగా మరొకరు.. ఇలా కీలకమైన పదవులు జిల్లాకు వరించాయి. వీరితో శ్రీకాకుళం జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని జనం ఆశించారు. కానీ.. వారి ఆశలు అడియాశలయ్యాయి. కనీసం గ్రామానికి ఒక్క రోడ్డు.. పట్టణంలో ఓ కాలువను కూడా నిర్మించలేకపోయారు. ఐదేళ్ల కాలంలో రాజకీయ కక్షలు.. అక్రమ కేసులు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తెచ్చుకున్న పథకాలను నిర్లక్ష్యం చేసి.. డబ్బులు పంచుతున్నామన్న ధ్యాస తప్ప మరొకటి లేకపోయింది. దీంతో 2024 ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగానూ.. ఇటు జిల్లాలోనూ పక్కబోర్లా పడింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరి నేటికి ఏడాది పూర్తవుతోంది. కూటమి ఖాతాలో శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు ఎంపీ స్థానాలు చేరడంతో.. అదేరీతిన అభివృద్ధి పరుగులెడుతోంది. గత ప్రభుత్వానికి భిన్నంగా ఏడాదిలో ఇటు సంక్షేమ.. అటు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. పేదలకు నేరుగా లబ్ధి కలిగిన కార్యక్రమాలు అధికంగా ఉన్నాయి. సంతృప్తి స్థాయి లెక్కలేదు. ముఖ్యంగా పట్టణాల్లో కేవలం రూ.5కే కడుపు నిండా భోజనం లభించేలా చేశారు. అంతటా రోడ్లు వేసి.. కోట్లాది రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులెత్తిస్తున్నారు.
అన్న క్యాంటీన్‌లలో 5,09,189 మందికి మధ్యాహ్న భోజనం
వైసీపీ హయాంలో అన్న క్యాంటీన్లను మూసివేశారు. మరలా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీకాకుళంలో రెండు, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస కాశీబుగ్గలో అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేశారు. రూ.15కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలు అందిస్తున్నారు(పూటకు రూ.5). ఇప్పటివరకు అల్పాహారం చేసినవారి సంఖ్య 2,37,412 మంది. మధ్యాహ్నం భోజనం 5,09,189 మంది. రాత్రి భోజనం చేసిన వారి సంఖ్య 1,62,686 మంది. పేదలు, చిరుద్యోగులు.. అసంఘటిత కార్మికులకు ఎంతగానో అన్నక్యాంటీన్లు ఉపయోగపడుతున్నాయి. పట్టణ ప్రజలకు.. పట్టణాల్లో వివిధ పనులకు వచ్చేవారికి ఎంతగానో ఇవి ఉపయోగపడుతున్నాయి. మండల కేంద్రాల్లో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఎన్టీఆర్ భరోసా.. మెగా డీఎస్సీ... ఉచిత సిలిండర్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 ఏప్రిల్ నుంచి సామాజిక భద్రతా పింఛన్లపై రూ. వెయ్యి చొప్పున పెంచి అందజేసింది. దివ్యాంగులకు పింఛను రెట్టింపు చేసి వారి జీవితాల్లో మరింత వెలుగులు నింపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆపై ఉచిత గ్యాస్ సిలిండర్లతో మొదటి విడత వేలాది మందికి లబ్ధి చేకూరింది. త్వరలో అర్హత ఉన్న కుటుంబాలకు తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటివి అమలు కానున్నాయి. మెగా డీఎస్సీతో శ్రీకాకుళం జిల్లాలో సమారు 600 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. పూర్తి సామర్థ్యంతో ప్రభుత్వ బడులు త్వరలో తెరుచుకోనున్నాయి. పేదలకు నాణ్యమైన పుస్తకాలు, సామగ్రిని ప్రభుత్వం అందజేయనుంది.
పథకాలన్నీ పునరుద్ధరణ
శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డును ఐదేళ్లలో అటు స్పీకర్.. ఇటు రెవెన్యూ మంత్రి పూర్తి చేయలేకపోయారు. కానీ ఈ ఏడాది కాలంలో దాదాపు 90 శాతం రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఇదే రోడ్డులో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. వైసీపీ హయాంలో వంశధార ప్రాజెక్టు పనులను అటకెక్కించేసింది. ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ను పట్టించుకోలేదు. భావనపాడు పోర్టును పేరు మార్చేసి పట్టాలెక్కించారు. ఇప్పుడు వంశధార ప్రాజెక్టు, ఆఫ్‌షోర్ ప్రాజెక్టులను ప్రాధాన్య జాబితాలో ప్రభుత్వం చేర్చింది. గొట్టా బ్యారేజీకి సైతం ప్రభుత్వం నిధులు ఇచ్చింది.
పాతపట్నానికి రూ.650 కోట్లు..
పాతపట్నం నియోజకవర్గానికి ఏడాది కాలంలో ప్రభుత్వం నుంచి ఏకంగా రూ.650 కోట్లు మంజూరయ్యాయి. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుకుగాను (వంశధార నుంచి) రూ.265 కోట్లు విడుదలయ్యాయి. ఐటీడీఏ పరిధిలో ఉన్న మండలాల్లో ఎల్.ఎన్.పేట మినహా అన్ని మండలాల్లో రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నిధులు తెప్పించారు. పంచాయతీరాజ్ నుంచి గ్రామీణ ప్రాంతాల రోడ్లకు రూ.60 కోట్లు, రూ.210 కోట్లతో ఎనభై రోడ్లు, మెళియాపుట్టిలో ఇండ స్ట్రియల్ పార్కు, నియోజకవర్గంలో ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల, వంశధార ఫేజ్-2 పనుల కోసం రూ.182 కోట్లు, అన్న క్యాంటీన్ల కు భవనాన్ని మంజూరు చేయించుకున్నారు.
పలాసలో రూ. 518 కోట్లు..
పలాస నియోజకవర్గంలో గత ఐదేళ్ల కాలంలో మంత్రి ప్రాతినిధ్యం వహించినా అభివృద్ధి సున్నా. గత ప్రభుత్వం తెచ్చిన పోర్టుకు పేరు మార్చేశారు. ఈ ఏడాదిలో అక్కడ అభివృద్ధి పనులకు రూ.518 కోట్లు వెచ్చించారు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించింది. పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో సీసీరోడ్లు, తారు రోడ్లకు ఉపాధి నిధుల నుంచి దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు చేశారు. ప్రధానమంత్రి జన్‌మన్ స్కీమ్ ద్వారా కొంకడాపుట్టి వద్ద రెసిడెన్షియల్ స్కూల్ రూ.2.3 కోట్లతో నిర్మాణంలో ఉంది. జల్‌జీవన్ మిషన్ ద్వారా మూడు మండలాల్లో ఇంటింటికీ నీరు అందించేందుకుగాను రూ.110 కోట్లు, కాశీబుగ్గ రైల్వేగేటు ఆర్వోబీ నిర్మాణానికి రూ.43 కోట్లు, తాళభద్ర రైల్వేగేటు ఆర్వోబీకి రూ.50 కోట్లు, ఇరిగేషన్ కాలువలు, నగర వనాలు.. పంచాయతీల పరిధిలో రోడ్లు, వంతెనలకు కలిపి మొత్తం రూ.518 కోట్లు వెచ్చించారు.
నరసన్నపేటలో పల్లెపల్లెలో రోడ్లు..
నరసన్నపేట నియోజకవర్గానికి గతంలో ఉప ముఖ్యమంత్రి (వైసీపీ హయాంలో) ప్రాతినిధ్యం వహించారు. కానీ అభివృద్ధి లేదు. ఇప్పుడు ఏడాది కాలంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో ముందుగా గ్రామీణ ప్రాంతాలకు.. అలాగే హైవేకు కనెక్టెడ్ రోడ్లను తీసుకువచ్చారు. బొంతు ఎత్తిపోతల పథకాన్ని రూ.180 కోట్లతో.. గార-వనిత మండలం వంతెన నిర్మాణాన్ని, అసంపూర్తిగా నిలిచిపోయిన వంద పడకల ఆసుపత్రిని పునరుద్ధరించారు. రూ. 100 కోట్లతో నియోజకవర్గంలో 149 రోడ్ల నిర్మాణం జరుగుతోంది. దాదాపు 85 శాతం రోడ్లు పూర్తయ్యాయి.
స్థానిక యువతకు ఉపాధి...
జిల్లాలో అత్యధిక పరిశ్రమలు ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే ఉన్నాయి. కానీ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. ఏడాది కాలంలో స్థానిక పరిశ్రమల్లో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. రూ.80 కోట్లతో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం జరుగుతోంది. కొత్తపేట, ముద్దాడ, అదపాక, కొయ్యాం, కొచ్చెర్లకు రూ.కోట్లు వెచ్చించి తారు రోడ్లు నిర్మిస్తున్నారు. రూ. 250 కోట్లతో జలజీవన్ మిషన్ పనులకు అనుమతి మంజూరయ్యింది. వంశధార నుంచి సురక్షిత నీటిని అందించేందుకుగాను రూ.500 కోట్లు అవసరమని ప్రభుత్వానికి డీపీఆర్ పంపించారు. నారాయణపురం కాలువ, మడ్డువలస, తోటపల్లి కాలువల్లో పూడికతీతతో పాటు పెండింగ్ పనులు జరుగుతున్నాయి.
శ్రీకాకుళం, టెక్కలి, ఇచ్ఛాపురం, ఆమదాలవలసలో అభివృద్ధి పరుగులు..
టెక్కలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పెండింగ్ పనులను పూర్తి చేయిస్తున్నారు. పలాసలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు సహకారంతో శ్రీకారం చుట్టారు. అటు మూలపేట పోర్టు, ఇటు ఎయిర్ పోర్టు పూర్తయితే జిల్లా రూపురేఖలు మారనున్నాయి. భావనపాడు ఫిషింగ్ హార్బర్ పట్టాలెక్కింది. ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల, పలాస నియోజకవర్గాల్లో మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ఏకంగా రూ. 20వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఇచ్ఛాపురంలో తరచూ శంకుస్థాపనలతో కొత్త కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో తారు రోడ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. సామాన్యులకు గతంలో ఇబ్బందికరంగా ఉండే ఇసుక చౌకగా లభ్యమవుతోంది. ఇక మద్యం విషయానికొస్తే.. అప్పుడు ‘జె’ బ్రాం డ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు టాప్ బ్రాండ్ల మద్యం లభ్యమవుతోంది. మద్యం విక్రయాల్లో పారదర్శకత ఏర్పడింది. గందరగోళంగా ఉండే జగనన్న ఇళ్ల కాలనీలను పక్కనబెట్టి.. ముందుగా సొంత ఇళ్లను నిర్మించుకునే వారికి ప్రభుత్వ సాయం రెట్టింపు చేసింది. ఇలా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చెప్పుకోదగిన అభివృద్ధినే చేసింది.