Share News

డీజేలతో అలజడి

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:42 AM

DJ sounds more వివాహాలు, పండుగలతోపాటు ఏ శుభకార్యమైనా చాలు.. డీజే శబ్దాల మోత మోగుతోంది. పరిమితికి మించిన అతి ధ్వనులతో అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. శబ్దాల మోత తట్టుకోలేక కొంతమంది గుండెపోటుతో మరణించిన సంఘటనలూ ఉన్నాయి. ఊరేగింపుల సమయంలో డ్యాన్సులు చేస్తూ కొందరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ పలుచోట్ల చోటుచేసుకున్నాయి.

డీజేలతో అలజడి
భవానీపురంలో శిథిలమైన భవనాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ లక్ష్మణరావు, ఆర్‌అండ్‌బీ, పీసీబీ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు

ఇష్టారాజ్యంగా శబ్దాలు

భారీ రణధ్వనులతో ప్రజలకు తప్పని ముప్పు

నరసన్నపేట, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): వివాహాలు, పండుగలతోపాటు ఏ శుభకార్యమైనా చాలు.. డీజే శబ్దాల మోత మోగుతోంది. పరిమితికి మించిన అతి ధ్వనులతో అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. శబ్దాల మోత తట్టుకోలేక కొంతమంది గుండెపోటుతో మరణించిన సంఘటనలూ ఉన్నాయి. ఊరేగింపుల సమయంలో డ్యాన్సులు చేస్తూ కొందరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ పలుచోట్ల చోటుచేసుకున్నాయి. తాజాగా బుధవారం అర్ధరాత్రి నరసన్నపేట పట్టణం భవానీపురంలో నందెన్న ఉత్సవాల్లో భాగంగా డీజే ఏర్పాటు చేయగా.. ఆ శబ్దాలకు శిఽథిలావస్థలో ఉన్న ఓ భవనం పోర్టుకో కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నా డీజేల ఏర్పాటుపై కొంతమంది యువకులు వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. డీజే శబ్దాల రోతకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. శబ్దం తీవ్రత పెరిగే కొలదీ రుగ్మతలు ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినికిడి లోపంతో పాటు మానసిక వ్యాధులు కలుగుతాయని పేర్కొంటున్నారు. రక్తపోటు పెరిగి వికారం, బ్రెయిన్‌స్టోక్‌, గుండెపోటు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. అధిక శబ్దాలతో పర్యావరణం కాలుష్యమై పలు నష్టాలు జరిగే అవకాశం ఉందని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు తెలిపారు.

కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు మేరకు పారిశ్రామిక ప్రాంతాల్లో పగలు 75 డెసిబుల్స్‌, రాత్రి సమయంలో 70 డెసిబుల్స్‌కు శబ్దాలు మించరాదు. వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో పగలు 65 డెసిబుల్స్‌, రాత్రి 55 డెసిబుల్స్‌ మధ్య ఉండాలి. నివాస ప్రాంతాల్లో పగలు 55 డెసిబుల్స్‌, రాత్రి 45 డెసిబుల్స్‌, సైలెన్స్‌ జోన్‌లో 40 డెసిబుల్స్‌ మించరాదు. కానీ డీజేలు ద్వారా 150 నుంచి 200 డెసిబుల్స్‌ వరకు శబ్దాలు వస్తాయి. 85 డెసిబుల్స్‌ మించి శబ్దాలు వింటే ప్రజలకు అనర్థాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. నివాస ప్రాంతాల్లో 100 డెసిబుల్స్‌ దాటితే పాత భవనాలు కూలే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అధిక శబ్దాల ప్రకంపనలతో భవనాలు బీటలు వారే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. పరిమితికి మించిన శబ్దాలు పనికిరాదని హెచ్చరిస్తున్నారు.

నాడీ వ్యవస్థపై ప్రభావం

మనిషి మొదడు 85 డెసిబుల్స్‌ వరకు మాత్రమే శబ్దాలను గరిష్టంగా గ్రహించగలదు. అఽధిక ధ్వనులతో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో బ్రెయిన్‌స్ర్టోక్‌ ఎక్కువగా వస్తుంది. పిల్లల్లో అయితే వినికిడి సమస్య ఏర్పడుతుంది. వృద్ధులు డీజే సౌండ్స్‌కు దూరంగా ఉండాలి. మానసిక వైకల్యం కూడా కొందరిలో ఏర్పడే అవకాశం ఉంటుంది.

- బి.నవీన్‌, చిన్న పిల్లలు వైద్యనిపుణుడు, కొటబొమ్మాళి సామాజిక ఆసుపత్రి

శబ్దకాలుష్యంతో హాని

వాతావరణంలో శబ్దకాలుష్యంతో ప్రతీ జీవరాశికి నష్టం కలుగుతుంది. 75 డెసిబుల్స్‌ మించి శబ్దాలు చేయరాదు. 75 డెసిబుల్స్‌ శబ్ధాలతో వాతావరణంలో మార్పులు సంబవించి అనేక అనర్ధాలు ఏర్పడతాయి. శిథిలమైన భవనాలు, వంతెనలు, పెద్దపెద్ద భవనాలు వద్ద డీజే సౌండ్‌ ఎటువంటి పరిస్థితిల్లో పెట్టరాదు.

- హరీష్‌, ఏఈ, కాలుష్యనియంత్రణ బోర్డు, శ్రీకాకుళం

అనుమతి తప్పనిసరి

పండుగలు, ఉత్సవాలు సమయంలో నాలుగు రోజులు ముందుగా పోలీసులు అనుమతి తీసుకోవాలని పదేపదే చెబుతున్నాం. అధిక శబ్దాలు చేస్తే చట్టరీత్యా నేరం. పోలీసులు అనుమతులు లేకుండా ఎటువంటి ఊరేగింపులు చేయరాదు.

లక్ష్మణరావు, డీఎస్పీ, టెక్కలి

Updated Date - Oct 17 , 2025 | 12:42 AM