హెడ్ పోస్టాఫీస్‌ల్లో సమస్యల తిష్ఠ
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:48 PM
Post Office Issues హెడ్ పోస్టాఫీసుల్లో వినియోగదారులకు సమస్యలు వెంటాడుతున్నాయి. కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సేవలు సక్రమంగా అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు తప్పడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
సిబ్బంది నిర్లక్ష్యంతో విధుల్లో జాప్యం
మరోవైపు సాంకేతిక ఇబ్బందులు
వినియోగదారులకు ఇక్కట్లు
ఇచ్ఛాపురం, జూలై 12(ఆంధ్రజ్యోతి): హెడ్ పోస్టాఫీసుల్లో వినియోగదారులకు సమస్యలు వెంటాడుతున్నాయి. కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సేవలు సక్రమంగా అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు తప్పడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల సిబ్బంది కొరత ఉండగా.. మరికొన్ని చోట్ల సిబ్బంది బాధ్యతగా వ్యవహరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పోస్టాఫీసులకు ఆదరణ పెరుగుతున్నా.. వసతులు మాత్రం మెరుగుపడడం లేదని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 3 ప్రధాన తపాలా, 64 ఉప తపాలా కార్యాలయాలున్నాయి. మరో 507 శాఖ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ప్రధాన పట్టణాల్లోని 17 పోస్టాఫీసుల్లో ఆధార్‌తోపాటు ఇతరత్రా కీలకమైన సేవలు అందిస్తున్నారు. శ్రీకాకుళం, టెక్కలి, ఆమదాలవలస, సోంపేట కార్యాలయాల్లో వేగవంతంగా పనులు అవుతున్నాయి. మిగతా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఇంటర్ నెట్ సౌకర్యం సవ్యంగా లేకపోవడం తదితర కారణాలతో సక్రమంగా సేవలందడం లేదు. ఇచ్ఛాపురం తపాలాశాఖ కార్యాలయంలో వినియోగదారులకు అసౌకర్యం తప్పడం లేదు. ఆపై సిబ్బంది వ్యవహార శైలిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్ఛాపురంలో రెండు పోస్టాఫీసులు ఉండేవి. కానీ అందులో చిన్న పోస్టాఫీసు ఎత్తివేశారు. దీంతో ఒకే ఒక్క పోస్టాఫీసు రద్దీగా మారుతోంది. వినియోగదారులకు ఆశించిన స్థాయిలో సాయం అందక గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ కార్యాలయంలో 3 నెలలుగా ప్రింటర్ లేదు. కొత్తగా తెచ్చిన ప్రింటర్ వారం రోజులకే మూలన పడేశారు. రెండు నెలలుగా పాస్ బుక్స్ ఇవ్వకపోవటంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. తపాలాశాఖ ద్వారా అద్భుతమైన సేవలు.. ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సేవలు మెరుగుపరచాలని కోరుతున్నారు.
మూడు రోజులుగా తిరుగుతున్నా...
నా భార్య ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పని చేస్తోంది. ఆమెకు సంబంధించిన పీఎల్‌ఐ కట్టేందుకు మూడు రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. కాని పని కావటం లేదు. 9న వస్తే 10న రమ్మన్నారు. 10న వస్తే నో నెట్ వర్క్ బోర్డ్ అని పెట్టారు. మళ్లీ 11న వెళ్లినా అదే పరిస్థితి. నెట్‌వర్క్ సమస్య ఉందని, పురుషోత్తపురం వెళ్లి డబ్బులు కట్టుకోండి అని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
- రత్నం, ఇచ్ఛాపురం
అవగాహన పెరగాలి
ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తప్పవు. పోస్టల్ సేవలపై ప్రజల్లో అవగాహన పెరగాలి. ప్రభుత్వరంగ సంస్థలైన పోస్టాఫీస్, ఎల్‌ఐసీలో డిపాజిట్లు చేయాలి. మంచి వడ్డీతో పాటు బీమా పథకాలు సైతం వర్తిస్తాయి. ఇటీవల కేంద్ర పోస్టల్ డిపార్ట్ మెంట్ అన్నివర్గాల ప్రజలకు అందుబాటులోని పొదుపు పథకాలు తెచ్చింది.
- జ్ఞానవతి, హెడ్ పోస్టుమాస్టర్, ఇచ్ఛాపురం