పర్యవేక్షణ ఉంటే ఒట్టు!
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:54 PM
Hostel students faced the problems గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు వెంటాడుతున్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 29 ఆశ్రమ పాఠశాలలు, రెండు గురుకుల పాఠశాలలు, 18 మెట్రిక్ వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో 16,686 మంది విద్యార్థులు ఉన్నారు. చాలా వసతిగృహాల్లో సమస్యలు వేధిస్తున్నాయి.
గిరిజన విద్యాలయాల్లో సమస్యలు
హాస్టళ్ల కిటికీలకు కానరాని మెస్‌లు
లోపలకు వచ్చేస్తున్న దోమలు
సక్రమంగా అమలుకాని మెనూ
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
మెళియాపుట్టి మండలం పెద్దమడి గురుకుల పాఠశాలలో సుమారు 377 మంది విద్యార్థులు ఉన్నారు. వసతి గది కిటికీలు పూర్తిగా పాడయ్యాయి. వాటికి మెస్‌లు లేకపోవడంతో దోమలు లోపలకు వచ్చేస్తున్నాయి. విద్యార్థులు రాత్రి సమయంలో కిటికీలకు దుప్పట్లు కట్టి దోమల నుంచి రక్షణ పొందుతున్నారు. అలాగే పెద్దమడి గురుకుల కళాశాలలో 185 మంది విద్యార్థులు ఉండగా వారు నిద్రపోవడానికి సరిపడా గదులు లేవు. ఒకే గదిలో వంద మంది వరకు పడుకుం టున్నారు. మరికొంత మంది తరగతి గదులకు వెళ్లి నిద్రపోవాల్సి వస్తోంది.
...............
మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలలో 115 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో భోజనం గది లేక వరండాల్లో విద్యార్థులు తింటున్నారు. వంటశాల లేక ఆరుబయట వంటలు చేయాల్సి వస్తోంది.
మెళియాపుట్టి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు వెంటాడుతున్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 29 ఆశ్రమ పాఠశాలలు, రెండు గురుకుల పాఠశాలలు, 18 మెట్రిక్ వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో 16,686 మంది విద్యార్థులు ఉన్నారు. చాలా వసతిగృహాల్లో సమస్యలు వేధిస్తున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సౌకర్యాలు కరువయ్యాయి. రక్షణ గోడలు లేవు. మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. కిటికీలకు తలుపులు లేకపోవడంతో దోమలు లోపలకు వచ్చేస్తున్నాయి. దీంతో విద్యార్థులకు కంటి నిండా కునుకు కరువవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని గురుకుల పాఠశాలలు, కళాశాలలు, మినీ గురుకులాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ కెమెరాల నిర్వహణను గాలికి వదిలేసింది. దీంతో చాలా వరకు మూలకు చేరాయి. వార్డెన్లు పూర్తిస్థాయిలో లేరు. ఒక్కొక్కరూ రెండు, మూడు వసతి గృహాల బాధ్యతలు చూస్తున్నారు. దీంతో ఏ హాస్టల్‌పై కూడా సరైన దృష్టి పెట్టలేకపోతున్నారు. మెనూ సక్రమంగా అమలు చేయకపోయినా అడిగే నాథుడు కనిపించడం లేదు. ఇటీవల ఓ ఆశ్రమ పాఠశాలలో సిబ్బంది మధ్య తగాదాలు జరిగాయి. ఈ పంచాయితీ సీతంపేట పీవో వద్దకు చేరింది. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. కొంతమంది అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.
అంతా ఇష్టారాజ్యం
వైసీపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా జిల్లా పునర్విభజన చేసింది. పాలకొండ నియోజకవర్గం పరిధిలో ఉన్న సీతంపేట ఐటీడీఏను పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించింది. దీంతో పీవో పార్వతీపురం మన్యం జిల్లాకే పరిమితం కాగా.. ఇక్కడ ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్నారు. గతంలో మండలస్థాయి అధికారులు ప్రతి నెల కొన్ని ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసి అక్కడి సమస్యలపై పీవోకు నివేదిక ఇచ్చేవారు. గత రెండేళ్ల నుంచి ఎటువంటి తనిఖీలు జరగడం లేదు. సీతంపేట, మెళియాపుట్టిలో ఏటీడబ్ల్యూవో పోస్టులు ఖాళీగా ఉండడంతో గిరిజన పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఇన్‌చార్జిలను నియమించినప్పటికీ వారు పట్టించుకోవడం లేదు. అలాగే జిల్లా విభజన తరువాత సీతంపేట ఐటీడీఏకు చెందిన అధికారులంతా పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఇక్కడి వసతి గృహాలు, పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది. వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల వార్డెన్ పోస్టుల కోసం తగాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బోధన, మెనూ సక్రమంగా అమలుచేయకపోయినా విద్యార్థులు చెప్పుకోలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వసతిగృహాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.