Share News

బస్సు ఎక్కాలంటే పాట్లే!

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:53 PM

Ichchapuram RTC complex, far from the village ఇచ్ఛాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాలో ఏర్పడిన రెండో కాంప్లెక్స్‌ ఇది. కానీ అధికారుల అనాలోచిత నిర్ణయాలు ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇచ్ఛాపురం పట్టణానికి దూరంగా కాంప్లెక్స్‌ ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

బస్సు ఎక్కాలంటే పాట్లే!
అధ్వానంగా ఇచ్ఛాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌

ఊరికి దూరంగా ఇచ్ఛాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌

పాత బస్టాండ్‌లో ఆగని వైనం

కానరాని వసతులు

ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు

ఇచ్ఛాపురం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాలో ఏర్పడిన రెండో కాంప్లెక్స్‌ ఇది. కానీ అధికారుల అనాలోచిత నిర్ణయాలు ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇచ్ఛాపురం పట్టణానికి దూరంగా కాంప్లెక్స్‌ ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ కాంప్లెక్స్‌ ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఖాళీ స్థలాలను అభివృద్ధి చేయాలని ఆర్టీసీ ఆలోచించింది. కానీ ప్రయాణికులకు సదుపాయాలు మాత్రం మెరుగుపరచలేదు. కాంప్లెక్స్‌ ఆవరణను లీజుకివ్వడంతో అక్కడ కళ్యాణ మండపం నిర్మించారు. మిగిలిన ప్రాంతంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేశారు. కానీ ప్రయాణికులకు సంబంధించి వసతులు మెరుగుపరచలేదు. ఉన్నవాటిని తొలగించి పలాసకు తరలించారు. ఏ బస్సు ఎప్పుడు వస్తుందో చెప్పే కంట్రోలర్‌తోపాటు అక్కడుండే కుర్చీలను సైతం పలాసకు తీసుకెళ్లారు. దీంతో బస్సుల రాకపోకలు, వాటి సమయాలు చెప్పేవారు కరువయ్యారు.

వేకువజాము నుంచి బస్సుల తాకిడి..

రవాణాపరంగా సరిహద్దున ఉన్న ఒడిశా సైతం ఇచ్ఛాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌పై ఆధారపడుతోంది. ఇక్కడ నుంచి 56 అంతర్‌జిల్లా సర్వీసులు నడుస్తున్నాయి. తెల్లవారుజామున 3.45 గంటలకు ప్రారంభమై.. రాత్రి 9 గంటల వరకూ బస్సులు తిరుగుతూనే ఉంటాయి. రావులపాలెం, రాజమండ్రి, రామచంద్రాపురం, రాజోలు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలకు సర్వీసులు నడుస్తుంటాయి. కానీ ఇంతటి ప్రాధాన్యం కలిగిన కాంప్లెక్స్‌లో బస్సుల రాకపోకల వివరాలు చెప్పేవారు లేరు. కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు అవసరమయ్యే నీరు, ఇతరత్రా వస్తువులు కొనుగోలు చేసేందుకు వీలుగా చిన్నపాటి దుకాణాలు కూడా ఏర్పాటు చేయలేదు. విద్యుత్‌ దీపాలు లేవు. మరుగుదొడ్లు ఉన్నా వినియోగానికి పనికిరావు. ఇతర డిపోలకు చెందిన దాదాపు పదుల సంఖ్యలో సర్వీసులకు నైట్‌హాల్ట్‌ ఇక్కడే. కాంప్లెక్స్‌ మేడపై విశ్రాంతి గది నిర్మించారు. కానీ సదుపాయలు కల్పించడం మరచిపోయారు.

కిలోమీటరు నడవాల్సిందే..

ఇచ్ఛాపురం పట్టణానికి దూరంగా ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లాలంటే కిలోమీటరు ఆపసోపాలు పడాల్సిందే. గతంలో పాత బస్టాండ్‌కు వచ్చి ఆర్టీసీ బస్సులను నిలుపుదల చేసేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. బస్సెక్కాలంటే ప్రయాణికులు కాంప్లెక్స్‌కు రావాల్సిందే. ప్రతిరోజూ ఇచ్ఛాపురం మీదుగా 3 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ బస్సులు పాత బస్టాండ్‌కు రాకపోవడంతో ప్రైవేటు ట్రావెల్‌ బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. పైగా ఎస్‌.కోట, అనకాపల్లి, రాజాం, పాలకొండ, పార్వతీపురం, బరంపూర్‌ వంటి రూట్లలో ఆర్టీసీ సర్వీసులు లేవు. కానీ పదుల సంఖ్యలో ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో తెస్తే తమ వెతలు తీరడమే కాదు ఆర్టీసీకి ఆదాయం మెరుగయ్యే అవకాశం ఉందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

దృష్టి సారించాం

ఇచ్ఛాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతాం. పాతబస్టాండ్‌లో బస్సులు ఆగేలా ఆదేశాలు ఇస్తాం. మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవసరమైన రూట్లలో సర్వీసులను సైతం తిప్పుతాం.

- ఎస్‌వీవీ నాయకుడు, డిపో మేనేజర్‌, పలాస

ప్రయోజనం లేదు..

పేరుకే పెద్ద ఆర్టీసీ కాంప్లెక్స్‌. కానీ జనాలకు ఎంతమాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. కాంప్లెక్స్‌లో ఏ బస్సు ఎప్పుడు ఎక్కడకు వెళుతుంది? అన్న వివరాలు కూడా చెప్పేవారు లేరు. వాటర్‌ బాటిల్‌ కొందామన్నా దుకాణం లేదు. ఇప్పటికైనా ఆర్టీసీ యంత్రాంగం దృష్టి పెట్టాలి.

- కొరికాన యోగి, ప్రయాణికుడు, ఇచ్ఛాపురం

ఇక్కడే సర్వీసులు మొదలైనా..

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది మా పరిస్థితి. అంతర్‌ జిల్లా సర్వీసులు ఇచ్ఛాపురం నుంచే ప్రారంభమవుతాయి. కానీ పట్టణంలో ఆర్టీసీ బస్సు ఎక్కడానికి వీలు లేకుండా పోతోంది. పట్టణానికి కిలోమీటరు దూరంలో ఉన్న కాంప్లెక్స్‌కు వెళ్లాలంటే యాతన తప్పడం లేదు. పాత బస్టాండ్‌లో బస్సులు ఆగేలా చర్యలు చేపట్టాలి.

కాళ్ల నరసింహమూర్తి, ప్రయాణికుడు, ఇచ్ఛాపురం

Updated Date - Nov 17 , 2025 | 11:53 PM