Share News

urea problems: యూరియా కోసం పాట్లు

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:20 AM

Farmers' concern over lack of fertilizer జిల్లాలో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఖరీఫ్‌లో లక్షలాది ఎకరాల్లో వరిసాగు చేపడుతుండగా.. ఎరువులు సక్రమంగా అందక ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో ఎరువులు అందించాలని డిమాండ్‌ చేశారు.

urea problems: యూరియా కోసం పాట్లు
జి.సిగడాంలో ప్రైవేటు దుకాణం వద్ద యూరియా కోసం రైతుల నిరీక్షణ

  • ఎరువులు సక్రమంగా అందక రైతుల ఆందోళన

  • ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు

  • జిల్లావ్యాప్తంగా అధికారుల తనిఖీలు

  • టెక్కలి/ జి.సిగడాం/ కాశీబుగ్గ/ గార రూరల్‌/ శ్రీకాకుళం రూరల్‌/ రణస్థలం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఖరీఫ్‌లో లక్షలాది ఎకరాల్లో వరిసాగు చేపడుతుండగా.. ఎరువులు సక్రమంగా అందక ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో ఎరువులు అందించాలని డిమాండ్‌ చేశారు. శనివారం వివిధ గ్రామాల నుంచి టెక్కలి చేరుకున్న రైతులు ఎరువుల దుకాణాల యజమానుల తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. కొంతమంది వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను సబ్‌కలెక్టరేట్‌ కార్యాలయంలో ఆర్డీవో కృష్ణమూర్తికి వివరించారు. దీంతో ఆర్డీవోతోపాటు వ్యవసాయశాఖ ఏడీ జగన్‌మోహనరావు, వ్యవసాయశాఖ అధికారులు ఎరువులు దుకాణాల వద్దకు చేరుకుని విక్రయాలపై ఆరా తీశారు. అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఐ విజయ్‌ కుమార్‌తో పాటు సిబ్బంది అక్కడకు చేరుకొని బందోబస్తు నిర్వహించారు. శనివారం సాయంత్రం వరకు రైతులకు ఎరువులను అందజేశారు.

  • జి.సిగడాంలో కూడా రైతులు ఎరువుల కోసం ప్రైవేటు దుకాణం వద్ద బారులుదీరారు. ఇటీవల సచివాలయంలో పాస్‌పుస్తకానికి ఒక యూరియా బస్తా ఇచ్చారని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు సచివాలయాలకు యూరియా రావడం లేదని, ప్రైవేటు దుకాణాల వద్ద గంటలకొద్దీ నిరీక్షించినా యూరియా దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు. రాజాంలో ప్రైవేటు దుకాణాల వద్ద కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని పెంట, నాగులవలస, సీతంపేట తదితర గ్రామాల రైతులు వాపోయారు.

  • అధికారుల ఆకస్మిక తనిఖీలు

  • జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎరువుల దుకాణాలను అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. శనివారం కాశీబుగ్గలో ఓ ఎరువుల దుకాణాన్ని పలాస ఆర్డీవో జి.వెంకటేష్‌, కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు, జిల్లా సివిల్‌ సప్లై మేనేజర్‌ వేణుగోపాలలరావు, పలాస వ్యవ సాయశాఖ ఏడీఏ ఎం.రామారావు తనిఖీ చేశారు. గోదాములో ఉన్న ఎరువులు, రికార్డులను పరిశీలించారు. ఆర్డీవో జి.వెంకటేష్‌ మాట్లాడుతూ.. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. నానో యూరియూపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

  • శ్రీకూర్మంలో ఎరువుల దుకాణాలను విజిలెన్స్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ డీవీవీ సతీష్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయలక్ష్మి ట్రేడర్స్‌లో ప్రస్తుతం ఉన్న నిల్వలకు ఈ-పాస్‌ యంత్రంలో ఉన్న నిల్వకు తేడా ఉన్నట్టు గుర్తించారు. 118 డీఏపీ, 235 పొటాష్‌, 105 సూక్ష్మ పోషక ఎరువులు, 64 అన్నదాత ఎరువుల బస్తాలను సీజ్‌ చేసి అమ్మకాలను నిలుపుదల చేశారు. ప్రభు త్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే అమ్మకాలు చేపట్టాలని, కృత్రిమ కొరత సృష్టించవద్దన్నారు.

  • శ్రీకాకుళం మండలం కిల్లిపాలెంలో ఎరువుల దుకాణాలు, శ్రీకాకుళంలో గ్రోమోర్‌, తండేంవలసలో ఆదిత్య ఎరువుల షాపులను విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. నిల్వలను పరిశీలించారు. తనిఖీల్లో విజిలెన్స్‌ సీఐ డీవీవీ సతీష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఎర్రన్నాయుడు, వ్యవసాయాధికారి పి.నవీన్‌ పాల్గొన్నారు.

  • పరిశ్రమల్లోనూ సోదాలు

  • పరిశ్రమల్లో ముడి సరుకుగా వినియోగిస్తున్న యూరియా ఎక్కడి నుంచి దిగుమతి అవుతుందనే అంశంపై అధికారులు శనివారం రణస్థలం మండలంలోని పలు పరిశ్రమల్లో తనిఖీ చేపట్టారు. వనం ప్లైఉడ్‌ ఇండస్ట్రీస్‌, త్రిమూర్తి ప్యానెల్‌ ప్రాడక్ట్స్‌, బంటుపల్లి యూబీ పరిశ్రమల్లో తనిఖీ చేశారు. జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్డీవో సాయిప్రత్యూష, డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద, తహసీల్దార్‌ ఎస్‌.కిరణ్‌కుమార్‌, సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి, వ్యవ సాయాధికారులు పరిశ్రమలను సందర్శించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Aug 24 , 2025 | 12:20 AM