‘ఓపి’క ఉండాల్సిందే
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:36 AM
patients problems in rims పేద లకు ఏ అనారోగ్యం వచ్చినా సరే శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)నే ఆశ్రయిస్తుంటారు. ఈ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ముందుగా ఓపీలో రిజిస్ట్రేషన్ చేయించుకుని, చీటీ తీసుకుంటేనే చికిత్సకు అనుమతి ఉంటుంది. అయితే రోగులకు ఇక్కడే అసలైన ఇబ్బంది ఎదురవుతోంది.
రిమ్స్‌లో ఓపీ కోసం తిప్పలు
క్యూలో వందలాది రోగులు
గంటలకొద్దీ నిరీక్షణతో అవస్థలు
కూర్చునేందుకు కూడా సౌకర్యం లేని దుస్థితి
పట్టించుకోని ఆసుపత్రి అధికారులు
శ్రీకాకుళం రిమ్స్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పేద లకు ఏ అనారోగ్యం వచ్చినా సరే శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)నే ఆశ్రయిస్తుంటారు. ఈ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ముందుగా ఓపీలో రిజిస్ట్రేషన్ చేయించుకుని, చీటీ తీసుకుంటేనే చికిత్సకు అనుమతి ఉంటుంది. అయితే రోగులకు ఇక్కడే అసలైన ఇబ్బంది ఎదురవుతోంది. తొలుత రోగికి సంబంధించిన ఆధార్‌కార్డు, ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకువెళితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. సంబంధిత రోగి ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నెంబర్ ఆధారంగా ఆబా చేస్తారు. అప్పుడు ఆ రోజుకు సంబంధించి సీరియల్ నెంబర్ వస్తుంది. ఈ సీరియల్ నెంబర్‌ను అనుసరించి ఓపీ కౌంటర్‌లో రోగి ఏ అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చారో తెలుసుకుని వివరాలు నమోదు చేస్తారు. అనంతరం వారికి సంబంధిత విభాగానికి చెందిన ఓపీ టిక్కెట్‌ను ఇస్తారు. అయితే నెట్‌వర్క్ సరిగా లేకపోయినా, కంప్యూటర్‌లో ఆధార్ కార్డు నెంబరు ద్వారా వచ్చిన వివరాలు సరిపోలకపోయినా ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో ఓపీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. ఇందుకు సంబంధించి గతంలో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి అధికారులు ట్రైనీ నర్సింగ్ సిబ్బందితో తొలుత ఆధార్ నెంబర్ రిజిస్ట్రేషన్, రోగి అనారోగ్యం తదితర వివరాలను సేకరించేలా ఏర్పాటు చేశారు. దీంతో ఓపీ నమోదు ప్రక్రియ వేగవంతంగా జరిగేది. కానీ సోమవారం నాడు సర్వజన ఆసుపత్రిలో అటువంటి దాఖలాలు కనిపించలేదు. వందలాదిగా రోగులు క్యూలైన్లలో ఓపీ చీటీల కోసం గంటలపాటు వేచి ఉన్నారు. వారు కూర్చొనేందుకు ఎటువంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారు. ఎక్కడా ఆసుపత్రి అధికారుల జాడ కూడా కనిపించలేదు. గంటలకొద్దీ నిరీక్షించే ఓపిక లేక కొంతమంది రోగులు వెనక్కి వెళ్లిపోయారు. తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా ఉన్నతాధికారులు, నాయకులు ఎన్నిసార్లు ఆసుపత్రి సందర్శనకు వచ్చినా, అధికారులను మందలించినా సరే పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం. ఓపీలో నమోదు చేయించుకోవడానికే తిప్పలు పడాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఓపీ ప్రక్రియ నమోదయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతోంది. ఆ సమయానికి వైద్యులు భోజనానికి వెళ్లిపోతారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఓపీ చూస్తారు. దీంతో అంతవరకూ తాము నిరీక్షించాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందోనని నిట్టూర్చుతున్నారు.