రైల్వేస్టేషన్లలో సమస్యల కూత
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:43 PM
'Amrit Bharat' development works slowley జిల్లాలో అమృత్‌భారత్ పథకం కింద పలు రైల్వేస్టేషన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తికావడం లేదు. తాగేందుకు నీరు ఉండదు. విశ్రాంతి తీసుకుందామంటే గదులు ఉండవు. కొన్నిచోట్ల ప్లాట్‌ఫాంలపై పైకప్పులు లేవు.
నత్తనడకన ‘అమృత్‌భారత్’ అభివృద్ధి పనులు
అరకొరగా సౌకర్యాలు
ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
పలాస/ ఇచ్ఛాపురం/నరసన్నపేట/జలుమూరు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో అమృత్‌భారత్ పథకం కింద పలు రైల్వేస్టేషన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తికావడం లేదు. తాగేందుకు నీరు ఉండదు. విశ్రాంతి తీసుకుందామంటే గదులు ఉండవు. కొన్నిచోట్ల ప్లాట్‌ఫాంలపై పైకప్పులు లేవు. మరుగుదొడ్లకు నిత్యం తాళాలు వేసి ఉంటాయి. అత్యవసర వేళ ప్రయాణికులు ఆరుబయటకు పరుగెత్తాల్సిన పరిస్థితి. కొత్త పనుల పేరిట పాత విశ్రాంతి భవనాలు, మరుగుదొడ్లు కూల్చేసిన అధికారులు వాటి స్థానంలో తాత్కాలిక ఏర్పాట్లు చేయలేదు. అరకొర సదుపాయాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
పలాస రైల్వేస్టేషన్‌లో వసతుల్లేవ్
అమృత్‌భారత్ పథకం కింద పలాస రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసేందుకు రెండున్నరేళ్ల కిందట రూ.24.5 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అయితే, ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రైల్వేస్టేషన్‌లోని రెండు ప్లాట్‌ఫాంలకు గ్రానైట్ ఫ్లోరింగ్, షెల్టర్లు వేస్తున్నారు. ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఆదాయం వచ్చే షాపులను ఏర్పాటు చేశారే తప్ప ప్రయాణికులకు అవసరమయ్యే వసతులను మాత్రం రైల్వే అధికారులు మరిచిపోయారు. ఒకటో నెంబరు ప్లాట్‌ఫాంను టిక్కెట్ కౌంటర్ కార్యాలయానికి మార్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నా ఇంకా పనులు చేపట్టడం లేదు. కొత్త ఫుట్‌పాత్‌బ్రిడ్జి నిర్మాణం, కొత్త ప్లాట్‌ఫాం ఏర్పాటు, స్టేషన్‌ను ఆధునికీకరించడం వంటి పనుల్లో పురోగతి లేదు. కేవలం స్టేషన్‌కు ముందు భాగంలో అరకొరగా పనులు చేపట్టారు. మొత్తం పనులు పూర్తి కావాలంటే కనీసం మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వ పాలనలో వాటిని పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇచ్ఛాపురంలోనూ అదే దుస్థితి
ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో కూడా అమృత్‌భారత్ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొత్తవి నిర్మాణం కోసం స్టేషన్‌లో ఉన్న మరుగుదొడ్లు, విశ్రాంతి భవనాన్ని అధికారులు కూల్చేశారు. వాటి స్థానంలో తాత్కాలిక ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టిక్కెట్ కౌంటర్ వద్ద కుర్చీలు లేవు. రైల్వే ఎంక్వైరీ గది స్టేషన్ లోపల ఉండడంతో రైలు సమాచారం తెలుసుకొనేందుకు ప్రయాణికులు ప్లాట్‌ఫాం టికెట్ కొనుగోలు చేసి స్టేషన్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. స్టేషన్‌లో ర్యాంపులు లేకపోవడంతో దివ్యాంగులను వారి కుటుంబ సభ్యులు మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైళ్ల సమాచారాన్ని తెలుసుకునేందుకు డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా ఇంకా వినియోగంలోకి రాలేదు. ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాంలో చల్లని నీరు తాగేందుకు ఫ్రిజ్‌లు ఏర్పాటు చేశారు. అక్కడ గ్లాస్ కూడా ఉంచకపోవటంతో చేతులతోనే ప్రయాణికులు నీరు తాగుతున్నారు. రెండో ప్లాట్‌ఫాంలో ఉన్న ఫ్రిజ్‌లు మూలకు చేరాయి. ఇక్కడ ఉన్న మరుగుదొడ్డికి నిత్యం తాళం వేసి ఉంటుంది. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 23న ఖుర్ధా డివిజన్ ఏసీఎం అవిక్ కుమార్ గైన్ ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లు, రైల్వే సిబ్బందికి సూచించారు.
తిలారు, ఉర్లాంలో..
నరసన్నపేట నియోజకవర్గం పరిఽధిలో తిలారు, ఉర్లాం రైల్వేస్టేషన్లు ఉన్నాయి. నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పాతపట్నం మండలాలకు చెందిన ప్రజలు ఎక్కువగా తిలారు రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఉర్లాం స్టేషన్ నుంచి నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ వంటి పట్టణాలకు, ఇటువైపు పలాస, ఇచ్ఛాపురం, పూరి వరకు ప్రయాణాలు చేస్తుంటారు. తిలారు రైల్వే స్టేషన్‌లో ఇటీవల టిక్కెట్ బుకింగ్ గదులను నూతనంగా నిర్మించారు. ప్లాట్‌ఫాంపైన కొంత భాగం మాత్రమే రేకులు వేశారు. దీంతో వర్షానికి, ఎండకు ప్రయాణికులు చెట్ల కింద నిరీక్షించాల్సి వస్తుంది. కుళాయిలు, మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేదు. మరగుదొడ్ల గదులకు తాళాలు వేసి ఉంటాయి. ఈ స్టేషన్‌లో విశాఖ డీఎంయూ, విశాఖ, పూరి- తిరుపతి, గుణుపుపూర్ ఎక్స్‌ప్రెస్, ఈఎంయూ, ఇంటర్ సిటీ మాత్రమే ఆగుతాయి. బరంపురం - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, ప్రశాంతి తదితర ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్ట్ సర్వీసులకు హాల్ట్ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఉర్లాం రైల్వేస్టేషన్‌లో పాసింజర్ రైళ్లు, గుణుపూర్ ఎక్స్‌ప్రెస్‌కు మాత్రమే హాల్ట్ ఉంది. ఇక్కడ ప్లాట్‌ఫాం అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడే ఎగుడుదిగుడుగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లు లేక అత్యవసర వేళ ప్రయా ణికులు బయటకు పరుగులు తీయాల్సి వస్తుంది. కనీసం క్యాంటీన్ సదుపాయం కూడా లేదు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.