గిరిజన అభివృద్ధికి ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:00 AM
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా గిరిజనాభివృద్ధికి ఎక్కడా వెనుకడుగు వేయడం లేదని, ఆదివాసీలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నామని వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
- రోడ్లకు రూ.8,400 కోట్లు కేటాయించాం
- మెళియాపుట్టిలోనే ఐటీడీఏ ఏర్పాటు చేస్తాం
- మంత్రి కె.అచ్చెన్నాయుడు
- ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం
పాతపట్నం/మెళియాపుట్టి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా గిరిజనాభివృద్ధికి ఎక్కడా వెనుకడుగు వేయడం లేదని, ఆదివాసీలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నామని వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం పాతపట్నంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్న పాల్గొని మాట్లాడారు. రెండేళ్లలోనే గిరిజన గ్రామాలన్నింటికీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిధులు మంజూరు చేసి పనులు చేపడుతున్నామని అన్నారు. ‘2014-2019 టీడీపీ పాలనలో గిరిజన రోడ్ల నిర్మాణానికి అటవీశాఖా అనుమతులు రాలేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు తీసుకువచ్చాం. గత వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు చేసిందేమీ లేదు. దీనివల్ల మళ్లీ డోలీ మోతలు కనిపించడం బాధకలిగించింది. మా సూచనలు సైతం గత ప్రభుత్వం పట్టంచుకోలేదు. ఐటీడీఏకు వచ్చిన నిధులు సైతం దారిమళ్లించి గిరిజనులకు అన్యాయం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి అంశంగా గిరిజనాభివృద్ధినే తీసుకుంది. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజన రోడ్ల కోసం రూ.8,400 కోట్లు కేటాయించారు. రోడ్లు ఉంటేనే విద్య, వైద్యంతో పాటు మిగతా రంగాల్లో గిరిజనులు అభివృద్ధి చెందుతారు. మొదటి విడతగా వెయ్యి కోట్లతో వెయ్యి కిలోమీటర్లు రోడ్లు వేస్తున్నాం. విద్యుత్ సౌకర్యంలేని గ్రామాలకు రూ.2.50కోట్లు ఖర్చు చేసి వెలుగులు అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతీ గిరిజన గూడకు నెట్‌వర్క్ వచ్చేవిధంగా రూ.4కోట్లతో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు ఏర్పాటు చేశాం. గిరిజనులకు ఉద్యోగాల కల్పనకోసం జీవో నెం.3ను తీసుకువచ్చినప్పటికీ కొన్ని అడ్డంకువల్ల ఇది అమలు కాలేదు. ప్రత్నామ్నాయంగా నూతన జీవోను తీసుకురావడానికి ఆలోచిస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాకు ఐటీడీఏ లేకుండా చేసింది. మందసలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, కాదు మెళియాపుట్టిలో పెడతామని కాలయాపన చేసింది. మేము మాత్రం గిరిజనులు అధికంగా ఉన్న మెళియాపుట్టిలోనే ఐటీడీఏ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఈ అంశం ప్రస్తుతం ఆర్థిక శాఖవద్ద పెండింగ్‌లో ఉంది. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛనులు ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పింఛన్ల పెంపుతోపాటు ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి పథకాలు అమలు చేశామంటే ప్రజలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధం చేసుకోవాలి.’ అని మంత్రి అన్నారు.
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో 163 గిరిజన గ్రామాలకు రహదారి ఇబ్బందులు ఉన్నాయని గుర్తించామన్నారు. నిధులు మంజూరు చేసి రోడ్డు పనులు చేపడుతున్నామని తెలిపారు. నాలుగు వసతి గృహాలతోపాటు 26 నూతన అంగన్‌వాడీ కేంద్రాలను మంజూరు చేసినట్లు చెప్పారు. మెళియాపుట్టిలో ఎంఎస్‌ఎంఈ పార్కు మంజూరు చేశామన్నారు. ఇది ఏర్పాటయితే నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. ఇప్పటి నుంచే స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టి నిరుద్యోగులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. గిరిజనులు పండించే పంటలకు ప్రోసెసింగ్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారని, దీనిపై చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు.
- ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ.. వెనుకబడిన నియోజకవర్గం పాతపట్నం అని, దీని అభివృద్ధికి అందరూ సహకరించి ముందుకు నడిపించాలని కోరారు. నిరుద్యోగ భృతి కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. తలసరి ఆదాయంలో వెనుకబడ్డామని, తమకు ప్రత్యేకనిధులు ఇచ్చి ఆదుకోవాలని విన్నవించారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఉద్దానం ఫేజ్-2 కింద రూ.250కోట్లతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఉద్దానం ఫేజ్-2కు ఎర్రన్నాయుడు ప్రాజెక్ట్‌గా నామకరణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డీడీ అన్నయ్య దొర, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, గిరిజన సంఘ నాయకులు వాబ యోగి, భైరిసిండి లక్ష్మీనారాయణ, చల్లా శాంతారావు, రామారావు, మల్లిపురం భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.