‘జల్‌జీవన్’కు ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:47 PM
Unfinished work due to YCP's negligence కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ‘జల్‌జీవన్ మిషన్’ పనులను గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం చేసిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ఆర్‌డబ్ల్యూఎస్, నేషనల్ హైవే, ఎంపీ లాడ్స్‌కు సంబంధించి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
గతంలో వైసీపీ నిర్లక్ష్యంతో పూర్తికాని పనులు
కోస్టల్ కారిడార్ కోసం సిద్ధమవుతున్న డీపీఆర్
మరో ఆరులైన్ల రహదారి వస్తోంది
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
శ్రీకాకుళం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ‘జల్‌జీవన్ మిషన్’ పనులను గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం చేసిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ఆర్‌డబ్ల్యూఎస్, నేషనల్ హైవే, ఎంపీ లాడ్స్‌కు సంబంధించి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘జలజీవన్ మిషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. జలజీవన్ మిషన్ శక్తి సామర్థ్యాలు తెలియక గతంలో వైసీపీ సర్కారు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసింది. రాష్ట్రంలో జలజీవన్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండగా.. జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతంలో పూర్తికాని, ప్రారంభానికి నోచుకోని కార్యక్రమాలను సీఎం చంద్రబాబునాయుడు పునఃప్రారంభిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి జల్‌జీవన్ పనులు పూర్తిచేస్తాం. ఉద్దానం ప్రాజెక్టును కూడా బలపరుస్తున్నాం. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు స్ఫూర్తితో ఎంపీ ల్యాడ్స్ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాం. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపీ ల్యాడ్స్‌ను వినియోగిస్తూ.. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బస్ కాంప్లెక్స్, ఎలక్ట్రికల్ లైన్లు, సోలార్ లైన్లు, ఇతర ప్రాజెక్టులను నిర్మించామ’ని తెలిపారు.
మరో ఆరులేన్ల జాతీయ రహదారి
‘ఆరులేన్ల జాతీయ రహదారి సాధన కోసం ఇప్పటికే పలు దఫాలు కేంద్ర మంత్రిత్వ శాఖకు పరిస్థితులను వివరించాం. నరసన్నపేట నుంచి పాతపట్నం వరకు జాతీయ రహదారి అభివృద్ధి చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా తగ్గింది. జిల్లాలో కోస్టల్ కారిడార్ ద్వారా తీరానికి ఆనుకుని మరో ఆరులేన్ల జాతీయ రహదారి వస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టమైన కార్యాచరణతో ఉన్నారు. లాజిస్టిక్ కనెక్టివిటీ వల్ల ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. కోస్టల్ కారిడార్‌కు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కోసం విశాఖపట్నంలో కార్యాలయం కూడా ప్రారంభించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తాం. దీనికి అనుసంధానమయ్యే నేషనల్ హైవే అంశాల గురించి సమీక్ష నిర్వహించాం. శ్రీకాకుళం జిల్లా పరిధిలో 180 కిలోమీటర్లకు పైగా ఉన్న జాతీయ రహదారిలో ప్రమాదాలు సంభవించే పలు బ్లాక్‌స్పాట్స్‌లను గుర్తించాం. ప్రమాదాల నివారణకు లైటింగ్ ఏర్పాటుచేసి.. రోడ్డును కూడా బ్యూటిఫికేషన్ చేయాలి. మూలపేట పోర్టు వినియోగంలోకి వస్తే హైవేపై మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశముంది. అందుకు తగ్గట్లుగా జాతీయ రహదారి విస్తరణ కూడా త్వరలో జరుగుతుంద’ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.