సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:03 AM
We will complete 75 percent of the offshore work by June ‘వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామ’ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ పాలనలో జిల్లాలో ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
వైసీపీ పాలనలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు
జూన్ నాటికి ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు 75 శాతం పూర్తిచేస్తాం
రబీలో ఆరుతడి పంటలు సాగుచేయాలి
మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి) : ‘వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామ’ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ పాలనలో జిల్లాలో ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. శనివారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలసి జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా పలు అంశాలపై చర్చించారు. రబీ సీజన్‌లో వరి పంట సాగుకు తగినంత నీరు అందకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని మంత్రి రైతులకు సూచించారు. ‘గత వైసీపీ ప్రభుత్వం వంశధార కుడికాలువపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మినహా ఇతర ప్రాజెక్టులను పట్టించుకోలేదు. జిల్లాలో అన్ని ప్రాజెక్టులకు అవసరమైన నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వంశధార, నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టు నిర్మాణ పనులు, ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే జూన్ నాటికి ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులకు 75 శాతం పూర్తి చేస్తాం. సాంకేతిక సమస్యలున్న నేరేడి బ్యారేజీ మినహా ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో తిరిగి ప్రారంభిస్తున్నాం. నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణకు గడిచిన ప్రభుత్వంలో నిలిచిపోయిన జైకా నిధులను తిరిగి పునరుద్ధరించుకుని పనులు మొదలుపెట్టాం. పూర్వోదయం పథకం కింద రూ.60వేల కోట్లు ప్రాజెక్టుల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాం. అందులో ఉత్తరాంధ్రకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇది మంచి అవకాశమ’ని మంత్రి వెల్లడించారు. వంశధార షట్టర్ల సమస్యపై సీఐడీ అధికారులతో చర్చించామని, అవసరమైన చోట్ల కొత్త షట్టర్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి.. శివారు ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, గౌతు శిరీష, కూన రవికుమార్, వంశధార ప్రాజెక్టు, నారాయణపురం ఆనకట్ట చైర్మన్‌లు అరవల రవీంద్రబాబు, సనపల ఢిల్లీరావు, ఆర్డీవోలు సాయిప్రత్యూష, కృష్ణమూర్తి, వంశధార డిప్యూటీ కలెక్టర్ జయదేవి, ఇరిగేషన్ ఎస్‌ఈ సుధాకర్, ఈఈలు, నీటి సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.