పరిశుభ్రతకు ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:33 AM
Presentation of Swachh Andhra Awards ప్రజా జీవితంలో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు.
చెత్తను సంపదగా మార్చేందుకు కృషి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రజా జీవితంలో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రస్థాయిలో రెండు, జిల్లాస్థాయిలో 46 స్వచ్ఛ అవార్డులు జిల్లాకు దక్కడం గర్వకారణం. జిల్లాలో డిసెంబరు నాటికి 95 శాతం ఇంటింటా చెత్త సేకరణ లక్ష్యంగా నిర్ణయించాం. చెత్తను సంపదగా మార్చేందుకు కృషి చేస్తాం. ప్రతి సచివాలయంలో ఎలకా్ట్రనిక్ వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. పౌరుల నుంచి సేకరించిన కిలో చెత్తకు రూ.10 చెల్లిస్తాం. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలి. వచ్చే ఏడాది నాటికి స్వచ్ఛ అవార్డుల్లో అన్ని శాఖలు పురోగతి సాధించాల’ని తెలిపారు. పరిశుభ్రతపై ప్రతీ సంస్థలోను సుస్థిరమైన సంస్కృతి ఏర్పడాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఇంటి నుంచి ఒక స్వచ్ఛ సేవకుడు తయారుకావాలి. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సాధనకు ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. సీఎం చంద్రబాబు సారథ్యంలో దానిని సాధించే దిశగా అడుగులు వేస్తున్నా’మన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ.. ‘ప్లాస్టిక్ మహమ్మారిపై యుద్ధం చేయాలి. స్వచ్ఛాంధ్రను సాధించాల’ని కోరారు. అవార్డు గ్రహీతలను కలెక్టర్, ప్రజాప్రతినిధులు అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అవార్డు గ్రహీతలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్, ఆర్డీవో సాయిప్రత్యూష, కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.