Share News

smart cards: ఇక స్మార్ట్‌ కార్డులు

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:07 AM

Smart card distribution ప్రభుత్వం దివ్యాంగులకు, రేషన్‌కార్డు లబ్ధిదారులకు స్మార్ట్‌ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం దివ్యాంగులకు సదరం శిబిరంలో వైకల్యం శాతాన్ని తెలిపే ధ్రువపత్రాన్ని కాగితం రూపంలో అందజేస్తున్నారు. ఇది వర్షానికి తడిసినా, చిరిగినా ఇబ్బందే. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి యూడీ(యూనిక్‌ డీసెబిలిటీ) ఐడీ సంఖ్యతో పీవీసీ రూపంలో స్మార్ట్‌ కార్డులు జారీ చేయనుంది.

smart cards: ఇక స్మార్ట్‌ కార్డులు
రేషన్‌ సరుకుల పంపిణీ (ఫైల్‌)

  • - దివ్యాంగులకు, రేషన్‌కార్డు లబ్ధిదారులకు పంపిణీకి సన్నాహాలు

  • హరిపురం/ నరసన్నపేట, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం దివ్యాంగులకు, రేషన్‌కార్డు లబ్ధిదారులకు స్మార్ట్‌ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం దివ్యాంగులకు సదరం శిబిరంలో వైకల్యం శాతాన్ని తెలిపే ధ్రువపత్రాన్ని కాగితం రూపంలో అందజేస్తున్నారు. ఇది వర్షానికి తడిసినా, చిరిగినా ఇబ్బందే. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి యూడీ(యూనిక్‌ డీసెబిలిటీ) ఐడీ సంఖ్యతో పీవీసీ రూపంలో స్మార్ట్‌ కార్డులు జారీ చేయనుంది. అందుకుగాను ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభించింది. ఈ నెల 1 నుంచి దివ్యాంగులు నేరుగా దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. జిల్లాలో సుమారు 56వేల మంది దివ్యాంగులు ఉన్నారు. వీరిలో 31,498 మందికి వికలాంగ పింఛన్లు అందుతున్నాయి. ఎముకలకు సంబంధించిన వ్యాధిగ్రస్థులు 18543 మంది, కంటికి సంబంధించిన వారు 4901 మంది, వినికిడి లోపం ఉన్నవారు 3831 మంది, మానసిక సమస్యలతో ఉన్నవారు 3821 మంది, మూర్చవ్యాధి గ్రస్థులు 245 మందితోపాటు మరో 157 మంది వివిధ రుగ్మతలతో బాధపడుతున్నారు. వీరితోపాటు మరో 22 వేలమందికి సదరం లేదు. దీంతో వీరంతా సదరంతోపాటు యూడీఐడీ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.

  • పొందడం ఇలా...

  • సదరం ధ్రువపత్రం ఉన్నవారు నేరుగా యూడీఐడీ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సదరం ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకునేవారు వికలాంగ సర్టిఫికెట్‌తోపాటు యూడీఐడీ పొందేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

  • హెచ్‌టీటీపీ://డబ్యూడబ్యూడబ్యూ. ఎస్‌డబ్యూఏవిఎల్‌ ఏఎంబీఏఎన్‌సీఏఆర్‌డీ. జీవోవీ.ఐన్‌ పోర్టల్‌ను తెరిచి యూడీఐడీ కార్డు కోసం సమగ్ర వివరాలు పొందుపర్చాలి.

  • మీ సేవ, సీఎస్పీ కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకొని సదరం శిబిరానికి హాజరుకావాలి. అక్కడి వైద్యులు పరీక్షించి వైకల్యాన్ని నిర్ధారిస్తారు. అనంతరం స్మార్ట్‌ కార్డు మంజూరు చేస్తారు. డిజిటల్‌ సంతకాలతో కూడిన ఈ కార్డుల్లో ఐడీ నెంబరు, దివ్యాంగుడి పేరు, వైకల్యం రకం, శాతం తదితర వివరాలు ఉంటాయి. వీటిని తపాలా శాఖ ద్వారా దివ్యాంగుడి చిరునామాకు నేరుగా పంపుతారు.

  • ఇవీ ప్రయోజనాలు..

  • దివ్యాంగులు స్మార్ట్‌ కార్డులతో రైలు, బస్సు టికెట్లుపై రాయితీ పొందవచ్చు. పింఛన్లు, సంక్షేమ పథకాలు, రాయితీ రుణాలు అందుకునే వెసులుబాటు ఉంది. దేశంలో ఎక్కడనుంచైనా ఈ కార్డులు ఉపయోగించుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఈ అవకాశం తమపాలిట వరంగా మారనుంది దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • ఎండీయూ వాహనాల వద్దే ఈకేవైసీ

  • రేషన్‌ కార్డుల స్థానంలో లబ్ధిదారులకు ఏటీఎం కార్డు సైజు మాదిరి స్మార్ట్‌ కార్డులు ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రేషన్‌ సరుకులు పక్కదారి పడుతున్న నేపథ్యంలో బార్‌ కోడ్‌తో ఈ కార్డులను సిద్ధం చేస్తోంది. మే నెల నుంచి వీటిని పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇటీవల ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 6,71,803 రేషన్‌కార్డులు ఉండగా 19,39,082 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఇప్పటి వరకు 18 లక్షలు మంది ఈకేవైసీ చేయించుకోగా మరో లక్షమంది చేయించుకోవాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని రేషన్‌ డీలర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. ఎండీయూ వాహనాలు వద్దే ఈకేవైసీ ప్రక్రియ పూర్తిచేసేలా అవకాశం కల్పించింది. ఈ పక్రియ ముగిసిన వెంటనే ప్రభుత్వం కార్డుల్లో చేర్పులు, మార్పులతోపాటు తొలగింపులకు ఆప్షన్లు ఇవ్వనుంది. ఆ తర్వాత కార్డుదారులకు స్మార్ట్‌ కార్డులను అందజేయనుంది. ఈ కార్డుల్లో కుటుంబ సభ్యుల అందరి ఫొటోలు ఉంటాయి. పూర్తి చిరునామా ఉంటుంది. ప్రస్తుతం అన్నింటికీ రేషన్‌కార్డు ప్రామాణికం కావడంతో.. వీటిని జేబులో పెట్టుకునేందుకు ఈజీగా ఉంటుంది.

Updated Date - Apr 07 , 2025 | 12:07 AM