Road Accident: మానవత్వం మరిచి..
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:07 AM
pregnant woman death శ్రీకా కుళంలోని డేఅండ్‌నైట్ జంక్షన్ సమీపంలో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొని ఓ గర్భిణీ మృతి చెందింది. ఎచ్చెర్ల మండలం కుంచాలకురమయ్యపేట చెందిన వెంపాడ దుర్గారావుకు అదే గ్రామానికి చెందిన రాజేశ్వరితో కొన్నేళ్ల కిందట వివాహమైంది.

నిండు గర్భిణిని ఢీకొట్టి.. ఆపకుండానే వెళ్లి..
వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కాలు మీద టైరు వెళ్లడంతో తీవ్ర రక్తస్రావం
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి, శిశువు మృతి
సీసీ ఫుటీజీతో బస్సును గుర్తించిన పోలీసులు
డ్రైవరుకు మద్దతుగా స్టేషన్‌కు ఆర్టీసీ సిబ్బంది
పోలీసులు, బాధిత కుటుంబీకులు సీరియస్
ఆమె నిండు గర్భిణి. వారంలో ప్రసవిస్తుంది. భర్తతో బైక్ మీద వెళ్తోంది. పుట్టబోయే బిడ్డపై వారికి ఎన్నో ఆశలు.. కలలు. ఓ ఆర్టీసీ డ్రైవరు వారి కలలను ఛిద్రం చేశాడు. రెండు ప్రాణాలను బలిగొన్నాడు. ఢీకొట్టిందే కాక.. బస్సును ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. దీంతో గర్భిణి కాలుపై వెనుక టైరు వెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె విలవిల్లాడింది. పక్కన పడిపోయిన భర్త.. సాయం కోసం అటుగా వెళ్తున్న వాహనాలు ఆపే యత్నం చేశాడు. ఎవరూ స్పందించలేదు. అయితే ఓ ఆటోడ్రైవర్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో వారంలో బాహ్య ప్రపంచం చూడాల్సిన గర్భస్థ శిశువు కూడా చనిపోయింది.
శ్రీకాకుళం క్రెం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): శ్రీకా కుళంలోని డేఅండ్‌నైట్ జంక్షన్ సమీపంలో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొని ఓ గర్భిణీ మృతి చెందింది. ఎచ్చెర్ల మండలం కుంచాలకురమయ్యపేట చెందిన వెంపాడ దుర్గారావుకు అదే గ్రామానికి చెందిన రాజేశ్వరితో కొన్నేళ్ల కిందట వివాహమైంది. దుర్గారావు టిఫిన్ అమ్ముతూ, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు ఏడాది పాప ఉంది. ప్రస్తుతం రాజేశ్వరి తొమ్మిది నెలల గర్భిణి. ఆరోగ్య పరీక్షల్లో భాగంగా సోమవారం ఉదయం 9.30 గంటలకు దుర్గారావు తన స్కూటీపై భార్య రాజేశ్వరిని రిమ్స్‌కు తీసుకెళ్లాడు. మరో వారం రోజుల్లో ప్రసవించనుందని వైద్యులు చెప్పారు. దీంతో వారు ఎంతో ఆనందంతో.. ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 11.50గంటలకు డేఅండ్ నైట్ జంక్షన్ సమీపంలో కొత్త వంతెన వద్ద వెనుక నుంచి ఒక ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని ఢీకొంది. దుర్గారావుపై స్కూటీ పడిపోయింది. రాజేశ్వరి రోడ్డుమీద పడిపోగా.. బస్సు వెనుక చక్రం ఆమె తొడపై భాగం నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కాలు విరిగి తీవ్ర రక్తసావ్రమైంది. ప్రమాదానికి కారణమైన బస్సు ఆపకుండా వెళ్లిపోయారు.
ఆటోడ్రైవర్ మానవత్వం
తీవ్ర రక్తస్రావంలో ఉన్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు దుర్గారావు ఎన్ని వాహనాలను ఆపినా.. ఫలితం లేకపోయింది. ఎవరూ వాహనాలు ఆపలేదు. చివరికి ఒక ఆటోడ్రైవర్ ఆ గర్భిణీని మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.30 గంటలకు మృతి చెందింది. కనీసం బిడ్డను అయినా కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించగా.. తీవ్ర రక్తస్రావం కావడంతో ఫలితం లేకపోయింది. తల్లీ,కడుపులో బిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
సీసీ కెమెరాలు ఆధారంగా...
ఈ ఘటనపై దుర్గారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందని తెలియడంతో ట్రాఫిక్ ఎస్‌ఐ మెట్ట సుధ, సీఐ నాగరాజు ఆర్టీసీ డిపోకు వెళ్లి డీఎమ్‌తో మాట్లాడారు. ఆ సమయంలో అటుగా వెళ్లిన బస్సుల వివరాలు సేకరించారు. బ్రిడ్జి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన బస్సును కనుగొన్నారు. ఆ బస్సు డ్రైవర్ నీలాపు హరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నాగరాజు తెలిపారు.
బుకాయించేందుకు యత్నం
మృతురాలి భర్త దుర్గారావు సోమవారం రాత్రి 7.30గంటల సమయంలో ట్రాఫిక్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుండగా ఆర్టీసీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ సుధతో మంతనాలు చేసేందుకు యత్నించారు. దీంతో ఎస్‌ఐ సుధ వారిని హెచ్చరించారు. మానవత్వం మరిచి ఓ నిండు గర్భిని మీద నుంచి బస్సును ఎక్కించి ఆమెతో పాటు కడుపులో ఉన్న బిడ్డ చావుకు కారణమై.. ఇప్పుడు మంతనాలు చేస్తారా? అని వారిని మందలించారు. బస్సులో మహిళ కండక్టర్ ఉన్నా.. సాటి ఆడదాని కష్టం కనిపించలేదా అని ప్రశ్నించారు. మానవత్వం మరిచి బస్సుతో పరారై ఇంతవరకు స్టేషన్‌కు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు అసలు ప్రమాదం మా బస్సు వల్లే జరిగిందని ఎలా చెబుతారంటూ ఎదురుతిరగడంతో పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. దీంతో బస్సుడ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తవం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.