సంక్రాంతికి గుంతల్లేని రోడ్లు
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:20 PM
road works devolopment రాష్ట్రంలో ప్రమాదాల నివారణే లక్ష్యంగా గోతులు లేని రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. సంక్రాంతి పండుగ నాటికి జిల్లాలో రహదారులన్నీ గుంతలు లేని రోడ్లుగా మార్చాలి. మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాల’ని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి
ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆదేశం
శ్రీకాకుళం కలెక్టరేట్/ పొందూరు, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ప్రమాదాల నివారణే లక్ష్యంగా గోతులు లేని రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. సంక్రాంతి పండుగ నాటికి జిల్లాలో రహదారులన్నీ గుంతలు లేని రోడ్లుగా మార్చాలి. మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాల’ని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి ఆయన ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు మాట్లాడుతూ ‘జిల్లాలో రూ.82కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి ఆదేశానుసారం నాణ్యతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పనులు పూర్తి చేయాలి. ముఖ్యంగా నీరు నిలిచే సమస్య ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ వహించి పనులు చేపట్టాలి. నాణ్యతను పరిశీలించిన తరువాతే బిల్లులు మంజూరు చేస్తామ’ని తెలిపారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణాన్ని, పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అలాగే చిలకపాలెం-రాజాం రాష్ట్ర రహదారిని పరిశీలించారు. మరమ్మతులకు నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ మార్గంలో తక్షణం గోతులను పూడ్చాలని ఆదేశించారు. ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రతిపాదనలున్నాయని తెలిపారు. రోడ్లపై గోతులు కనిపించకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ అడ్మిన్ వి.రామచంద్ర, ఎస్‌ఈ పి.సత్యనారాయణ, ఈఈ తిరుపతి రావు, డీఈ గణపతిరావు, ఏఈ పీటీ రాజు పాల్గొన్నారు.