PORT: పోర్టు పనులకు.. లైన్‌క్లియర్
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:04 AM
Port operations మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు సంబంధించి రోడ్డు, రైల్వే అనుసంధానం ప్రక్రియ కొలిక్కి వచ్చిందని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

రోడ్డు, రైల్వే అనుసంధానానికి మార్గం సుగమం
విష్ణుచక్రం నిర్వాసితులకు క్లస్టర్ రూపేణా లాటరీ ద్వారా ఎంపిక
టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి
టెక్కలి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు సంబంధించి రోడ్డు, రైల్వే అనుసంధానం ప్రక్రియ కొలిక్కి వచ్చిందని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ‘పోర్టు రహదారికి సంబంధించి 228 ఎకరాల జిరాయతీకిగాను ఇప్పటికే ఇజ్జువరం, వేములాడవిశ్వనాథపురం, తలగాం, బన్నువాడ గ్రామాలకు చెందిన భూములకు ల్యాండ్ ఎక్విజేషన్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం 18ఎకరాల ల్యాండ్ ఎక్విజేషన్ ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. అందులో తొమ్మిది ఎకరాలు దేవాదాయశాఖవి. కస్పానౌపడాకు చెందిన 4.77 ఎకరాలు, రఘునాథపురానికి చెందిన ఎకరా, మోదుగువలసకు చెందిన 53సెంట్లు, రాజపురానికి చెందిన పదిసెంట్లు, పాతనౌపడాకు చెందిన ఎకరా 9సెంట్ల భూమి పెండింగ్‌లో ఉంది. రైల్వే అనుసంధానానికి సంబంధించి 72ఎకరాలకుగాను పోతునాయుడుపేట, యామాలపేట, రాజపురం, కాశీపురం, కోటపాడు, కూర్మనాథపురం గ్రామాలకు చెందిన 251మంది రైతులకు రూ.19కోట్లు చెల్లించాం. కూర్మనాఽథపురంలో ముగ్గురు రైతులకు చెందిన ఎకరన్నర భూమికి పరిహారం చెల్లించాల్సి ఉంది. మూలపేట పంచాయతీ విష్ణుచక్రం గ్రామానికి చెందిన 80మంది పీడీఎఫ్‌లకు మొదటివిడత పునరావాస కాలనీలో ఇళ్ల కేటాయింపులకు బీసీ, ఎస్సీల వారీగా 28 క్లస్టర్లు ఏర్పాటు చేశాం. లాటరీ ద్వారా ఎంపికకు సిద్ధం చేశాం. నిర్వాసితుల కాలనీ ప్రాంతంలో 598 పీడీఎఫ్‌లకు సంబంధించి రూ.2.90కోట్లతో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తాం. ఆయా ప్రాంతాల్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో రూ.2.50కోట్లతో తాగునీటి సదుపాయానికి పైపులైన్లు, ట్యాంకర్లు కల్పించేందుకు టెండర్లు ప్రక్రియ పూర్తయింది. నిర్వాసితుల కాలనీ ప్రాంతంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రూ.7కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, అప్రోచ్‌రోడ్లు నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే రూ.1.50 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగిలిన రూ.5.50కోట్ల పనులు చేపట్టాల్సి ఉంద’ని ఆర్డీవో తెలిపారు.