Share News

పోర్టు భూముల ఆక్రమణ

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:13 AM

మండలంలో ఉన్న కళింగపట్నం పోర్టు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.

       పోర్టు భూముల ఆక్రమణ
రాజారాంపురం ఉన్న పోర్టు భూములు

- అక్రమంగా భవనాల నిర్మాణం

- చెరువులు కూడా తవ్వకం

- భూ రికార్డులు లేకపోవడంతో బరితెగింపు

- ఏమీ చేయలేకపోతున్న అధికారులు

పోలాకి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఉన్న కళింగపట్నం పోర్టు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ భూములకు సంబంధించి అధికారిక రికార్డులు లేకపోవడంతో ఆక్రమణదారులు బరితెగిస్తున్నారు. యథేచ్ఛగా భూములను ఆక్రమించి భవనాలను నిర్మించడంతో పాటు చేపల చెరువులను తవ్వేస్తున్నారు. ఈ భూములను అధికారులు స్వాధీనం చేసుకుని, పేదల ఇళ్ల కోసం కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. స్వాతంత్ర్యానికి ముందు కళింగపట్నం-ఒడిశా పోర్టు ఉండేది. అప్పట్లో ఈ పోర్టు కోసం పోలాకి మండలం పల్లిపేట, రాజారాంపురం, నందిగాం గ్రామాల పరిధిలోని సర్వేనెం 77లో 31.45 ఎకరాల విస్తీర్ణంలో భూములను సేకరించారు. మరికొన్ని గ్రామాల్లో ఉన్న పది ఎకరాలను కలుపుకొని పోర్టుకు సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉండేవని స్థానిక పెద్దలు చెబుతున్నారు. అప్పట్లో ఓ నౌక రాజారాంపురం తీరం వద్ద ప్రమాదంలో చిక్కుకుని సముద్రంలో మునిగిపోయిందని, ఇప్పటికీ దాని ఆనవాళ్లు ఉన్నాయని అంటున్నారు. అయితే, కాలక్రమంలో పోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో, వాటి భూములపై ఆక్రమణదారుల కన్ను పడింది. పల్లిపేట, రాజారాంపురంలో ఉన్న పోర్టు భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు ఆ భూముల్లో చెరువులను తవ్వి ఉపాధి హామీ పనులు చేయించుకుని లబ్ధిపొందుతున్నారు. ఈ భూములకు సంబంధించి అఽధికారికంగా దస్త్రాలు లేవని, అయినా వాటిని ఆక్రమిస్తే కఠిన చర్యలుంటాయని రెవెన్యూ సిబ్బంది హెచ్చరిస్తున్నా ఆక్రమణదారులు వెనక్కితగ్గడం లేదు. జిల్లాలో చేపడుతున్న మూలపేట పోర్టు నిర్మాణ పనులు పరిశీలిస్తున్న అధికారులు పోలాకి మండల పరిధిలోని పోర్టు భూములపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విన్నవిస్తున్నారు.

పోర్టుభూమి నాకు అప్పగించాలి

రాజారాంపురం, నందిగాం ప్రాంతంలో ఉన్న పోర్టు భూమిని పోర్టు అధికారులు తనకు రాసిచ్చారని స్థానిక వ్యక్తి గనగళ్ల రాంబాబు రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. ఆ భూమిని తనకు అప్పగించాలని రెవెన్యూ అధికారులను కోరాడు. ఈ మేరకు పోర్టు అధికారులు ఇచ్చిన పత్రాలను రెవెన్యూ సిబ్బందికి చూపించాడు. అయితే, తమకు పోర్టుభూమి అప్పగించే అధికారం లేదని రెవెన్యూ సిబ్బంది ఆయనకు చెప్పారు.

రికార్డులు లేవు

రాజారాంపురం, పల్లిపేట, నందిగాం గ్రామాల పరిధిలో పోర్టు భూములు ఉన్నాయని అనుకోవడమే గానీ వాటికి సంబంధించిన రికార్డులు లేవు. పోర్టు భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై దృష్టిసారించి నోటీసులు జారీ చేస్తాం.

-పి.శ్రీనివాసరావు, తహసీల్దార్‌, పోలాకి

Updated Date - Sep 04 , 2025 | 12:13 AM