UPHC: డాక్టర్ ఇప్పుడే బయటకెళ్లారు!
ABN , Publish Date - May 02 , 2025 | 11:45 PM
Urban health centers పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. శ్రీకాకుళం నగరంలోని యూపీహెచ్‌సీల్లోని చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో సిబ్బందే మొక్కుబడిగా సేవలందిస్తున్నారు.
పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అరకొర సేవలు
అందుబాటులో ఉండని వైద్యులు
కనీస సౌకర్యాలు కరువు
కొరవడుతున్న పర్యవేక్షణ
రోగులకు తప్పని ఇబ్బందులు
అరసవల్లి, మే 2(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. శ్రీకాకుళం నగరంలోని యూపీహెచ్‌సీల్లోని చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో సిబ్బందే మొక్కుబడిగా సేవలందిస్తున్నారు. చాలామంది వైద్యులు హాజరు వేసుకుని.. వ్యక్తిగత పనులపై వెళ్లిపోతున్నారు. దీంతో రోగులు గంటల తరబడి నిరీక్షిస్తూ.. నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆర్థికభారమైనా తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రూ.కోట్లాది వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు గగనమవుతున్నాయని ఆరోపిస్తున్నారు.
అరసవల్లిలో.. అందుబాటులో ఉండరు
అరసవల్లిలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఎప్పుడు వచ్చినా.. డాక్టర్ గారు ఇప్పుడే బయటకు వెళ్లారని సిబ్బంది చెబుతున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు స్టాఫ్‌నర్సు, ఇతర సిబ్బంది రోగులకు వైద్యసేవలు అందిస్తూ నెట్టుకొస్తున్నారు. రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రికి ప్రహరీ లేకపోవడంతో రాత్రివేళ ప్రాంగణమంతా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కంపోస్టు కాలనీలో యూపీహెచ్‌సీలో రోజూ 60 మందికి పైగా రోగులు వైద్యసేవలు పొందుతున్నారు. ఉచితంగా పరీక్షలు, మందులు సరఫరా చేయడంతో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే మరింత మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం ఉంది.
గుజరాతీపేటలో సమస్యల నిలయం
గుజరాతీపేట యూపీహెచ్‌సీకి నిత్యం సుమారు 50 మంది రోగులు వస్తుంటారు. ఈ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుని.. సీలింగ్ పెచ్చులూడిపోతున్నాయి. గోడలు బీటలు వారిపోయాయి. దీంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ వైద్యసేవలు అందిస్తున్నారు. ఇక్కడ కనీసం నీరు కూడా అందుబాటులో ఉండదు. టాయిలెట్లు మూతపడడంతో మహిళా సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ల్యాబ్ పరీక్షల కోసం బకెట్లతో నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ భవనానికి మరమ్మతులు చేపట్టి.. కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
డీసీసీబీ కాలనీలో ఆస్పత్రి అడ్రస్ ఎవరికీ తెలీదు
డీసీసీబీ కాలనీలోని యూపీహెచ్‌సీలో ఏడాది కిందట వైద్యసేవలు ప్రారంభమయ్యాయి. కొత్తగా నిర్మించిన భవనంలోకి ఆస్పత్రిని మార్చారు. కాగా.. ఇక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉందనే విషయం ఈ ప్రాంతంలో ఉన్న చాలామందికే తెలియదు. అలాగే వైద్యుడు కూడా సరిగా అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రోగులకు పరీక్షలు నిర్వహించే సీబీసీ మిషన్ పాడైపోయి ఏడాదవుతున్నా బాగుచేయలేదు. ప్రస్తుతం రోజుకు 20 మంది వరకు రోగులు ఈ ఆస్పత్రికి వస్తున్నారు. ఆస్పత్రి బోర్డులు ఏర్పాటు చేసి, వైద్యుడు అందుబాటులో ఉంటే ఎంతో ప్రయోజననకరంగా ఉంటుంది.
బర్మా కాలనీలో ఫార్మసిస్టే వైద్యుడు
బర్మా కాలనీలో యూపీహెచ్‌సీని.. పాత భవనంలోనే నిర్వహిస్తున్నారు. ఈ ఆస్పత్రికి రోజూ 60 మంది వరకు రోగులు వస్తుంటారు. వైద్యుడు సక్రమంగా అందుబాటులో లేకపోవడంతో ఫార్మాసిస్టు, స్టాఫ్‌నర్సు సేవలు అందిస్తున్నారు. ఇక్కడకు ప్రతీ శుక్రవారం గైనకాలజిస్టు వస్తారు. గర్భిణులకు స్కానింగ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ బెడ్స్‌లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఆస్పత్రి బయట కాలువలో మురుగు పేరుకుపోయి దుర్గంథం వెదజల్లుతోంది.
అభివృద్ధి కమిటీలు నియమిస్తేనే...
ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన ఎటువంటి పనులు చేయాలన్నా, సేవలు మెరుగుపడాలన్నా అభివృద్ధి కమిటీలు కీలకం. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ ఆస్పత్రి అభివృద్ధి కమిటీలను నియమించలేదు. ఆసుపత్రులపై పర్యవేక్షణ లేకపోవడంతో యూపీహెచ్‌సీల్లో అరకొరగా సేవలు అందుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి యూపీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.