చెరువులను.. చెరబట్టారు
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:02 AM
Disappearing ponds.. లావేరు మండలంలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లూ కొండలు, ఖాళీ స్థలాలను కబ్జా చేయగా.. ప్రస్తుతం చెరువులను సైతం యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. చెరువు గర్భాలను చదును చేసి.. కొంతమంది మొక్కజొన్న సాగు చేస్తున్నారు.
లావేరు మండలంలో యథేచ్ఛగా ఆక్రమణలు
కొత్తకుంకాం, కొండకుంకాంలో కనుమరుగవుతున్న వైనం
ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు
లావేరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): లావేరు మండలంలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లూ కొండలు, ఖాళీ స్థలాలను కబ్జా చేయగా.. ప్రస్తుతం చెరువులను సైతం యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. చెరువు గర్భాలను చదును చేసి.. కొంతమంది మొక్కజొన్న సాగు చేస్తున్నారు. మరికొందరు సరుగుడు, నీలగిరి మొక్కల పెంపకం చేపడుతున్నారు. ప్రధానంగా కొత్తకుంకాం, కొండకుంకాం గ్రామాల్లో పలు చెరువులు ఆక్రమణకు గురై కనుమరుగవుతున్నాయి. ఈ ప్రాంత రైతులు వర్షాధారంపైనే సాగు చేస్తున్నారు. చెరువుల్లో నీటిని ఆయకట్టుకు మళ్లించి.. వరి, మొక్కజొన్న పంటలను పండించేవారు. కాగా ఒకప్పుడు నీటితో కళకళలాడే చెరువులు ఆక్రమణదారుల చెరలో పడి నేడు వెలవెలబోతున్నాయి. కొన్నిచోట్ల చెరువుల నామరూపాలు లేకుండా పోయాయి. దీంతో తమకు సాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ చెరువులు ఉన్నాయని చెప్పుకునే దుస్థితి ఎదురవుతోందని వాపోతున్నారు. చెరువుల ఆక్రమణపై అధికారులకు పలుమార్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించి.. ఆక్రమణలు తొలగించాలని, చెరువులను పరిరక్షించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఈ విషయమై తహసీల్దార్ జీఎల్‌వీ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. ఆక్రమణకు గురైన చెరువులను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
ఆక్రమణలెన్నో..
లావేరు మండలం కొండకుంకాం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 67, ఎల్‌పీ నెంబరు 887లో ఉన్న అక్కమ్మ చెరువు గర్భం 5.19 ఎకరాలు ఉండేది. సుమారు 20 ఎకరాల ఆయకట్టు భూమికి సాగునీరు అందించేది. కాగా.. ఈ చెరువు ఆక్రమణకు గురై ప్రస్తుతం 1.50 ఎకరాలు మాత్రమే మిగిలింది. సాగునీరు సక్రమంగా అందక ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొత్తకుంకాం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 202లో జగన్నాథ బందదీ అదే పరిస్థితి. గతంలో జగన్నాథ బంద గర్భం 5.37 ఎకరాల వరకు ఉండగా.. ఆక్రమణలకు గురై ప్రస్తుతం 1.70 సెంట్లు మాత్రమే మిగిలిందని రైతులు వాపోతున్నారు. ఈ చెరువు కింద ఆయకట్టు 15 ఎకరాల వరకు ఉందని, ఆక్రమణల కారణంగా సాగునీరు అందడం లేదని పేర్కొంటున్నారు.
కొత్తకుంకాం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 216-10లో చాకలి కోనేరు గర్భం 1.60 ఎకరాలకుగాను ఆక్రమణల కారణంగా కేవలం 70సెంట్లు మాత్రమే మిగిలింది. ఈ చెరువు కింద సుమారు 5 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందని రైతులు తెలిపారు. ఉపాధిహామీ పథకం కింద కొన్నాళ్లుగా ఈ చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించిందని పేర్కొన్నారు. ఆక్రమణల కారణంగా ఆ నిధులు కూడా వృథా అయ్యాయని వాపోతున్నారు.
కొత్తకుంకాం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 55లో పెద్ద కోనేరు చెరువు ఉంది. ఈ చెరువు మధ్యలో నుంచి మడ్డువలస సాగునీటి కాలువ ఏర్పడింది. దీని వలన ఆచెరువు రెండు పాయలుగా చీలిపోయింది. ఒకవైపు విడిపోయిన రెండు ఎకరాల విస్తీర్ణం గల చెరువును గ్రామానికి చెందిన కొంత మంది ఆక్రమించేస్తున్నారు. ఇప్పటికే ఎకరా వరకూ ఆక్రమించగా.. దీనిపై కొంతమంది యువకులు ఇటీవల ఆక్రమణదారులను ప్రశ్నించారు. కాగా.. ‘ఇదేం మా సొంతానికి కాదు. మన ఊర్లో ఉన్న దేవాలయానికి ఆదాయం తేవాలనే కారణంతో ఈ చెరువును చదును చేస్తున్నాం. ఈ స్థలంలో నీలగిరి, సరుగుడు మొక్కలను వేయనున్నామ’ని వారు బదులిస్తున్నారు. అయితే.. అవన్నీ ఉత్తిమాటలేనని.. ఆక్రమణకు యత్నిస్తున్నారని యువకులు ఆరోపిస్తున్నారు.
లావేరు మండలం చినమురపాకలోని డాబాలవానిచెరువు ఆక్రమణకు గురైంది. ఈ చెరువు గర్భం సుమారు 350 ఎకరాలు ఉండేది. ఈ చెరువు నీటి ఆధారంగా దాదాపు 750 ఎకరాల్లో ఆయకట్టు సాగు చేసేవారు. కాగా ఈ చెరువు క్రమేపీ సుమారు 75 ఎకరాల మేరకు ఆక్రమణకు గురైంది. ఆ భూమిలో ప్రస్తుతం కొందరు వరి, పత్తి పండిస్తున్నారు. కొంతమంది సరుగుడు, నీలగిరి మొక్కలు పెంచుతున్నారు. ఇంకొందరు పంట కళ్లాలుగా వినియోగిస్తున్నారు.