Share News

మాట్లాడండి ప్లీజ్‌!

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:32 AM

ZP general meeting today జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం శనివారం జరగనుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారుల సమక్షంలో నిర్వహించనున్న ఈ సమావేశంపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేవలం అజెండాలో అంశాలను చదివి... మొక్కుబడి సమావేశంగా కాకుండా... క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నారు.

మాట్లాడండి ప్లీజ్‌!
జడ్పీ సమావేశ మందిరం

  • రెండుశాఖల మధ్య కొరవడిన సమన్వయం

  • రోడ్డు మరమ్మతులపై దీని ప్రభావం

  • ధాన్యం కొనుగోలులో దళారుల హవా

  • రబీకి విత్తనాలు, ఎరువులు అవసరం

  • రిమ్స్‌లో అరకొరగా వైద్య సేవలు

  • ఉద్దానంలో ఇంటింటికీ తాగునీరేదీ?

  • అక్కడక్కడా విజృంభిస్తున్న జ్వరాలు

  • నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

  • సభ్యులు నోరు విప్పితేనే పరిష్కారం

  • శ్రీకాకుళం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం శనివారం జరగనుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారుల సమక్షంలో నిర్వహించనున్న ఈ సమావేశంపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేవలం అజెండాలో అంశాలను చదివి... మొక్కుబడి సమావేశంగా కాకుండా... క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నారు. గత జడ్పీ సర్వసభ్య సమావేశం.. వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు పాలకొండలో గౌరవం లభించలేదన్న కారణంతో చర్యలు తీసుకోవాలని కోరుతూ అధిక మొత్తంలో వైసీపీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు వాకౌట్‌ చేశారు. దీంతో కోరం సరిపడక సర్వసభ్య సమావేశం వాయిదా వేశారు. మళ్లీ నేటి సమావేశం ఎలా జరుగుతుందోనని చర్చనీయాంశమవుతోంది.

  • సమస్యలెన్నో..

  • జిల్లాలో సమస్యల చిట్టా చాలా పెద్దదే ఉంది. ప్రధానంగా వ్యవసాయం, తాగునీరు, రోడ్ల దుస్థితిపై ఈ సమావేశంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. గ్రామీణ రహదారులు అధ్వానంగా, గుంతలమయంగా మారాయి. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ అధికారుల మధ్య సమన్వయలోపంతో కొన్ని రోడ్ల మరమ్మతులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. సమావేశంలో దీనిపై ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి.

  • ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నష్టం చేకూర్చేలా దళారులు వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల తూనికల్లో తేడాలు జరుగుతున్నాయి. మెళియాపుట్టి మండలంలో అర్ధరాత్రి ట్రక్‌షీట్లను తెరిచారు. ఈ విషయాన్ని స్వయంగా జేసీ గుర్తించి చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.

  • వంశధార, నాగావళి జలాలు పుష్కలంగా ఉన్నా.. కాలువల పూడికతీత పనులు సక్రమంగా లేక శివారు భూములకు సాగునీరు అందడం లేదు. రబీ సీజన్‌ ప్రారంభం నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల లభ్యతపై వ్యవసాయశాఖ స్పష్టత ఇవ్వాలి

  • అరకొరగా వైద్యసేవలు

  • ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్‌)లో 373 వెంటిలేటర్లు ఉండగా... ఇందులో ఏకంగా 331 పాడైపోయాయి. కేవలం 42 మాత్రమే పనిచేస్తున్నాయి. ఆసుపత్రిలో కొన్ని వార్డులకు వెంటిలేటర్ల అవసరమైనప్పటికీ ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అధికమంది ప్రభుత్వ వైద్యాధికారులు.. డ్యూటీ వేళల్లో.. అక్కడ ఎఫ్‌ఎల్‌ఆర్‌ఎస్‌లో హాజరు వేసుకుని.. మళ్లీ సొంత క్లినిక్‌లకు అతుక్కుపోతున్నారు. దీనిపై కూలంకుషంగా.. చర్చించి.. ప్రభుత్వ వైద్యం పేదలకు చేరువకావాలి.

  • ఉద్దానంలో కిడ్నీ బాధితులకు అందుతున్న వైద్య సేవలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనితీరు, మందుల కొరత వంటి అంశాలపై సభ్యులు అధికారులను నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇంటింటికీ తాగునీరు అందించే ప్రాజెక్టు పనులు ఏ దశలో ఉన్నాయో సమీక్షించాలి.

  • జిల్లావ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీనికి తోడు స్క్రబ్‌టైఫస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. లావేరు మండలంలో ఇటీవల ఒక కేసు నమోదైంది. గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. నిధుల కొరతతో గ్రామ పంచాయతీలు సతమతమవుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల, వినియోగంపై స్పష్టత రావాల్సి ఉంది.

  • ఇసుక, కంకర తరలిపోతోంది...

  • వంశధార, నాగావళి నదీ తీరాల నుంచి అనుమతులు లేని చోట ఇసుక తరలిపోతోంది. కొన్నిచోట్ల నిబంధనలకు వ్యతిరేకంగా యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. ఇష్టానుసారంగా కొండలను తవ్వి కంకరను కూడా తరిలిస్తున్నారు. అధికారులు కనీస దాడులు చేయడంలేదు. ఈ అక్రమాలు అరికట్టాలి.

  • భూసమస్యలపై అసంతృప్తి...

  • ఇటీవల విజయవాడలో కలెక్టర్ల సదస్సు జరిగింది. జిల్లాలో భూసమస్యలు అధికంగా ఉన్నాయని.. నివేదికలో స్పష్టమైంది. భూ సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వేలోపాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ సమస్యలు సత్వరమే పరిష్కారం కావాలని.. ఇందుకోసం యంత్రాంగం మండలాల వారీగా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో సభ్యులు ప్రశ్నిస్తే బాగుంటుంది.

  • ప్రధాన శాఖలకు అధికారులే లేరు

  • జిల్లాలో కీలక అంశాలను.. ప్రజలకు అత్యవసరమైన విభాగాలను.. పర్యవేక్షించే ఉన్నత అధికారులు చాన్నాళ్ల నుంచి లేరు. అంతటా ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. ఇటీవల డ్వామా పీడీ విజయవాడ సెర్ప్‌కు బదిలీఅయ్యారు. జిల్లా రిజిస్ట్రేషన్‌ అధికారి లేరు. జిల్లా రెవెన్యూ అధికారి కూడా ఇన్‌చార్జే. ఇలా చాలా కీలక శాఖలకు ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. ప్రజలకు సేవలు చేరువకావాలంటే జిల్లా ప్రభుత్వ విభాగాలకు కూడా పూర్తిస్థాయిలో అధికారి అవసరం. వీటిపైనా ప్రశ్నలు సంధించి.. పరిష్కార మార్గం చూపాలి.

Updated Date - Dec 20 , 2025 | 12:32 AM