Share News

ప్రజాప్రతినిధులూ.. సమస్యలపై చర్చించరూ!

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:50 PM

ZP general meeting today రాష్ట్రంలోనే తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాగా ‘శ్రీకాకుళం’ గుర్తింపు పొందింది. శ్రీకాకుళం.. వెనుకబడిన జిల్లా కాదు. వెనుకకు నెట్టబడిన జిల్లా అని తరచూ ప్రజాప్రతినిధులు చెబుతుంటారు. కానీ జిల్లా అభివృద్ధి విషయంలో వేదికగా ఉన్న జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి కీలక ప్రజా ప్రతినిధులే గైర్హాజరవుతున్నారు.

ప్రజాప్రతినిధులూ.. సమస్యలపై చర్చించరూ!
జిల్లా పరిషత్‌ సమావేశమందిరం

  • నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

  • ఎప్పుడూ కొన్ని శాఖలకే పరిమితం

  • ప్రాధాన్యాలను పక్కనపెట్టేస్తున్న వైనం

  • అభివృద్ధి జరగాలంటే సుదీర్ఘ చర్చ అవసరం

  • శ్రీకాకుళం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాగా ‘శ్రీకాకుళం’ గుర్తింపు పొందింది. శ్రీకాకుళం.. వెనుకబడిన జిల్లా కాదు. వెనుకకు నెట్టబడిన జిల్లా అని తరచూ ప్రజాప్రతినిధులు చెబుతుంటారు. కానీ జిల్లా అభివృద్ధి విషయంలో వేదికగా ఉన్న జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి కీలక ప్రజా ప్రతినిధులే గైర్హాజరవుతున్నారు. దీంతో ప్రాధాన్య విషయాలపై చర్చ జరగకుండా.. మొక్కుబడిగానే సమావేశం సాగిపోతోంది. సమస్యలకు పరిష్కారం కరువవుతోంది. ఆదివారం జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనైనా ప్రజల సమస్యలపై ప్రజాప్రతినిధులు చర్చించి.. పరిష్కారం చూపాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

  • సమస్యలెన్నో..

  • జిల్లావ్యాప్తంగా జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతీ గ్రామంలోనూ పదుల సంఖ్యలో జ్వరపీడితులు ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు సక్రమంగా అందక.. ప్రైవేటు ఆసుపత్రులను అధికంగా రోగులు ఆశ్రయిస్తున్నారు. ఫీజులు, మందుల కోసం వేలాది రూపాయలు చెల్లించి ఈసురోమంటున్నారు. గ్రామాల్లో జ్వరాల నియంత్రణకు పీహెచ్‌సీల వారీగా తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తే ప్రయోజనం ఉంటుంది.

  • శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చాలామంది వైద్యులు ప్రతిరోజూ హాజరు వేసుకుని.. కొన్ని నిమిషాల్లోనే తమ సొంత క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. అలాగే ప్రైవేటు క్లినిక్‌లపై కనీస తనిఖీలు లేవు. ఈ విషయమై సమగ్ర చర్చ సాగితే.. డ్యూటీవేళల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉంచేందుకు ఆస్కారం ఉంటుంది.

  • ‘యూరియా’.. ఇప్పుడు రైతాంగాన్ని పట్టిపీడిస్తుంది. జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు సమృద్ధిగా మంజూరైనా.. కొన్ని అవాంతరాలు వల్ల రైతుల్లో అలజడి నెలకొంది. ఎరువుల దుకాణాల్లో జరుగుతున్న తంతు... విజెలెన్స్‌ అధికారుల దాడులు.. ఇటువంటి వాటిపై చర్చించాలి. యూరియా కోసం రైతులు ఆందోళన చెందకుండా భరోసా కల్పించాలి.

  • ప్రభుత్వాలు మారినా గ్రామాల్లో బెల్టు దుకాణాలు వేలం పాటతో ఏర్పాటు చేసుకున్నారు. ఇవి అనధికారికమే. అయినా.. వీటిపై నియంత్రణ లేదు. గ్రామాల్లో బెల్టు దుకాణాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించాలి.

  • వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇళ్ల పేరిట అక్రమాలు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కొంతమందికి ఇచ్చిన స్థలాలు కొండలు, గుట్టలులో ఉన్నాయి. వాటి జోలికి లబ్ధిదారులు వెళ్లలేదు. కానీ ఆ స్థలాలను చదున చేసినట్లు చూపించి నిధులు కాజేశారు. వీటిపై చర్చ జరగాలి.

  • జల్‌జీవన్‌ మిషన్‌ పనుల పేరిట గత ప్రభుత్వం నాన్చుడు వ్యవహారం చేసింది. కూటమి ప్రభుత్వం ఈ పనుల గడువును పెంచింది. కానీ ఏ మండలంలోనూ పూర్తిస్థాయిలో పనులు నిర్వహించలేదు. పట్టణాల్లో పైపులైన్ల కోసం రోడ్లను ఇష్టానుసారంగా తవ్వేశారు. యాభైశాతం కూడా ఇంటింటికీ తాగునీరు ఇచ్చే పరిస్థితి ఇప్పటికీ కల్పించలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలి.

  • శ్రీకాకుళంలో కోడిరామ్మూర్తి స్టేడియం పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీనిపై చర్చించి ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత నివ్వాలి.

  • కొత్తూరు, హిరమండలం, శ్రీకాకుళం రూరల్‌, గార మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లాలో పలుప్రాంతాల్లో సాగునీటి చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. దీనిపై కూలంకుషంగా చర్చించాలి.

  • పలాస నియోజకవర్గంలో వంశధార ఎడమ ప్రధానకాలువ శిఽథిలావస్థకు గురైంది. 2800 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తేనే మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాలకు సాగునీరు చేరుతుంది. కానీ కాలువ అధ్వాన స్థితి కారణంగా 1400 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోంది. దీంతో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.

  • వంశధార షట్టర్ల కుంభకోణంపై సీఐడీ కేసు.. దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. అవసరమైన చోట షట్టర్లు లేక కాలువల నుంచి సాగునీరు అందక నరసన్నపేట, ఆమదాలవలస, టెక్కలి నియోజకవర్గ రైతులు అవస్థలు పడుతున్నారు.

  • ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, పొందూరు మండలాలకు నారాయణపురం ఆనకట్ట, మడ్డువలస ప్రాజెక్టు, తోటపల్లి కాలువే ఆధారం. కాలువల తవ్వకాలు ఏళ్లతరబడిగా సాగుతున్నాయి. సాగునీరు సక్రమంగా అందడం లేదు. వీటిపై జడ్పీ సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Sep 20 , 2025 | 11:50 PM