పోలీసు శిక్షణ అత్యంత విలువైనది
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:21 AM
పోలీసు శిక్షణ అత్యంత విలువైనది, ఇష్టపడి ట్రైనింగ్ పొందితే కష్టం తెలియదని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.
ఎస్పీ మహేశ్వరరెడ్డి
కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం
శ్రీకాకుళం రూరల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పోలీసు శిక్షణ అత్యంత విలువైనది, ఇష్టపడి ట్రైనింగ్ పొందితే కష్టం తెలియదని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. మండలంలోని తండేంవలస వద్దనున్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఇటీవల కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లకు సోమవారం శిక్షణ ప్రారంభమైంది. ఇక్కడ రాజమండ్రి, కృష్ణా జిల్లాలకు చెందిన 145 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, శారీరక దృఢత్వంతో పాటు సాంకేతిక నైపుణ్యం, ప్రజలపై సేవాభావంతో మెలగాలని అభ్యర్థులకు సూచించారు. ‘సమయాన్ని వృథా చేయకుండా శిక్షణను వినియోగించుకోవాలి. చట్టాలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి. పోలీసు అంటే ఉపాధి మాత్రమే కాదు.. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు అంకితమైన సేవా వృత్తి. క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయతీ, ధైర్యం వంటి లక్షణాలను జీవితంలో అలవర్చుకోవాలి. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణలో పోలీసు విభాగం కీలకం. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.’అని ఎస్పీ తెలిపారు. శిక్షణ సమయంలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.