ఆన్‌లైన్ గేమ్స్ ఆడి అప్పులపాలై
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:27 PM
ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గులుమూరు గ్రామంలో చోటుచేసుకుంది.
-గులుమూరులో ఒకరి ఆత్మహత్య
హిరమండలం, జూలై16 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గులుమూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఎండీ యాసిన్ వివరాల మేరకు.. గులుమూరుకు చెందిన మజ్జి బుజ్జి (40) అనే వ్యక్తి హిరమండలంలోని ఓ వాటర్ ప్లాంట్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. బుజ్జి గత కొంత కాలంగా ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతున్నాడు. దీనికోసం పలుచోట్ల అప్పులు చేశాడు. ఇందులో భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మంగళవారం గడ్డి మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బుజ్జికి భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.