Share News

తీరానికి తాటి!

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:40 AM

Focus on coastal protection జిల్లాలో తీరప్రాంత రక్షణపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏటా విపత్తుల సమయంలో వందల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుంటాయి. ఆ సమయంలో ప్రజలకు అపారనష్టం కలుగుతోంది.

తీరానికి తాటి!

సముద్ర తీరప్రాంత రక్షణపై అటవీశాఖ దృష్టి

11 మండలాల్లో తాటి విత్తనాలు నాటేందుకు చర్యలు

ఇచ్ఛాపురం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తీరప్రాంత రక్షణపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏటా విపత్తుల సమయంలో వందల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుంటాయి. ఆ సమయంలో ప్రజలకు అపారనష్టం కలుగుతోంది. దీనిని నియంత్రించేందకు తీరప్రాంతం పొడవునా తాటిచెట్లు పెంచాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలతోపాటు స్థానిక సంస్థల భాగస్వామ్యం చేయనుంది. జిల్లాలో 193 కిలోమీటర్ల తీరప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 25.12కిలోమీటర్ల తీరప్రాంతం రెడ్‌జోన్‌లో ఉన్నట్టు తేలింది. గతంలో తాటిచెట్లు ఉన్న ప్రాంతంలో విపత్తులు వచ్చినా పెద్దగా నష్టం జరగలేదు. అందుకే జిల్లాలోని 11 తీర మండలాల్లో తాటిచెట్లు పెంచాలని అటవీశాఖ నిర్ణయించింది. శ్రీకాకుళం డివిజన్‌లో 50వేలు, టెక్కలి, కాశీబుగ్గ డివిజన్లలో 25 వేల చొప్పున తాటి విత్తనాలను తీర ప్రాంతంలో నాటనుంది. కాశీబుగ్గ డివిజన్‌ పరిధిలో ట్రీ ఫౌండేషన్‌ తాటిచెట్ల విత్తనాలు నాటేందుకు, రక్షణ కల్పించేందుకు ముందుకు వచ్చింది. మిగతాచోట్ల సైతం స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసేందుకు అటవీ శాఖ ప్రయత్నిస్తోంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ తీరప్రాంతం 193 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇచ్చాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్‌, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో వందలాది మత్స్యకార గ్రామాలున్నాయి. జిల్లాలోని బాహుదా, మహేంద్రతనయా, వంశధార, నాగావళి నదులు సముద్రంలో కలుస్తున్నాయి. నదుల సంగమం వద్ద ఏటా వరదలు పోటెత్తుతుండడంతో తీరం కోతకు గురవుతోంది. నదీ పరీవాహక ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మించకపోవడం, నీటి స్థిరీకరణకు అవకాశం లేకపోవడం, కరకట్టల నిర్మాణం చేపట్టకపోవడంతో నీటి ప్రవాహ గమనం పెరిగి ఒకేసారి సముద్రంలోకి నీరు పోటెత్తుతోంది. అదే సమయంలో సముద్రం ఉగ్రరూపం దాల్చుతుండడంతో తీరం కోతకు గురవుతోందని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో శ్రీకాకుళం రూరల్‌, ఎచ్చెర్ల, పోలాకి, సోంపేట, మందస, ఇచ్ఛాపురం, కవిటి తీరంలోనే కోత అధికంగా కనిపిస్తోంది. తీరప్రాంతం కోతకు ఉష్ణ మండల తుఫాన్లు , రుతుపవనాల సీజన్‌లో వచ్చే వరదలు, సముద్ర మట్టాల పెరుగుదల, పోర్టులు, హార్బర్ల నిర్మాణం, మడ అడవుల నరికివేత, సముద్ర జలాలు కలుషితం కావడం, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల కలయికతో సముద్ర జలాల అమ్లీకరణ వంటివి కారణాలుగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అందుకే తీరంలో పెద్దఎత్తున తాటిచెట్లను పెంచడం ద్వారా విపత్తుల నష్టాన్ని నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మంచి నిర్ణయం

తీరప్రాంతంలో తాటిచెట్లు పెంచేలా అటవీ శాఖ మంచి నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని తీర ప్రాంతంలో ఒకప్పుడు ఉండే సరుగుడు, నీలగిరి తోటలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు తాటిచెట్లు పెరిగితే మాత్రం తీరానికి కొండంత అండే. ఇది శుభ పరిణామం.

- గోపాల్‌, మత్స్యకారుడు, డొంకూరు

Updated Date - Oct 07 , 2025 | 12:40 AM