Share News

Mee-Kosam: సారూ.. మొర వినరూ

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:20 PM

Public welfare program శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.. ‘మీ-కోసం’ కార్యక్రమానికి వినతులు పోటెత్తాయి. జిల్లావ్యాప్తంగా 190 ఫిర్యాదులు అందాయి. గత వారం రంజాన్‌ నేపథ్యంలో ‘మీ-కోసం’ రద్దు కావడంతో సోమవారం రద్దీ కనిపించింది.

Mee-Kosam: సారూ.. మొర వినరూ
అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • ‘మీ-కోసం’ కార్యక్రమానికి పోటెత్తిన వినతులు

  • కార్యాలయంలోకి వెళ్లేందుకు దివ్యాంగులకు ఇబ్బందులు

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.. ‘మీ-కోసం’ కార్యక్రమానికి వినతులు పోటెత్తాయి. జిల్లావ్యాప్తంగా 190 ఫిర్యాదులు అందాయి. గత వారం రంజాన్‌ నేపథ్యంలో ‘మీ-కోసం’ రద్దు కావడంతో సోమవారం రద్దీ కనిపించింది. ఫిర్యాదుదారులతో నమోదు కేంద్రం కిటకిటలాడింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీదారులు అధికారులకు మొరపెట్టుకున్నారు. కాగా.. ‘మీ-కోసం’ కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు ఇచ్చేందుకు ట్రైసైకిల్‌పై వచ్చిన ఓ దివ్యాంగురాలిని కార్యాలయంలోకి తీసుకువెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హాల్‌ లోపలకు వెళ్లే మార్గం ఇరుకుగా.. ఎత్తుగా ఉండడంతో ఆపసోపాలు పడ్డారు. వినతులు ఇచ్చేందుకు వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

  • ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

  • ‘మీ కోసం’ కార్యక్రమం ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ‘మీ-కోసం’లో 190 ఫిర్యాదులు రాగా.. అందులో అత్యధికంగా రెవెన్యూశాఖకు సంబంధించి 79 ఉన్నాయని తెలిపారు. ‘హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో సంబంధిత శాఖల అధికారులు బాధ్యతగా చర్యలు తీసుకోవాలి. అర్జీలు రీఓపెన్‌ కాకుండా చూడాలి. సమన్వయంతో అర్జీల సత్వర పరిష్కారానికి కృషి చేయాల’ని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:20 PM