collecter: నిర్ణీత సమయంలో అర్జీలు పరిష్కరించాలి
ABN , Publish Date - May 20 , 2025 | 12:24 AM
Public grievances అర్జీలు పెండింగ్‌లో లేకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 19(ఆంధ్రజ్యోతి): అర్జీలు పెండింగ్‌లో లేకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీ-కోసం’ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ 75 మంది అర్జీలను సమర్పించారు. వివాదాలకు తావులేకుండా.. అర్జీదారులు సంతృప్తి చెందేలా ఆ వినతులు సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
గాలీవాన, పిడుగుల ముప్పుపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జడ్పీ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ‘పిడుగుపాటు సమాచారం అందిన వెంటనే గ్రామస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలి. వ్యవసాయ, పశుసంపద, తోటలు, చెట్లు పడిపోవడం, విద్యుత్తు లైన్లు దెబ్బతినడం వంటి సమాచారంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. వాతావరణ హెచ్చరికలు వచ్చిన వెంటనే సంబంధిత గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి’ అని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో వేంకటేశ్వరరావు, ఉప కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.