Share News

వరికి తెగుళ్ల పంజా

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:30 AM

croff loss in the former వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ ఆయకట్టు రైతులు ఈ ఏడాది ముప్టేట దాడికి గురవుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ మధ్యలో భారీ వర్షాల కారణంగా వరి పంట ముంపునకు గురికాగా ఆందోళన చెందారు. తాజాగా వరి పంటకు పొట్టదశలో దోమపోటు తెగులు సోకడంతో మరింత కలవరపడుతున్నారు.

వరికి తెగుళ్ల పంజా
జమ్ములో తెగుళ్లు నివారణకు పురుగు మందు పిచికారి చేస్తున్న రైతు

రైతులను వేధిస్తున్న దోమపోటు

ఎర్రగా మారుతున్న పైరు

నరసన్నపేట, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ ఆయకట్టు రైతులు ఈ ఏడాది ముప్టేట దాడికి గురవుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ మధ్యలో భారీ వర్షాల కారణంగా వరి పంట ముంపునకు గురికాగా ఆందోళన చెందారు. తాజాగా వరి పంటకు పొట్టదశలో దోమపోటు తెగులు సోకడంతో మరింత కలవరపడుతున్నారు. జిల్లాలోని 3.94 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో విత్తనాలు వేసేందుకు వర్షాలు సమృద్ధిగా కురిసినా.. ఉబాలు వేసే సమయంలో కాస్త ఆలస్యమయ్యాయి. ఆగస్టు 18 నాటికి జిల్లా అంతటా ఊబాలు పూర్తయ్యాయి. మెన్నటివరకు యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. తర్వాత తుఫాన్‌లతో పంట ముంపునకు గురై ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం పంటకు తెగుళ్ల బెడద వెంటాడుతుండడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట, సంతబొమ్మాళి, టెక్కలి, పలాస, శ్రీకాకుళం రూరల్‌, గార, ఆమదాలవలస, ఎల్‌.ఎన్‌.పేట తదితర మండలాల్లో వరి పైరుకు తెగుళ్లు విజృంభిస్తున్నాయి. తెల్లదోమపోటు, బూజు తెగులు, ఆకుచుట్టు పురుగు, మెడవిరుపు లాంటి తెగుళ్లు సోకాయి. కొంతమంది రైతులు ఇప్పటివరకూ రెండుసార్లు పురుగు మందు పిచికారీ చేశారు. 40 రోజులకోసారి పురుగుమందు పిచికారీ చేస్తున్నామని, ఎకరానికి కనీసం రూ.3వేలకు పైగా ఖర్చువుతోందని రైతులు పేర్కొంటున్నారు. యూరియా, పొటాష్‌ వేసినా తెగుళ్ల కారణంగా పంట ఎదుగుదల లోపించి ఎర్రగా మారుతోందని వాపోతున్నారు. ఈ ఏడాది పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని దిగులు చెందుతున్నారు. అధికారులు స్పందించి పంటకు తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఆందోళన వద్దు

వరి పంటకు తెగుళ్లు సోకిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏవోలు, వీఏఏలు రైతులకు అందుబాటులో ఉంటారు. వారి సలహాలను పాటించి పురుగు మందులు పిచికారీ చేయాలి. అగ్గి తెగులు, బూజు తెగులు, దోమకాటుకు సంబంధించి తరుచూ వరిపైరును రైతులను పరిశీలించాలి. వాతావరణంలో మార్పులు ఫలితంగా దోమ ఆశించే అవకాశం ఉంది. వైరస్‌ విస్తరించకుండా అప్రమత్తంగా ఉంటూ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలి.

- వెంకట మధు, ఏడీఏ, నరసన్నపేట

Updated Date - Oct 07 , 2025 | 12:30 AM