Share News

Government hospital: పేరుకే పెద్దాసుపత్రి

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:54 PM

Hospital staff shortage అది జిల్లాకే పెద్దాసుపత్రి. జిల్లా నలుమూలల నుంచి అత్యవసర, ప్రమాదకర స్థితిలో ఉన్న కేసులు ఇక్కడికే రిఫరల్‌పై వస్తుంటాయి. 24 గంటలు ఆసుపత్రిలో సేవలు అందించాలి. కానీ సమస్యల నడుమ సక్రమంగా సేవలు అందక రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌- రిమ్స్‌)లో దుస్థితి.

Government hospital: పేరుకే పెద్దాసుపత్రి
శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి

  • జీజీహెచ్‌లో వెంటాడుతున్న సమస్యలు

  • తరచూ విద్యుత్‌ కోతతో చీకట్లు

  • అరకొర సిబ్బందితో రోగులకు ఇక్కట్లు

  • శ్రీకాకుళం రిమ్స్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): అది జిల్లాకే పెద్దాసుపత్రి. జిల్లా నలుమూలల నుంచి అత్యవసర, ప్రమాదకర స్థితిలో ఉన్న కేసులు ఇక్కడికే రిఫరల్‌పై వస్తుంటాయి. 24 గంటలు ఆసుపత్రిలో సేవలు అందించాలి. కానీ సమస్యల నడుమ సక్రమంగా సేవలు అందక రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌- రిమ్స్‌)లో దుస్థితి. ఈ పెద్దాసుపత్రిలో తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. చీకట్లోనే రోగులు ఉండాల్సిన పరిస్థితి ఎదరవుతోంది. 930 పడకల ఆసుపత్రిలో పనిచేసేది కేవలం ముగ్గురు ఎలక్ట్రీషియన్లే. అందులోను ఒక్కరే పర్మినెంట్‌ ఉద్యోగి. దీనికి తోడు దశాబ్దాల కిందట వేసిన విద్యుత్‌ కేబుల్‌ వైర్లు. వెరసి తరచుగా విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు, షార్ట్‌ సర్క్యూట్‌లు సర్వసాధారణమై పోయాయి. సుమారు రెండు నెలల కిందట చిన్నపిల్లల వార్డులో షార్ట్‌సర్క్యూట్‌తో కేబుల్‌ వైర్లు కాలిపోయాయి. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిపోయింది. అలాగే మూడు రోజుల కిందట ప్రసూతి వార్డులో అర్థరాత్రి సమయంలో సుమారు నాలుగు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో గర్భిణీలు, బాలింతలు, పసిబిడ్డలు నరకయాతన అనుభవించారు. పాత కే బుల్‌ కాలిపోవడం వల్లనే ఈ ఇబ్బంది తలెత్తింది. నిజానికి ఆసుపత్రికి సంబంధించి సబ్‌స్టేషన్‌, పవర్‌ ప్యానెల్స్‌, జనరేటర్స్‌, కేబుల్స్‌ మెయింటెనెన్స్‌ చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్ట్రీషియన్లదే. కానీ ఉన్నదేమో కేవలం ముగ్గురే. రోజుకు మూడు షిఫ్పుల్లో పనిచేయాల్సి ఉంటుంది. మరి ముగ్గురితో మొత్తం నిర్వహణ ఎలా సాధ్యపడుతుందో ఆ అధికారులకే ఎరుక. దీనికి సంబంధించి ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజినీరింగ్‌ విభాగం మెయింటెనెన్స్‌ సిబ్బందిని సుమారు పదిమంది క్వాలిఫైడ్‌ ఎలక్ట్సీషియన్లు, అలాగే ఆసుపత్రికి సంబంధించి మరో పదిమంది ఎలక్ట్రీషియన్ల అవసరం ఉంది. కానీ అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూనే ఉన్నా, ఆచరణకు నోచుకోవడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ముగ్గురిలో ఎవరైనా ఎలక్ర్టీషియన్‌ సెలవు పెడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. అలాగే ఆసుపత్రిలో ఐదు లిఫ్ట్‌లు ఉండగా.. కేవలం ఒక్కరే ఆపరేటర్‌ ఉన్నాడు. లిఫ్ట్‌లు కూడా తరచూ మొరాయిస్తూనే ఉన్నాయి. గైనిక్‌ వార్డులోని లిఫ్ట్‌ సంవత్సరం పొడవునా పాడవుతూనే ఉంటోంది. అధికారులు వస్తున్నారు. వెళ్తున్నారు. నాయకులు తరచు పరిశీలించడం, హామీలు ఇవ్వడం తప్ప సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు,పాలకులు స్పందించి జీజీహెచ్‌లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:54 PM