fishing harbor : ఫిషింగ్ హార్బర్‌తో శాశ్వత ఉపాధి
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:08 AM
The welfare of fishermen is the goal భావనపాడులో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో మత్స్యకారులకు శాశ్వత ఉపాధి లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం భావనపాడులో రేషన్‌కార్డు లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులు పంపిణీ చేశారు.
- మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం
- త్వరలో కిరాణాషాపుల మాదిరి రేషన్ డిపోలు
- వికలాంగుల పింఛన్లపై వైసీపీ నాయకుల దుష్ప్రచారం తగదు
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
సంతబొమ్మాళి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): భావనపాడులో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో మత్స్యకారులకు శాశ్వత ఉపాధి లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం భావనపాడులో రేషన్‌కార్డు లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులు పంపిణీ చేశారు. రూ.1.60 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మత్స్యకారుల సమస్యలు తెలుసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘భావనపాడులో హార్బర్ నిర్మాణ విషయమై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి కేంద్ర మత్స్యశాఖ మంత్రిని కోరాం. అంచనాలు రూపొందించాం. హార్బర్ నిర్మాణం పూర్తయితే మత్స్యకారులందరికీ శాశ్వత ఉపాధి లభిస్తుంది. సముద్రంలో ఇసుక మేటను తొలగిస్తాం. భావనపాడులో కొత్తగా విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తాం. హార్బర్ వద్ద సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడతాం. కూటమి పాలనలో ఒక్క భావనపాడు గ్రామంలోనే రూ.2.55 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టాం. ఇంటింటికీ కుళాయి కోసం రూ.కోటి మంజూరు చేశామ’ని తెలిపారు.
‘మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తున్నాం. 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారుడికి రూ.20వేల చొప్పున ఆర్థికసాయం అందించాం. వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతిని విస్మరించింది. సముద్రంలో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు పరిహారంతోపాటు బోట్లకు సబ్సిడీ డీజిల్ బకాయిలు కూడా చెల్లించలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకు బకాయిలు చెల్లించాం. భావనపాడు మత్స్యకారులకు రూ.35లక్షలతో బోట్లుకు ఇంజన్లు ఇచ్చి ఆదుకున్నామ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు.
‘అనర్హులైన వికలాంగుల పింఛన్లు తొలగిస్తే వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో 6వేల మంది పింఛన్లు తొలగించినట్టు కలెక్టర్‌కు తప్పుడు ఫిర్యాదులు చేశారు. కేవలం 90 మంది అనర్హులకు మాత్రమే పింఛన్లు తొలగించాం. త్వరలో రాష్ట్రంలో రేషన్‌డిపోలు నెలరోజులపాటు తెరిచే ఉంటాయి. బియ్యంతోపాటు కిరాణాషాపుల మాదిరి అన్ని నిత్యావసర వస్తువులు విక్రయిస్తారు. బియ్యం వద్దనుకున్న వారు ఇతర సరుకులు తీసుకొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈనెల 4న రాష్ట్రంలో 16700 మంది కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 11వేల బస్సులు ఉండగా వాటిలో 9వేల బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించామ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు. కొంతమంది వైసీపీ నాయకులు ఉచిత బస్సులు ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై అనుమానం ఉంటే వైసీపీ నాయకులంతా చీరలు కట్టుకుని బస్సులెక్కాలని ఎద్దేవా చేశారు. ప్రశ్నించేవాళ్లు.. అసత్య ప్రచారం చేసేవాళ్లు బస్సు ఎక్కి మహిళలకు ప్రయాణం ఉచితమో కాదో తెలుసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, టీడీపీ నాయకులు హరివరప్రసాద్, ఎల్.ఎల్.నాయుడు, జీరు భీమారావు, అట్టాడ రాంప్రసాద్, రెడ్డి అప్పన్న కూశెట్టి కాంతారావు, బాడాన రమణమ్మ, జనసేన ఇన్‌చార్జి కె.కిరణకుమార్ పాల్గొన్నారు.